అన్నా.. పులివెందులలో పోటీ చేస్తే ఏమైనా ఇబ్బందా?
ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డితో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడు ఆకస్మాత్తుగా భేటీ కావడం పులిెవెందులలలో కొత్త చర్చకు దారి తీసింది, ఎందుకంటే;
By : The Federal
Update: 2024-03-23 12:50 GMT
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి, మాజీ మంత్రి, స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అనూహ్యంగా జరిగిన ఈభేటీలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి మొదలు అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. వైఎస్సార్ కడప జిల్లాలోని వేంపల్లెలో ఉన్న పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డిని మాజీ మంత్రి స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ డాక్టర్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు.
కడప నుంచి పులివెందుల వెళుతూ వేంపల్లెలో ఆగి పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ఇంటి తలుపుతట్టారు. అనుకోని అతిధులు రావడంతో తులసిరెడ్డి సునీత దంపతులను ఇంట్లోకి పిలిచి మర్యాదలు చేశారు. ఇంటికి వచ్చిన వారిని తులసిరెడ్డి సన్మానించారు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దాదాపు గంట సేపు తులసిరెడ్డితో ఏకాంతంగా రాజకీయ విషయాలపై చర్చించారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విషయాలు కూడా చర్చించినట్లు సమాచారం. ఎన్నికల ప్రచార సమయంలో వివేకానంద రెడ్డి హత్య జరిగిన తీరుపై ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే వాటిపై కూడా చర్చించినట్లు తెలిసింది. వివేకా కుమార్తె కాంగ్రెస్ పార్టీ పట్ల వైపే ఉండే విధంగా చర్చలు సాగాయి. పులివెందుల అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే వాటిపై కూడా చర్చలు సాగాయి. గ్రీన్ కార్డు ఉన్నా పోటీ చేయవచ్చా లేక ఏదైనా ఇబ్బంది వస్తుందా అనే విషయమై న్యాయ సలహా తీసుకోవాలనుకున్నట్టు సమాచారం. డాక్టర్ సునీతమ్మకు కాంగ్రెస్ నాయకులను తులసిరెడ్డి పరిచయం చేశారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన తులసిరెడ్డి మంచి చదువరి. సలహాలు సంప్రదింపులు చేయడంలో దిట్ట. అందుకనే సునీత ఆయన్ను కలిసి ఉంటారని, పోటీ చేస్తే వచ్చే ఇబ్బందుల గురించి చర్చించడానికే ఆమె వచ్చి ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.