YSRCP | రాసలీలతో అడ్డంగా దొరికిన మరో వైసీపీ నేత
ఓ సీఐని ఎస్టీ కమిషన్ సభ్యుడు శాసించారు. అదే అధికారి ముందు దోషిగా నిలబడ్డాడు. వ్యభిచారం సాగిస్తూ, మంచం కింద నక్కిన ఆయనను స్టేషన్ కు తరలించారు.;
Byline : The Federal
Update: 2025-02-23 11:46 GMT
అధికారంలో ఉండగా కొందరు నేతల రాసలీలతో వైసీపీకి తలవంపులు తప్పలేదు. అధికారం కోల్పోయిన తరువాత కూడా అదే పరిస్థితి. తాజాగా విజయవాడ స్పా సెంటర్ లో యువతులతో ఉన్నఅనంతపురం (Anantapuram) జిల్లాకు చెందిన ఏపీ ఎస్టీ కమిషన్ (AP S.T Commission) సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ వల్ల మళ్లీ పునరావృతమైంది. ఈ సంఘటనకు రెండు నెలల కిందట ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
ధిక్కరించిన సీఐ ముందే...
విజయవాడ నగరం పెనమలూరు ప్రాంతానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ కేంద్రం మాచవరం పరిధిలో ఉంటుంది. విద్యార్థి మరణవార్త తెలిసిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ మార్చురీ వద్దకు చేరుకున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తల కోసం సీఐ ఎస్. ప్రకాష్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్ నాయక్ "ఇక్కడ ఇంతమంది పోలీసులు అవసరమా? ఎందుకు వచ్చారు" అని నిలదీశారు. సీఐ ప్రకాష్ కూడా సామరస్యంగానే "ముందుజాగ్రత్తగా వచ్చాం సార్" అని ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్ నాయక్ కు సమాధానం ఇవ్వగా, "మేము తలుచుకుంటే ఈ ప్రదేశం ఇంత ప్రశాంతంగా ఉంటుందా? గిరిజన బిడ్డ చనిపోతే, ఊరికే ఉంటామా?" అని పెద్ద స్వరంతో రెచ్చిపోయాడంట. అక్కడి లాంఛనాలు పూర్తయ్యాక ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆ తరువాత ఆ కథను కూడా మరిచారు.
సీన్ కట్ చేస్తే..
మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో స్టూడియో 9 పేరిట నిర్వహిస్తున్న స్పా సెంటర్ లో ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ అడ్డంగా దొరికిపోయారు. నిర్వహకుల్లో ఒకరు పారిపోగా, శంకర్ నాయక్ తోపాటు 11 మందిని, మరో తొమ్మిది మంది యువతులను అదుపులోకి తీసుకుని మాచవరం స్టేషన్ కు తరలించారు. ఏ అధికారి ముందు ధిక్కార స్వరంతో ఆదేశించాడో.. అదే సీఐ ముందు శంకర్ నాయక్ తలొంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.
దీనిపై మాచవరం సీఐ ఎస్. ప్రకాష్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడుతూ, వారందరినీ స్టేషన్ బెయిల్ పై విడుదల చేశామని చెప్పారు. "వారిలో ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ కూడా ఉన్నారు" అని వివరించారు. రెండు నెలల కిందట ఓ విద్యార్థి ఆత్మహత్య ఘటన సమయంలో శంకర్ నాయక్ వ్యవహరించిన తీరును గుర్తు చేయగా, "జరిగింది వాస్తవమే" అని ధృవీకరించారు. కానీ, చట్టం మేరకు పని చేయడమే తమ కర్తవ్యం అని సీఐ ప్రకాష్ వ్యాఖ్యానించారు. విద్యార్థి మరణానంతరం జరిగిన ఘటనను శంకర్ నాయక్ గుర్తు చేసే వరకు, ఆ విషయం మైండ్ లో లేదు అని ఆయన చెప్పారు. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియదు. ప్రజాజీవనంలో ఉన్న వారు బాధ్యతగా వ్యవహరించాలనే మాటకు ఈ సంఘటన అద్దం పడుతుందనడంలో సందేహం లేదు.
