ప్రధాన మంత్రి మోదీ కి ఆంధ్ర ప్రజల విజ్ఞప్తి
విభజన తరువాత కేంద్రంలో అధికారంలో ఉన్నది మోదీ ప్రభుత్వం. పదేళ్లలో ఆంధ్ర ప్రజలు కేంద్రంలో ఎన్డీఏ కు అనుకూలంగా వ్యవహరించారు. కానీ...;
విభజన హామీలు ఇంకా నెరవేరలేదు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఆస్తుల వివాదానికి తెరపడలేదు. రాయల సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం ఇస్తామని చెప్పిన ప్రత్యేక ప్యాకేజీ నిధులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఉపాధి హామీ నిధులు ఇచ్చి అవే ప్రత్యేక ప్యాకేజీ నిధులను చెప్పుకునే పరిస్థితి వచ్చింది. పదేళ్లుగా రైల్వే జోన్ ఏర్పాటు చేసి కొత్తగా ఉద్యోగాలు కల్పించాలనే అంశం కూడా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా, గెండె కాయగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన కేంద్రం ఆ మాటను వెనక్కి తీసుకోలేదు.
సహజ వనరులు ఉన్నా ఆంధ్రకు ఉపయోగ పడటం లేదు..
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సహజ వనరులు ఉన్నాయి. ఒక్కొక్కటిగా తరుగుతున్నాయి. తీర ప్రాంతంలో ఉన్న గ్యాస్ ను వేరే రాష్ట్రాలకు కేంద్రం పంపిస్తుందే కాని ఆంధ్రప్రదేశ్ వారు ఉపయోగించుకునే చర్యలు మాత్రం చేపట్టలేదు. రాష్ట్రంలో ఓడరేవులను అభివృద్ధి పరిచి దేశ విదేశాలకు వ్యపారాలను విస్తరించేందుకు కూడా చర్యలు తీసుకోవడం లేదు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం, అనటం కంటే రాష్ట్ర పాలకులను కూడా అనాలి. విభజన తరువాత గెలిచిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక హోదాను వదిలేసి ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంది. అప్పట్లో కొన్ని నిధులు కూడా కేంద్రం ఇచ్చింది. ఆ నిధులు పాలకులు జేబులు, అమరావతి మట్టిలో కలిసిపోయాయి. అమరావతిలో పెట్టిన పెట్టుబడి నుంచి రూపాయి కూడా రాలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా మోదీకి గొడుగు పట్టిందే కాని రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. విభజన హామీల్లో భాగంగా ఇస్తమన్న విద్యాసంస్థలు మాత్రం ఏపీకి వచ్చాయి. ఆ తరువాత హామీలు పక్కన బెడితే రాష్ట్ర అభివృద్ధికి కనీస చర్యలు తీసుకోలేదు. ఉచితంగా ప్రజలకు డబ్బులు ఇవ్వటం తప్ప రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ లో ఉపయోగపడే ప్రాజెక్టు పలానా ఉందని నాటి ప్రభుత్వం చెప్పలేక పోయింది.
ప్రస్తుతం తిరిగి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వం వచ్చింది. రాష్ట్ర కూటమి నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమి అడిగితే ప్రధాన మంత్రి కాదనకుండా ఇస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల వృధా ఖర్చుతో మిగిలిపోయింది. పాలకులపై ప్రజలు ప్రాజెక్టు విషయంలో నమ్మకం కోల్పోయారు. అది పూర్తయితే తప్ప ఇప్పట్లో ప్రజలకు నమ్మకం రాదు. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. కేద్రం నుంచి రావాల్సిన డబ్బును తీసుకుంటూనే కట్టలేక పోయారు. కేంద్రం కూడా ఇకపై ఇచ్చే నిధులు అప్పుగా ఇప్పిస్తామని చెప్పి తప్పుకుంది.
కలల సౌధమని అప్పులు పెంచుతున్నారు..
కలల సౌధం అమరావతి నిర్మిస్తామని చెప్పి కోట్లు కుమ్మరించి పనికి రాకుండా చేశారు. మళ్లీ ఆ కలల సౌధాన్ని తిరిగి నిర్మిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే రూ. 15వేల కోట్లు అప్పుగా ఇప్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వేరే వారి నుంచి మరో రూ. 16వేల కోట్లు అప్పుగా తీసుకుంటోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం గ్రాంట్ అడిగి తీసుకోలేని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఆదుకుంటాయనే చర్చ కూడా సాగుతోంది. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కూటమి కావడం వల్ల ప్రధాన మంత్రి నుంచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు అడగటంతో పాటు అప్పుల భారాన్ని తగ్గించేందుకు కావాల్సిన సాయం కూడా రాష్ట్రం కోరాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మిగులు బడ్జెట్ తో ఉండే రాష్ట్రం ఇప్పుడు లోటు బడ్జెట్ లోకి వెళ్లి పోవడమే కాకుండా అప్పుల పాలు కావడంపై కూడా కేంద్రం ఆలోచించాలనే వాదన సీఎం, డిప్యూటీ సీఎం వినిపెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే వాదనను పలు పార్టీల వారు కూడా లేవనెత్తుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ మాటేమిటి?
