ప్రాజెక్ట్‌లపై ఫుల్ ఫోకస్.. ప్రతిపాదనలు చేస్తున్నామన్న మంత్రి

రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన క్రమంలో అన్ని సాగునీటి ప్రాజెక్ట్‌లపై దృష్టి సారిస్తోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం.

Update: 2024-09-08 08:51 GMT

రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన క్రమంలో అన్ని సాగునీటి ప్రాజెక్ట్‌లపై దృష్టి సారిస్తోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. వీటిలో భాగంగా అన్ని ప్రాజెక్ట్‌ల స్థితిగతులపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. వీటిలో భాగగానే బుడమేరుకు రిటైనింగ్ వాల్ నిర్మించాలని కూడా ఆలోచిస్తున్నామని, దీనికి సంబంధించి ప్రతిపాదనను కూడా సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. ఇటువంటి వరదలు మళ్ళీ సంభవించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా సహాయక చర్యలను కొనసాగిస్తున్నామని, ప్రజల జీవనం సాధారణ స్థితికి చేరే వరకు సహాయం అందించేలా ప్లాన్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఈరోజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి మంత్రి నారాయణ ఈరోజు విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆహారం, తాగునీరు అన్నీ సక్రమంగా అందాయా లేదా, ఏదైనా ఇబ్బందులు తలెత్తాయా అన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరదలకు శాశ్వత పరిస్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చని ఆయన భరోసా ఇచ్చారు.

రిటైనింగ్ వాల్‌కు ప్రతిపాదన..

‘‘బుడమేరు వరదకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. ఈ క్రమంలోనే బుడమేరుకు రిటైనింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన చేస్తున్నాం. జలవనరుల కాలువల ఆక్రమణల వల్ల వరద తీవ్రత పెరిగింది. ఆ అక్రమణల కారణంగా ఇంతటి వరద వచ్చింది. ఆ ఆక్రమణలను అడ్డుకుని ఉంటే ఈరోజు ఇంతటి ఘోర పరిస్థితి వచ్చేది కాదు. ఆహారం కోసం ప్రజలు అలమటించాల్సిన అవసరం ఉండేది కాదు. దానికి తోడుగా బుడమేరు నిర్వహణ విషయంలో కూడా తీవ్ర నిర్లక్ష్యం వహించారు. అందువల్లే గండ్లు పడి వరదలు వచ్చాయి. బాధితులకు అందించే సహాయక చర్యల విషయంలో సీఎం చంద్రబాబు చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు. బాధితుల కంటే ఐదు రెట్లు ఎక్కువ ఆహారం పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు వరద గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని వేళలా ప్రజలకు అండగా ఉంటుంది’’ అని భరోసా కల్పించారు.

శరవేగంగా ప్రకాశం బ్యారేజీ మరమ్మతులు

మరోవైపు ప్రకాశం మరమ్మతు పనులను శరవేగంగా జరుగుతున్నాయి. బోట్ల వచ్చి గుద్దుకోవడంతో అయిన డ్యామేజీ రిపేయిర్ పనులను ప్రారంభించారు ఇంజినీర్లు. ఇప్పటికే అక్కడ కౌంటర్ వెయిట్‌లను ఏర్పాటు చేశారు. అందులోకి కాంక్రీట్‌ను నింపుతున్నారు. గేట్లు 67, 69 గేట్ల దగ్గర ఈ మరమ్మతు పనులను చకచకా జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ దగ్గర మూడు గేట్లను మూసి ఈ పనులను జరుపుతున్నారు. ఈరోజు వీటిలోకి ఐరన్, కాంక్రీట్ పెట్టే పనులను పూర్తి చేయాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నట్లు చెప్తున్నారు. ఈరోజు ఈ పనులను పూర్తయితే అతి త్వరలో 67, 68, 69 గేట్లు మళ్ళీ అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మళ్ళీ వర్ష సూచన ఉన్న క్రమంలో ముందే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా వివరించారు.

Tags:    

Similar News