వల్లభనేని వంశీకి బెయిల్ నిరాకరించిన ఏపీ హైకోర్టు

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు అయిన వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. బెయిల్‌ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.;

Update: 2025-02-20 07:29 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని వంశీ దాఖలు చేసుకున్న పిటీషన్‌ మీద గురువారం విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. వంశీకి బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో పాటుగా ముందను బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ కూడా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టేసింది. ముందస్తు బెయిల్‌ కోసం ఎస్సీ,ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని ఏపీ హైకోర్టు సూచించింది. దీంతో విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించేందుకు వంశీ సిద్ధమవుతున్నారు.

మరో వైపు ఇదే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో నిందితులుగా ఉన్న 36 మంది తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసుకున్న పిటీషన్‌ మీద గతంలో విచారణ జరిపిన ఏపీ హైకోర్టు వారికి బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. తర్వాత వారు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని పిటీషన్‌ దాఖలు చేశారు. అక్కడ కూడా వీరికి నిరాశే ఎదురైంది. ఈ 36 మందికి ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఒక వేళ వంశీ ముందుస్తు బెయిల్‌ కోసం ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో పిటీషన్‌ దాఖలు చేసుకుంటే.. వంశీకి బెయిల్‌ మంజూరు చేస్తుందా? లేదా ఇదే కేసులో నిందితులుగా ఉన్న 36 మందికి నిరాకరించినట్లే వంశీకి కూడా ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తుందా? అనేది తాజాగా చర్చనీయాంశంగా మారింది.
వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న వంశీని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటీషన్‌ దాఖలు చేశారు. నిందితుడు వంశీ తరపున న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేశారు. దీని మీద బుధవారం విచారణ జరిగింది. పోలీసు తరపున రాజేంద్రప్రసాద్, నిందితుడు వంశీ తరపున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. నిందితుడు వంశీ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవాలని, అందులో కీలకమైన ఆధారాలు ఉన్నాయని, దీంతో పాటుగా కిడ్నాప్‌కు ఉపయోగించిన కార్‌ను కూడా సీజ్‌ చేయాలని, ఈ నేపథ్యంలో విచారణ చేపట్టేందుకు నిందితుడు వంశీని పోలీసుల కస్టడీకి ఇవ్వాలని,అందుకు అనుమతించాలని రాజేంద్రప్రసాద్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
నిందితుడు వంశీ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. సత్యవర్థన్‌ బయటే ఉన్నాడని, మళ్లీ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం నిందితుడు వంశీని కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వంశీ ఫోన్‌ను సీజ్‌ చేయాల్సిన పని లేదని, అరెస్టు సమయంలో నిందితుడి వద్ద ఫోన్‌ ఉంటేనే దానిని స్వాధీనం చేసుకోవాలని, దీని మీద సుప్రీం కోర్టు గతంలో అనేక తీర్పులిచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒక వేళ పోలీసు కస్టడీకి వంశీని అప్పగిస్తే.. అతని మీద థర్డ్‌ డిగ్రీ పద్దతులు ఉపయోగించి ఆ ప్రకారంగా పోలీసులు స్టేట్‌మెంట్‌ రూపొందించే ప్రమాదం ఉందని పొన్నవోలు తన వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదలను విన్న న్యాయాధికారి హిమబిందు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. దీనిపై ఈ రోజు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో న్యాయాధికారి ఏ విధంగా స్పందిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News