ఏపీ ఎలక్షన్స్: డిసెంబరులో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అకాల మరణంతో ఆ స్థానానికి బై ఎలక్షన్ నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ స్థానానికి బై ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంది. అందులో భాగంగా త్వరలో బై ఎలక్షన్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. దీని కోసం ఈ నెల 11న నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. నవంబరు 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. తర్వాత రోజు అంటే నవంబరు 19న నామినేషన్‌ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్‌ల ఉపసంహరణకు తుది గడువు నవంబరు 21గా పేర్కొన్నారు. డిసెంబరు 5న అంటే గురువారం పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఎన్నికల నిర్వహించిన తర్వాత నాలుగో రోజు అంటే డిసెంబరు 9న ఓట్ల లెక్కింపు చేపట్టడంతో పాటు ఫలితాలను కూడా అదే రోజు ప్రకటించనున్నారు. ఆ మేరకు సోమవారం మధ్యాహ్నం విడుదల చేసిన షెడ్యూల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.