1,500 రోజులకు చేరుతున్న అమరావతి రైతు ఉద్యమం

అమరావతి రాజధానిని దెబ్బతీస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై పోరు కొనసాగిస్తున్నారు. 25న వెలగపూడిలో బహిరంగ సభ.;

Update: 2024-01-21 07:29 GMT
అమరావతి రైతుల ఆందోళన (పాత చిత్రం)

అమరావతే రాజధానిగా ఉండాలని అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం ఈనెల 25తో 1,500 రోజులకు చేరుకుంటుంది. 25న వెలగపూడిలో బహిరంగ సభను ఉద్యమకారులు నిర్వహిస్తారు. ఉద్యమ ఐక్య కార్యాచరణ సమితీ నాయకులు తగిన ఏర్పాట్లలో ఉన్నారు.

ఇందులో భాగంగా ప్రత్యేక నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతిని దెబ్బతీస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై పోరు కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి సంపద కేంద్రమైన అమరావతి ఆవశ్యకతను, రాజధానితో రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉన్న విధాన్ని బహిరంగసభలో రైతులు వివరించనున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మద్దతుదారుల్ని ఆహ్వానించనున్నారు.
పంట భూములు త్యాగం చేశాం
రాజధాని కోసం పంటలు పండే భూములను త్యాగం చేశామని, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం తాము త్యాగం చేస్తే జగన్‌ సర్కార్‌ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని, ఏపీ రాజధాని అమరావతి నగరమే కొనసాగాలని డిమాండ్‌ చేస్తున్నారు.
ఈ ఉద్యమం 2019 డిసెంబరు 18న ప్రారంభమైంది. డిసెంబరు 17న మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన మరుసటి రోజు నుంచి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాన్ని ప్రారంభించారు.
భిన్న రీతుల్లో ఆందోళనలు
అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు విభిన్న రీతిలో తమ ఆందోళన తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేదు. ఉద్యమాలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ అణచివేతకు పాల్పడుతుందే తప్ప, రాజధాని అమరావతి రైతుల గోడు విన్న దాఖలాలు లేవు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తేల్చి చెప్పారు. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామని, ఈ నిర్ణయం మార్చుకునేది లేదని జగన్‌ సర్కార్‌ తేల్చిచెప్పింది. రాజధాని అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు, కోర్టులో పిటిషన్లు వెరసి ఏపీ రాజధాని పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
అయోమయంలో పడేసిన మూడు రాజధానుల ప్రకటన
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్‌ చెప్పినప్పటికీ కోర్టుల్లో కేసులు నడుస్తున్న కారణంగా, మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం కాలేదు. జగన్‌ నాలుగడుగులు ముందుకు వేయాలని ప్రయత్నిస్తే, కోర్టు కేసులతో పదడుగులు వెనక్కు పడుతున్న పరిస్థితి ఉంది. అటు మూడు రాజధానులు ఏర్పాటు లేక, ఇటు ఏపీ రాజధాని అమరావతినా కాదా అన్నది అర్థం కాక ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో అయోమయం కొనసాగుతున్నది.
న్యాయస్థానం టూ దేవస్థానం వరకు సాగిన యాత్ర
అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర నిర్వహించారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి మహా పాదయాత్ర 45 రోజుల పాటు సాగింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలోని 70 గ్రామాల మీదుగా తిరుపతిలో యాత్ర ముగిసింది.
సర్వమత ప్రార్థనలు నిర్వహించి, రాజధాని అమరావతి కోసం అమరులైన వారికి నివాళులర్పించే కార్యక్రమాలు 700రోజులు పూర్తయినప్పుడు చేశారు. అమరావతి లక్ష్యసాధన ప్రతిజ్ఞ, మహిళల ప్రత్యేక మాలధారణ, ఎస్సీ మైనారిటీల అమరావతి సంకల్పం, అమరావతి ఉద్యమం గీతాలాపన, ఉద్యమ కాలంలో ముఖ్యమైన ఘట్టాలను గుర్తు చేసుకుంటూ అనేక కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించారు. ఇంతకాలంగా అమరావతి పోరాటం సాగుతున్నా పట్టించుకోని జగన్‌ సర్కారు తీరుకు వ్యతిరేకంగా కళ్లకు గంతలు కట్టుకొని నిరసన ప్రదర్శన కూడా పూర్తి చేశారు.
కొనసాగుతున్న ప్రభుత్వ ఆంక్షలు
ఇప్పటికీ ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు ఆంక్షలు పెడుతూ, ఇబ్బందులు పెడుతున్నారు. అమరావతి ఉద్యమాన్ని నిలువరించే అనేక ప్రయత్నాలు చేశారు. రాజధాని రైతులు లాఠీ దెబ్బలు తిన్నారు. పోలీసు స్టేషన్‌ లకు వెళ్లారు. గతంలో ప్రభుత్వం సీఆర్‌డీఏను రద్దు చేసి తిరిగి మరళా సీఆర్‌డీఏను కొనసాగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది.
సుప్రీం కోర్టు తీర్పుకోసం ఎదురు చూపులు
కింది కోర్టుల్లో రాజధానిపై తీర్పులు పూర్తయ్యాయి. అమరావతే రాజధానిగా కొనసాగాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ఉద్యమం ఆగదు

అమరావతి రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈనెల 25న అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ వెలగపూడిలో సభ నిర్వహిస్తున్నాం. రాజధానికి మద్దతు ఇచ్చేవారంతం సభకు రావాలని కోరుతున్నాం. ప్రభుత్వ ఆంక్షలు మమ్మల్ని ఏమీ చేయలేవు. సుప్రీం కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. తీర్పు అమరావతికి అనుకూలంగా వస్తుందనే నమ్మకం మాకుంది.

–కొలికపూడి శ్రీనివాస్, అమరాతి రైతుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ

Tags:    

Similar News