ఏపీ ఫైబర్ నెట్ ను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు
తన మీదున్న కేసులను మాఫీ చేయించుకునేందుకు ఏపీ ఫైబర్‌నెట్‌ను సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని గౌతంరెడ్డి అన్నారు.;
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్‌ను లాభాల బాటలో నడిపిస్తే చంద్రబాబు కుట్రలు పన్ని నిర్వీర్యం చేశారని ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. 2014–19లో ఏపీ ఫైబర్‌నెట్‌లో చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారని, దీనిపై జరిపించామని, చంద్రబాబు అక్రమాలు, అవినీతిని నాడు సీఐడి నిరూపించిందని అన్నారు. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు సంతకాలతోనే అవినీతి చేశారని విమర్శించారు. ఫైబర్‌నెట్ ద్వారా ఇచ్చిన ప్రతి కాంట్రాక్టులోను నాడు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్నారు. దీనిని గుర్తించిన నాటి సీఎం జగన్ విచారణ జరిపించారని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అవినీతికి పాల్పడి చంద్రబాబు అరెస్టు అయ్యారన్నారు. తన మీదున్న కేసులను మాఫీ చేయించుకునేందుకు ఫైబర్‌నెట్‌ను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఫైబర్‌నెట్‌ను క్లోజయ్యే పరిస్థితికి తెచ్చింది చంద్రబాబే అని అన్నారు.