రేపటికి వాయిదా పడ్డ ఏపీ అసెంబ్లీ
గవర్నర్ ప్రసంగం పూర్తి అయిన తర్వాత సభను మంగళవారానికి వాయిదా వేశారు.;
By : The Federal
Update: 2025-02-24 07:38 GMT
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ శాసన సభ, శాసన మండలి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. బడ్జెట్ మీద గవర్నర్ ప్రసంగం పూర్తి అయిన తర్వాత అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
సోమవారం ఉదయం 10 గంటలకే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ అంతకంటే ముందే అసెంబ్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మండలి చైర్మన్ మోషెన్ రాజు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదితరు గవర్నర్‌ను అసెంబ్లీలోకి ఆహ్వానం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీరించిన
అనంతరం గవర్నర్ అసెంబ్లీలోకి వెళ్లారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మండలి చైర్మన్ మేషెన్‌రాజులు గవర్నర్‌ను స్పీకర్ పోడియం వద్దకు తీసుకెళ్లి గవర్నర్ స్పీకర్ చైర్‌లో కూర్చోబెట్టారు. అనంతరం గవర్నర్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
గవర్నర్ తన బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నిరసనలు ప్రారంభించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని నినదించారు. సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. కొద్ది సేపు వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు కొనసాగాయి. తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రసంగం పూర్తి అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మండలి చైర్మన్ మోషెన్‌రాజు వాహనం వరకు వెళ్లి గవర్నర్‌కు వీడ్కోలు పలికారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. మరో వైపు సభ వాయిదా పడిన వెంటనే బీఏసీ సమావేశం మొదలైంది. ఎన్ని రోజులు అసెంబ్లీని నిర్వహించాలని, సమావేశాల్లో ఏయే అంశాలపై చర్చించాలి వంటి అంశాలపై దీనిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.