‘వాస్తవాలకు దూరంగా చంద్రబాబు శ్వేతపత్రం’.. అసెంబ్లీలో బీజేపీ నేత

లిక్కర్ స్కామ్ ఢిల్లీలోనే కాదు ఆంధ్రలో జరిగిందని టీడీపీ నేతలు ఎన్నికల ముందు నుంచే తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదని కూడా వ్యాఖ్యానించారు.

Update: 2024-07-24 13:41 GMT

లిక్కర్ స్కామ్ ఢిల్లీలోనే కాదు ఆంధ్రలో జరిగిందని టీడీపీ నేతలు ఎన్నికల ముందు నుంచే తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదని కూడా వ్యాఖ్యానించారు. ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలోని ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. ఈ స్కామ్‌పై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రలో జరిగిన లిక్కర్ స్కామ్‌కు సంబంధించి జరిగిన అవకతవకలపై శ్వేతపత్రంలో చెప్పిన దాని కంటే వాస్తవానికి ఎక్కువగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా దీనిపై మాట్లాడుతూ ఘాటుగానే స్పందించారు.

మనకా హక్కు ఉండదు

‘‘మద్యం స్కాం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.18 వేల కోట్ల నష్టం జరిగింది. కేంద్రం రూ.15 వేల కోట్లు ఇస్తే సంబరపడ్డాం. కానీ స్కామ్‌లు లేకుండా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన రూ.18 వేల కోట్లు వచ్చి ఉంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేది. మద్యం స్కాం కారకులను వదలకూడదు. కఠినంగా శిక్షించాలి. తప్పు చేసిన వారిని వదిలేస్తే మనకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంటుంది? రూ.20 వేల లంచం తీసుకునే సాధారణ ఉద్యోగిని శిక్షించగలుగుతున్నాం. అలాంటిది ఇంత భారీ మొత్తంలో దోపిడీకి పాల్పడిన వారిని ఎలా వదులుతాం. అస్సలు వదలకూడదు. పెద్దోళ్లు తప్పు చేస్తే శిక్షలు ఉండవు? అన్న ఫీలింగ్‌ను సామాన్యుల నుంచి తొలగించాలి. మద్యం వ్యసనాన్ని తగ్గించేలా డీ-ఎడిక్షన్ సెంటర్లకు బడ్జెట్ కేటాయించాలి’’ అని కోరారు.

వాస్తవాలకు దూరంగా శ్వేతపత్రం

చంద్రబాబు విడుదల చేసిన లిక్కర్ స్కాం శ్వేతపత్రంపై బీజేపీ ఎల్పీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ శ్వేతపత్రం వాస్తవాలకు దూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో రూ.30 వేల కోట్ల వరకు మద్యం స్కాం జరిగింది. రూ.99 వేల కోట్ల మేర నగదు అమ్మకాలు జరిపితే మూడు శాతం అక్రమాలే జరిగాయనేలా శ్వేత తప్రం ఉంది. దీనిని చూస్తే తాను ఎక్కడా దొరకలేదనే జగన్ సంబరపడతారు. ఈ విషయంపై సీఐడీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలి’’ అని కోరారు.

విచారణ జరగాలి: ఆర్ఆర్ఆర్

‘‘లిక్కర్ విషయంలో కేంద్రానికి ఎన్నో లేఖలు రాశాం. రాష్ట్రంలో రూ.98 వేల కోట్ల లావాదేవీలు నగదు రూపంలోనే జరిగాయి. ఈ విషయంపై దర్యాప్తు జరగాలి. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ జరిగిన అమ్మకాల్లో 30 శాతం అవినీతి జరిగిందని అంచనా. గతంో కొన్ని శాంపుల్స్ పరిశీలిస్తే ఇంప్యూరిటీలు ఉన్నాయని, వాటి వల్ల కిడ్నీ సంబంధిత రోగాలు రావొచ్చని తేలింది. ఎంతో మంది అనారోగ్యానికి కల్తీ మద్యమే కారణం. కాబట్టి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు.

75శాతం పెరిగిన మందుబాబులు

శ్వేతపత్రంపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలను పరిశీలిస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుందని చెప్పారు. ‘‘మద్యపాన నిషేదం, లిక్కర్ ఔట్‌లెట్స్ తగ్గింపు అని కహానీలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక అన్నిటినీ మరిచారు. ధరలు పెంచితే మందు తాగే వారు తగ్గుతారని చెప్పారు. కానీ గత ఐదేళ్లలో 75శాతం మంది మందుబాబులు పెరిగారు. ప్రజలకు హామీ ఇచ్చామంటే అది అమలు చేసేదిగా ఉండాలి. మద్యం అనేది ఒక వ్యసనం. పేదవాడు శారీరకంగా కష్టపడి ఆ బాధను మర్చిపోవడానికి తాగుతారు. వారి అలవాటును ఆసరాగా చేసుకొని దోచుకున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు చంద్రబాబు.

Tags:    

Similar News