పరకామణికి చిల్లు పెట్టిందెవరు? చచ్చిపోయిందెవరు?
అసలేం జరిగిందీ? ఇప్పుడీ సిట్ ఏం చేస్తోంది?
By : The Federal
Update: 2025-11-28 12:17 GMT
తిరుమల పరకామణి కేసు విచారణ వేగవంతమైంది. టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వై.వి. సుబ్బారెడ్డి శుక్రవారం పరకామణి దొంగతనం కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు హాజరయ్యారు. ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నార్– విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో సుబ్బారెడ్డిని ప్రశ్నించారు.
టీటీడీ చైర్మన్‌గా సుబ్బారెడ్డి ఉన్న సమయంలోనే పరకామణి దొంగతనం కేసు లోక్‌అదాలత్‌లో పరిష్కారమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు తిరుమల పెద్దజీయగాంర్ మఠంలో ఏకాంగి (సూపరింటెండెంట్ స్థాయి) పీవీ. రవికుమార్ ఆలయానికి ఏడు గిఫ్ట్ డీడ్లు కానకగా ఇచ్చాడనే పేరిట ఈ కేసు లోక్ అదాలత్ లో రాజీ అయింది. లోక్అదాలత్‌లో కేసు రాజీని సవాల్ చేస్తూ తిరుమల కేంద్రంగా పనిచేసే జర్నలిస్టు మాచర్ల శ్రీనివాసులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చిన ఆదేశాల మేరకు ఎస్‌ఐటి (సిట్) ఈ దర్యాప్తును ప్రారంభించింది.
కేసు తిరిగి విచారణ ప్రారంభమైన తర్వాత టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (AVSO), ఈ కేసులో అసలు ఫిర్యాదుదారైన వై. సతీష్ కుమార్ నవంబర్ 14న అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వే పట్టాలకు దూరంగా అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. దీంతో ఈ కేసు ప్రాధాన్యత పెరిగింది.
అసలేమిటీ పరకామణి?
“పరకామణి”.. తిరుమలలో భక్తులు దేవునికి విరాళాలు వేసే హుండి (డోనేషన్ బాక్స్). భక్తులు విరాళాలు (ఇండియన్ కరెన్సీ సహా విదేశీ నోట్లు, వాల్యూ కరెన్సీ, బంగారం/బంగారు ఆభరణాలు) ఇందులో వేస్తారు. వాటి లెక్కింపు, లావాదేవీల నిర్వహణ చేసే గది లేదా కౌంటింగ్-హాల్ పరకామణి. ఈ విభాగం మీద భక్తులకు నమ్మకం, గౌరవం ఎక్కువ. అక్కడ ఏ రకమైన అవినీతి ఆరోపణ వచ్చినా అది భక్తుల విశ్వాసానికి పెద్ద దెబ్బ. గట్టి బందోబస్తు, నిఘా వ్యవస్థ, సీసీ కెమెరాల మధ్య వీటి లెక్కింపు ఉంటుంది.
అటువంటి చోటికి..
తిరుమల శ్రీవారి పరకామణి కానుకల లెక్కించడానికి శ్రీవారి సేవకులతో పాటు టీటీడీ ఉద్యోగులు స్వచ్ఛంద సేవకు వెళతారు. వారితో పాటు బ్యాంకు సిబ్బంది కూడా ఉంటారు. వారంతా బనియన్, పంచె మాత్రమే ధరించాలి. లోదుస్తులు కూడా ధరించకుండా టీటీడీ ఆంక్షలు అమలు చేస్తోంది.
తిరుమల పెదజీయర్ మఠం నుంచి వారి ప్రతినిధిగా ఓ ఉద్యోగి వెళ్లడం ఆనవాయితీ. ఆ విధుల కోసం జీయర్ మఠంలో ఏకాంగిగా ఉన్న పీవీ. రవికుమార్ లెక్కించిన కానుకలు రికార్డులో నమోదు చేసే విధులకు వెళ్లారు. 2023 ఏప్రిల్ ఏడో తేదీ యథావిధిగానే వెళ్లిని P.V. Ravi Kumar 920 అమెరికన్ డాలర్లు చోరీకి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. మే 30న కేసు నమోదు అయింది. మొదట్లో ఇది డాలర్ల చోరీ కేసుగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత “పరకామణి చోరీ’ కేసుగా ప్రాచుర్యంలోకి వచ్చింది. భక్తులు ఇచ్చిన విదేశీ కరెన్సీని చోరీ చేసి బయటకు తీసుకువెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. 2023లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఇదో ఇదో సంచలన కేసు.
2023 ఏప్రిల్ 27న పరకామణిలో చోరీపై Ravi Kumar పై తిరుమల టూ టౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. విచారణ తర్వాత మే 30, 2023న పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. కానీ, అప్పటికే Ravi Kumar, అతని భార్య తమ ఆస్తులను (భూములు, ఇళ్లు సహా మొత్తం 7 రకాల ఆస్తులు) TTDకి దానం చేయడానికి ఒప్పుకున్నారు. 2023 జూన్-లో ఈ దానాన్ని TTD అంగీకరించింది. అడ్మినిస్ట్రేషన్ బోర్డు ద్వారా ఒక తీర్మానం కూడా ఆమోదించారు. రవి ఇచ్చిన ఆస్తుల విలువ సుమారు ₹14 కోట్లకు పైబడి ఉన్నా మార్కెట్ విలువ ₹40 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఇంతటి ఆస్తులు విరాళంగా ఇచ్చిన వ్యక్తి పరకామణిలో చోరీ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదని భావించి 2023 సెప్టెంబరు 9న కేసును లోక్ అదాలత్‌లో పెట్టి సెటిల్‌మెంట్ చేసి కేసును ముగించారు.
ఎవరు ఫిర్యాదు చేశారు?
ఆనాడు టీటీడీ సెక్యూరిటీ విభాగంలో ఉన్న అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ గా ఉన్న వై. సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు మొదట్లో రవి కుమార్ పై కేసు నమోదు అయింది. ఈ అధికారి సమక్షంలోనే లోక్ అదాలత్ లో కొందరు బోర్డ్ సభ్యులు, అధికారులు కలిసి రాజీ చేశారు. ఇదేదో సాదాసీదా చోరీ కేసుగా మొదలై పరకామణి అంటేనే దొంగతనాలకు మారుపేరుగా ప్రాచుర్యంలోకి వచ్చింది. భక్తులు, దాతలు స్వామి వారిపై భక్తితో ఇచ్చే ఆస్తులు దొడ్డిదారిన దారి మళ్లుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ ఆస్తుల స్వీకరణ, లోక్ అదాలత్ సీటిల్‌మెంట్, ఎవరి అనుమతి మేరకు, ఎలా జరిగిందన్నది అనేదానిపై పారదర్శకత లేకపోవడంతో భక్తుల్లో, సామాజిక వర్గాల్లో, మీడియా కూడా ప్రశ్నలు సంధించింది.
2025లో రిట్ పిటిషన్, తిరిగి విచారణ ప్రారంభం...
సెటిల్మెంట్‌పై ప్రజా ఆందోళనలు, పత్రికల్లో ప్రచారం, పిటిషన్‌ల కారణంగా 2025లో న్యాయశాఖ జోక్యం చేసుకుంది. Andhra Pradesh High Court (ఏపీ హైకోర్టు)లో కేసు దాఖలైంది. దీంతో కోర్టు- లోక్ అదాలత్ ఆదేశాన్ని కొట్టివేసింది. తిరిగి విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది.
కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి విచారణ చేసిన అధికారులు, దానాన్ని స్వీకరించి లోక్ అదాలత్ లో కేసును ముగించినప్పుడు పాల్గొన్న అధికారులపై దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
లోక్ అదాలత్ ఆర్డర్‌ను రద్దు చేస్తూ, కొత్తగా విచారణ జరగాలనీ, పీవీ రవి కుమార్ ఆస్తుల వివరాలు, ఎవరికి ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు అనే వాటిపై విచారణ జరిపే తీరును నిర్దేశించింది.
