ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో చెల్లిస్తారా?
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు విషయంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లోపించింది. ఎందుకు ఇలా జరుగుతోంది?
Byline : G.P Venkateswarlu
Update: 2024-11-07 04:15 GMT
ఆంధ్రప్రదేశ్‌లో పేద విద్యార్థులకు ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తోంది. ఈ పథకం వైఎస్సార్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. అప్పట్లో పథకం బాగానే అమలైంది. ఆ తరువాత బాలారిస్టాలను ఎదుర్కొంటోంది. వైఎస్సార్ తరువాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు సకాలంలో కాలేజీల వారికి చెల్లించలేదు. బకాయిలు పెడుతూ వచ్చారు. ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగింది. అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయడంలో అడ్డంకులను అధిగమించలేకపోయింది. కాలేజీల వారికి చాలా వరకు బకాయిలు ఉంచారు.
ఆ తరువాత అధికారం చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకం రూపురేఖలను మార్చి వేశారు. పథకానికి జగనన్న విద్యాదీవెనగా పేరు మార్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బును నేరుగా కాలేజీలకు ఇవ్వడం వల్ల తల్లిదండ్రుల్లో బాధ్యత కొరవడిందని, తమ పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుందామనే తపన కూడా వారిలో లేకుండా పోయిందని, అందుకే విధానంలో మార్పు తీసుకొస్తున్నామని ప్రకటిస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నేరుగా విద్యార్థి తల్లి ఖాతాకు జమ చేశారు. తల్లి ఖాతాకు నిధులు జమ అయిన వారం రోజుల్లో కాలేజీలో చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. అలా ఇవ్వకుంటే తల్లిదండ్రులపై చర్యలు ఉంటాయని కూడా గైడ్‌లైన్స్‌లో పేర్కొన్నారు. తల్లి అకౌంట్‌లో ఫీజు డబ్బులు పడిన మరుక్షణంలోనే వారి ఇంటి అవసరాల కోసం వాడుకోవడం మొదలు పెట్టారు. తిరిగి కాలేజీలో కట్టేందుకు చాలా మంది తల్లిదండ్రులకు సకాలంలో సాధ్యం కాలేదు. దీని కారణంగా విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలు ఫీజు ఎప్పుడు చెల్లిస్తారంటూ వేదించడం మొదలు పెట్టారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఫైనల్ ఇయర్ పూర్తయినా ఫీజులు చెల్లించలేకపోయారు. దీంతో ప్రైవేట్ కాలేజీల వారు పూర్తి ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని, లేదంటే ఇవ్వలేమని తేల్చి చెప్పేసారు. చాలా మంది విద్యార్థులు కోర్స్ పూర్తయిన ఏడాదిలోపులో కూడా తమ ఫీజులు కాలేజీలకు చెల్లించలేక, సర్టిఫికెట్లు తీసుకోలేక ఉద్యోగావకాశాలు కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.
ప్రస్తుతం అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా కాలేజీల వారికే చెల్లిస్తామని, తల్లిదండ్రుల అకౌంట్స్‌కు ట్రాన్స్‌ఫర్ చేసే పద్ధతికి స్వస్తి పలుకుతూ జీవో జారీ చేశారు. ఒక విధంగా ఇదే సరైన పద్ధతి. కాలేజీల వారికి నేరుగా ఫీజులు చెల్లిస్తే అసలు సమస్యలు ఉత్పన్నం కావు. విద్యార్థి యాజమాన్యం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఎటువంటి వత్తిడులకు గురికాకుండా చదువుకుంటారు. అయితే సకాలంలో ఫీజులు చెల్లించే పద్ధతిని అమలు చేయాలని కాలేజీ యాజమాన్యాలు కోరుతున్నాయి. వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో ఒకేసారి పూర్తి ఫీజును కాలేజీలకు చెల్లించే వారు. దానిని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మూడు వాయిదాల్లో చెల్లించే విధంగా గైడ్‌లైన్స్ తయారు చేయించారు. అదే విధానాన్ని జగన్ కొనసాగించినా తల్లి ఖాతాకు డబ్బులు వేశారు. ప్రస్తుతం గత ప్రభుత్వ ఆదేశాలను రద్దుచేసి నేరుగా కాలేజీలకు ఫీజులు చెల్లించే పద్ధతిని అమలులోకి తీసుకొచ్చారు. జూన్ నెలలో ఇవ్వాల్సిన రీయింబర్స్‌మెంట్ ఫీజు వాయిదాలు వేయవద్దని, అలాగే మూడు వాయిదాల్లోనూ ఇవ్వాల్సిన ఫీజును సమయానికి ఇస్తే కాలేజీల్లో విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయని కాలేజీ యాజమాన్యాల వారు చెబుతున్నారు.
పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో మీన మేషాలు లెక్కించకుండా సకాలంలో కాలేజీలకు చెల్లిస్తే బాగుంటుంది. ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన వారికి వెంటనే సర్టిఫికెట్లు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆలస్యం చేయడం వల్ల సర్టిఫికెట్లు విద్యార్థులకు సకాలంలో అందటం లేదు. మూడు క్వార్టర్లలో ప్రభుత్వం కాలేజీల వారికి ఫీజును రీయింబర్స్ చేస్తుంది.
విద్యార్థుల ఫీజులు సకాలంలో చెల్లించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల విద్యాశాఖపై జరిగిన సమీక్షల్లో వెల్లడించారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ. 3,500 కోట్ల వరకు ఉన్నాయని చెప్పారు. ఇకపై బకాయిలు పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.