" స్పా కేంద్రం నిర్వాహకుల్లో ఒకరిని అరెస్టు చేశాం. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నాం" అని మాచవరం సీఐ ఎస్. ప్రకాష్ స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఒత్తిళ్లు ఏమి లేవని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా,
విద్యార్థి ఆత్మహత్య ఘటనను గుర్తు చేయడమే కాకుండా, తనను ఎస్టీ కమిషన్ సభ్యుడిగా మళ్లీ పరిచయం చేసుకున్న శంకర్ నాయక్ తన పేరు లేకుండా చేయమని సీఐని అభ్యర్థించినా, ఖాతరు చేయలేదని తెలిసింది.
వైసీపీ మౌనం..
ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ వ్యభిచారం కేసులో పట్టుబడినా, వైసీపీ నాయకుల నుంచి స్పందన లేదు. సొంత జిల్లా అనంతపురం, ఆయనకు పదవి రావడానికి కారణమైన కర్నూలు, ఆందోళనలకు వాడుకున్న తిరుపతి జిల్లా వైసీపీ నాయకులు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.
2014లో టీడీపీ అధికారంలో ఉండగా, ఒకసారి సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనకు వచ్చారు. "గో బ్యాక్ సీఎం" అని వైసీపీ నాయకులు అంతమంది ఉన్నా, శంకర్ నాయక్ ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆ సందర్భంలో ఆయనను అదుపులోకి తీసుకుని, వదిలేశారు. అమరావతి రైతుల పోరాటానికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఉండవల్లి వద్ద శంకర్ నాయక్ తన మద్దతుదారులతో కలిసి వెళ్లి ఆందోళనలు కూడా సాగించడం ద్వారా మాజీ సీఎం వైఎస్. జగన్ దృష్టిలో నిలిచారు. తిరుపతిలో వైసీపీ గొంతుకను బలంగానే వినిపించడంలో కూడా శంకర్ నాయక్ చురుగ్గా ఉన్నారు. కానీ, తాజా ఘటన నేపథ్యంలో వైసీపీ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలు ఎవరూ స్పందించకపోవడం కూడా చర్చకు దారితీసింది. ఇదెలా ఉండగా,
వైసీపీని వీడని మకిలి
అనంతపురం మాజీ ఎంపీ గోర్లంట్ల మాధవ్ తరువాత మాజీ మంత్రి అంబటి రాంబాబు రాసలీలలు సాగిస్తూ వీడియో, ఆడియోలు వైరల్ అయ్యాయి. ఆ తరువాత ఎస్వీబీసీ చైర్మన్ గా పనిచేసిన సీనియర్ నటుడు ఫృద్వీ తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పదవితో పాటు, పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. ఆ తరువాత ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. గత ఏడాది దేవాదాయ శాఖ అధికారిణితో వైసీపీలో నంబర్ -2 గా పరిగణించే మాజీ రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డి సాగించిన వ్యవహారం కూడా రోజుల తరబడి ప్రధాన వార్తంశంగా మారింది. ఆ తరువాత ఆ వ్యవహారం సద్దుమణిగింది. తాజాగా వైసీపీ అధినేత వైఎస్. జగన్ కు తక్కువ రోజుల్లో అత్యంత సామీప్యం పెంచుకున్న వడిత్యా శంకర్ నాయక్ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా క్యాబినెట్ ర్యాంక్ పదవిని దక్కించుకున్నారు. ఈయన స్పా కేంద్రంలో యువతులతో ఉండగానే మాచవరం సీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వ్యవహారంలో వైసీపీ నేతల రాసలీలల వ్యవహారం సర్వసాధారణమే అనిపించేలా మారింది. దీనిపై మాజీ సీఎం వైఎస్. జగన్, ఆయన తరువాతి స్థానంలో ఉన్న నేతలు ఎవరూ కిక్కిరుమనకపోవడం కూడా ఆసక్తి కరంగా మారింది.