వైసీపీ మాజీ ఎమ్మెల్యే బెయిల్.. కానీ షరతులు వర్తిస్తాయి..
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం సహా మరో రెండు కేసుల్లో పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ షరతులు వర్తిస్తాయని న్యాయస్థానం తెలిపింది. పిన్నెళ్లి తన పాస్‌పోర్ట్‌ను అధికారులకు సమర్పించాలని ఆదేశించింది. అన్ని షరతులకు కట్టుబడి ఉంటానని పిన్నెల్లి చెప్పడంతో బెయిల్ మంజూరుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నెల్లూరులోని కారాగారం దగ్గర పోలీసులు అప్రమత్తం అయ్యారు. జైలు వద్ద భారీగా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు.
అసలు కేసేంటి..
మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెంటచింతల మండలం పాల్వాయి గేట్ వద్ద ఉన్న పోలింగ్ బూత్‌లోకి నేరుగా వెళ్లి ఈవీఎంలు నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఈ దృశ్యాలు నమోదయ్యాయి. దీంతో ఆయనపై ఐపీసీలోని 143, 147, 448, 427, 353, 452, 120బితో పాటు ప్రజా ప్రాతినిద్య చట్టం, పిడి చట్టం, ఆర్పీ చట్టం 131, 135లోని పలు సెక్షన్‌ల కింద కేసు నమోదైంది. ఎన్నిక రోజు నియోజవకర్గంలో అల్లర్లు చోటు చేసుకోగా ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే ఆయన పోలీసులకు తెలియకుండా బయటకు రావడంతో కారంపూడి మండలంలోని పలు చోట్ల వాహనాలను ఆయన అనుచరులు దగ్ధం చేశారు. ఊర్లల్లో దాడులు జరిగాయి. వందల మందికి గాయాలయ్యాయి. ఎన్నికల రోజు, తరువాత జరిగిన హింసలోనూ వందల కొద్ది ప్రజలు గాయాల పాలయ్యారు. ఇందుకు వైఎస్సార్‌సీపీతో పాటు తెలుగుదేశం పార్టీ వారు కూడా కారణమయ్యారు. ఈవీఎం ధ్వంసం చేసింది ఎమ్మెల్యేనేనని తెలుసుకునేలోపులో ఆయన పట్టణం వదిల వెళ్లిపోయారు. పోలీసులు పట్టకుని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న పిన్నెల్లి ముందస్తు బెయిల్‌కు గురువారం హైకోర్టులో పిటీషన్ తన లాయర్ల ద్వారా దాఖలు చేశారు. పిటీషన్‌ను పరిశీలించిన కోర్టు వచ్చేనెల 5వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల్లో హింసపై హైకోర్టు న్యాయవాది, మానవ హక్కుల సంఘం నేత పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పాలంటే అక్కడ ఏమి జరుగుతుందోననే భయం వెంటాడేలా ఉందన్నారు. ఎన్నికల నిర్వహణ విధానం సరిగా లేదు. పోల్ పర్సెంటేజీ పెంచడం కోసం అనేక చర్యలు చేపట్టామని చెబుతున్నా, పోలింగ్ స్టేషన్ నిర్వాహకులకు ఉద్యోగులకు సరైన శిక్షణ కూడా ఇవ్వ లేదన్నారు. బ్యాలెట్ ఓటింగ్ వ్యవస్థ ఉన్నప్పుడు చాలా సంఘటనల్లో ఓట్లు చెల్లకుండా పోయాయని, ఇప్పుడు ఈవీఎంలు రావడం వల్ల ఓట్లు చెల్లకుండా చేసే అవకాశాలు తక్కువుగా ఉన్నందు వల్ల రీపోలింగ్ జరపడం లేదన్నారు. తప్పు జరిగిందని నిర్థారణ అయిన తర్వాత తప్పనిసరిగా ఆక్కడ రీపోలింగ్ పెట్టాలన్నారు. ఎన్నికల హింసపై సిట్ వేయడం అంటేనే పోలీసులు విఫలమయ్యారనే అర్థమన్నారు. సిస్టమ్ సరిగా లేనప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయన్నారు. సరైన రిపోర్టులు సిబ్బంది నుంచి ఎన్నికల కమిషన్‌కు రాలేదు. వాలంటరీ వ్యవస్థ పెత్తనం చేసింది. రిపోర్టులు ఎందుకు సకాలంలో రాలేదు. రీపోలింగ్ ఎందుకు జరప లేదు. ఇప్పుడు కేసుల్లో బైండోవర్ చేస్తున్నారు. ముందస్తుగా ఎందుకు చేయలేదని అభిప్రాయపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన నిర్వాకం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు.