బీజేపీతో రాయబారం

బీజేపీతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాయబారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీలో నిర్ణయించారు.

Update: 2024-02-04 12:04 GMT
చంద్రబాబు, పవన్ కళ్యాణ్

బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి టీడీపీ, జనసేనలు వచ్చాయి. ఆదివారం అమరావతిలోని చంద్రబాబునాయుడు నివాసంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పొత్తుల వ్యవహారంపై చర్చ జరిగింది. ఎలాగైనా బీజేపీని కలుపుకుని ముందుకు సాగాలని జనసేన, టీడీపీలు భావిస్తున్నాయి. టీడీపీ వారు వచ్చి మాతో మాట్లాడితే పొత్తుకు మేము రెడీ అనే విషయాన్ని బీజేపీ తేల్చి చెప్పింది. ఎందుకో బీజేపీతో కలిసి నేరుగా చర్చించేందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదు. ముల్లును ముల్లుతోనే తీయాలనుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించారు. ఆదివారం చంద్రబాబు నివాసంలో జరిగిన చర్చలో ప్రధానంగా జరిగింది బీజేపీతో కలిసి పనిచేయాలనే విషయమే. పొత్తుకు వారు ముందుకు వస్తున్నందున ఎన్నిసీట్లు ఇవ్వాలనే విషయంలో స్పష్టత వస్తే మనం ముందుకు సాగొచ్చని, అందువల్ల బీజేపీతో పొత్తు విషయం నువ్వే తేల్చాలని పవన్ కళ్యాణ్ కు అప్పగించారు. మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానంతో మాట్లాడి సీట్లు ఎన్ని అడుగుతున్నారనే విషయంపై ఒక స్పష్టతకు రానున్నారు.


Delete Edit


2 పార్లమెంట్, 7 అసెంబ్లీ

బీజేపీ వారు రెండు పార్లమెంట్, ఏడు అంసెబ్లీ సీట్లు ఇస్తే పొత్తుకు సిద్ధమవుతారని సమాచారం. ఒక పార్లమెంట్, మూడు అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకైతే ఇబ్బంది లేదని చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో అన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు బీజేపీ వారు అంగీకరిస్తారా? వారి ఓట్లు వారు వేసుకుంటారా అనేది వేచి చూడాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ చర్చలు ఫలించి బీజేపీ వారు ముందుకు అడుగేస్తే తప్పకుండా పొత్తు కుదురుతుంది.

బీజేపీ విషయం తేలాకే మ్యానిఫెస్టో

బీజేపీ పొత్తు విషయం తేలాకే మ్యానిఫెస్టో ప్రకటిద్దామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఈ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ, జనసేన మ్యానిఫెస్టో సిద్దమైంది. మరో వారం తరువాత ప్రకటించేందుకు నిర్ణయించారు. అయితే బీజేపీ విషయం తేలితే మ్యానిఫెస్టో మారే అవకాశం ఉన్నందున ఆ విషయం ఫైనల్ అయిన తరువాతే మ్యానిఫెస్టో రిలీజ్ చేద్దామని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

సోషల్ మీడియా ట్రాష్

జనసేనకు 3 పార్లమెంట్ సీట్లు, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న దాంట్లో నిజం లేదని టీడీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అయితే ఈ విషయంలో జనసేన వారు ఎటువంటి కామెంట్ చేయడం లేదు. ఇటీవల జనసేనాని టీడీపీపై మండిపడి రెండు సీట్లలో తమ అభ్యర్థులను ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ విషయాలన్నీచంద్రబాబు సమక్షంలో మాట్లాడుకుని సయోధ్యతో బీజేపీ విషయం ముందుగా తేల్చుకుని అడుగులు వేద్దామని ఇరువురు భేటీ ముగించినట్లు సమాచారం.

Tags:    

Similar News