ఇండియన్ ఆర్మీకి ఏపీ సచివాలయ ఉద్యోగులు సంఘీభావ ర్యాలీ

‘అగ్నివీర్‌ మురళీ నాయక్‌ అమర్‌ రహే’ అంటూ ఉద్యోగులు పెద్దఎత్తున నినదించారు.;

Update: 2025-05-09 12:07 GMT

పహల్గామ్‌ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత త్రివిద ధళాల సారధ్యంలో చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’కు మద్ధత్తుగా శుక్రవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సచివాలయం మొదటి భవనం నుండి ప్రధాన గేటు వరకూ ఈసంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గామ్‌లో గత నెలలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ పరిధిలోని పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశానికి చెందిన 26మంది అమాయక పర్యాటకులను అతికిరాతకంగా కాల్చిచంపిన నేపధ్యంలో దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం త్రివిద దళాల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టి సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను వారి స్థావరాలను నేలమట్టం చేయడం జరిగింది. ఆ తదుపరి భారత్‌–పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో పాక్‌ కవ్వింపు చర్యలను మన దేశ త్రివిద దళాలకు చెందిన సైనికులు గత నాలుగు రోజులుగా పెద్దఎత్తున సమర్ధవంతంగా తిప్పి కొట్టడం జరుగుతోంది.

భారతదేశ త్రివిద దళాల పోరాటానికి సంఘీభావంగా రాష్ట్ర సచివాలయ అధికారులు, ఉద్యోగులు ‘జయహో ఆపరేషన్‌ సింధూర్, జై జవాన్, జై భారత్,భారత్‌ మాతాకి జై’ వంటి నివాదాలతో ర్యాలీ నిర్వహించారు. అంతేగాక పాక్‌ కాల్పుల్లో అమరుడైన రాష్ట్రానికి చెందిన ‘అగ్నివీర్‌ మురళీ నాయక్‌ అమర్‌ రహే’ అంటూ ఉద్యోగులు పెద్దఎత్తున నినదించారు. అంతేగాక ఉగ్రవాదులను పూర్తిగా తుదిముట్టించేందుకు భారత త్రివిద సైనిక దళాలు పాక్‌ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అహర్నిశలు పాటుపడుతున్న కృషికి దేశం యావత్తు వారి వెంట నిలిచింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర సచివాలయ అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున ఈర్యాలీలో పాల్గొన్నారు.


Tags:    

Similar News