ఆంధ్రప్రదేశ్‌కు, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి మోదీ ఏమి హామీలు ఇవ్వబోతున్నారు? ఓ పక్క ఆంధ్రులకు గర్వకారణమైన వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధిగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టడానికి సిద్ధపడుతూ... అనకాపల్లి జిల్లాలో మరో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం నయవంచన తప్ప మరొకటి కాదని ఉత్తరాంధ్ర వాసులు వ్యాఖ్యానిస్తున్నారు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ముడిసరుకు కొరతతో ఉత్పత్తి తగ్గిందని, ప్లాంట్ దివాలా తీసే స్థాయిలో ఉందని, కేంద్రం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు 1,400 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే... ముఖ్యమంత్రి చంద్రబాబు మోదీతో మిట్టల్ స్టీల్ గురించి చర్చించడం ఆంధ్రప్రజల దౌర్భాగ్యం కాక మరేమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.
మిట్టల్ పెట్టే ప్లాంట్ కు ఖనిజం కొరత లేకుండా చూడాలా..
మిట్టల్ పెట్టబోయే ప్లాంట్ కి ఇనుప ఖనిజం కొరత లేకుండా చూడాలట. ఇదెక్కడి న్యాయం? విశాఖ స్టీల్‌కు సొంత గనులు ఇవ్వాలని ఏనాడైనా డిమాండ్ చేశారా? విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, రైతుల నుంచి సారవంతమైన భూములను కొట్టేసేందుకు కుట్రలు జరుగుతున్నాయనేది కాంగ్రెస్ నాయకుల్లో ముఖ్యమైన వారి వాదన. మోదీకి అనుకూల కార్పొరేట్ సంస్థలకు చౌకగా అమ్మే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదంటూనే రూపాయి సహాయం చేయకుండా ప్లాంట్ ను చంపేసే కుట్ర కేంద్రం చేస్తూనే ఉందనే వేదన కార్మికుల నుంచి వ్యక్తమవుతోంది. 243 మంది పనిచేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు రూ. 15వేల కోట్ల సహాయం అందించిన మోదీకి, 26 వేల మంది పనిచేసే విశాఖ స్టీల్ ను ఆదుకోవడానికి మనసు రావడం లేదు. ఇద్దరు ఎంపీలున్న జేడీఎస్ పార్టీ రూ. 15వేల కోట్ల నిధులు రాబట్టు కుంటే.. ఢిల్లీలో ఎన్డీఏ సర్కారు ఏర్పాటు కు కారణమైన టీడీపీ- జనసేన పార్టీలు మోదీకి సలాం కొట్టడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం కాదా అనే ప్రశ్న కూడా ఉంది.
ఏపీ ఎంపీలు కేంద్రానికి గులాం గిరీ చేస్తున్నారు..
18 మంది ఎంపీలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గు చేటు. మన ఎంపీల అసమర్ధతకు నిదర్శనం అని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్, విశాఖ అచ్యుతాపురం ఎన్టీపీసీలో హైడ్రోజన్ ప్లాంట్ సహా ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఇవేమీ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానీకం వలసలు ఆపేవి కావని ఆయన అన్నారు. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను అనకాపల్లి జిల్లాలో కాకుండా రాయలసీమ ప్రాంతం కడపలో ఏర్పాటు చేయాలి. అదే సమయంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి, కర్నాటక స్టీల్ ప్లాంట్ కి రూ.15వేల కోట్ల ఆర్థిక సహాయం ఇచ్చినట్లే.. వైజాగ్ స్టీల్ కు కేంద్రం నిధులు ఇవ్వాలని జివాజీ డిమాండ్ చేశారు. ప్లాంట్ ను సెయిల్‌లో వెంటనే విలీనం చేయాలి. 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి ప్రారంభించాలి. భవిష్యత్ లో 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెంచి లాభాల బాటలో నిలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీతో రోడ్ షో చేయనున్న సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే బహిరంగ సభలో మోదీ చేత వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోవడం లేదని ప్రకటన చేయించాలని, విశాఖ స్టీల్‌కు అవసరమైన గనులు కేటాయిస్తామని, అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇప్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.