చట్ట ప్రకారం, ప్రజలు/సాక్షుల భద్రతకు గ్యారెంటీ ఇవ్వాలని, వారిపై ఎలాంటి వత్తిళ్లు, బెదిరింపులు ఉండకూడదని, సాక్షుల భద్రతకు పోలీసులు పూచీ పడాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు అయింది. దీనికి రవిశంకర్ అయ్యన్నార్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ టీంలో Crime Investigation Department, Andhra Pradesh (CID), Anti‑Corruption Bureau, Andhra Pradesh (ACB) అధికారులు ఉన్నారు. పరకామణి కేసు, లోక్ అదాలత్ సెటిల్‌మెంట్, ఆస్తులు ఇచ్చిన దాతల పేర్లు, తీసుకున్న వారి పేర్లు, లోక్ అదాలత్ లో కేసు మూసివేత వంటి అంశాలను విచారణ చేస్తున్నారు.
ఈ సీఐడీ బృందం ఇప్పటికే అనేక మందిని విచారించారు. TTD మాజీ ఛైర్మన్ Bhumana Karunakar Reddy, మరో మాజీ ఛైర్మన్, Y.V. Subba Reddy, మాజీ TTD కార్యనిర్వాహక అధికారి (EO) A.V. Dharma Reddyని మూడు సార్లు విచారించారు. ఈ విచారణకు టీటీడీ వీజీఓ బాలిరెడ్డి, గిరిధర్ ను ఒకసారి విచారణ చేశారు. వీరితో పాటు SIT-CID గతంలో డ్రైవర్లుగా పని చేసిన 15 మందిని విచారించేందుకు సమన్లు జారీ చేసింది. విచారణ కేంద్రాన్ని తిరుపతి నుంచి విజయవాడకు మార్చారు.
సెక్యూరిటీ-ఆఫీసర్ అనుమానాస్పద మృతి
పరకామణి కేసులో ఫిర్యాదు చేసిన సెక్యూరిటీ అధికారి Y. Satish Kumar నవంబర్ 14వ తేదీ హత్యకు గురయ్యారు. ఈ కేసులో తొలి బాధితుడు అతడే. సీఐడీ సిట్ ఎదుట విచారణకు హాజరవుతున్న సమయంలో ఆయన హత్యకు గురయ్యాడు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం అతని తల వెనుక భాగంలో గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో సతీష్ ది హత్యగా భావిస్తున్నారు.
ఈ పరిణామం నేపథ్యంలో సాక్షుల భద్రతపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఈ కేసులో సాక్ష్యం ఇచ్చే సాక్షుల భద్రతకు పోలీసులు నిరంతరం పూచీ పడాలని, సీసీటీవీ- కాప్టివ్ కమ్యూనికేషన్ వంటి చర్యలు విధించాలని ఆదేశించింది. ఈ ఘటనపై డిసెంబర్ మొదటి వారంలో సిట్ బృందం రాష్ట్ర హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంది.
ఈ కేసుపై సందేహాలు ఎన్నో...
2023లో కేవలం 920 అమెరికన్ డాలర్ల చోరీగా కనిపించిన ఈ కేసు రానురాను పెద్ద వివాదాస్పద అంశంగా మారింది. దీని వెనుక పెద్ద ముఠా ఉండి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అదే సమయంలో సతీష్ కుమార్ హత్య ఈ కేసు దర్యాప్తు తీరునే మార్చివేసింది. హైకోర్టు కూడా అదేస్థాయిలో కేసును పరిగణలోకి తీసుకుంది.
లోక్ అదాలత్ పరిధి ఎంత?
సాధారణ IPC 379/381 కింద నమోదయ్యే ప్రాథమిక చోరీ కేసుల్ని లోక్ అదాలత్ లో పెట్టి రాజీ చేస్తూ ఉంటారు. కానీ, చౌర్యం జరిగిన స్థలం, ఆస్తులు భక్తుల దానం చేసినవి అయినందున ఈ కేసును లోక్ అదాలత్ పరిష్కరించలేదని, ఇది భక్తుల విశ్వాసానికి సంబంధించిన వ్యవహారమని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలా రాజీ చేయడం వల్ల అది భక్తుల నమ్మకాన్ని పొగుడుతుందని సామాజిక సేవా కార్యకర్తలు, విమర్శకులు అంటున్నారు. హైకోర్టు కూడా ఈ వాదనలను స్వీకరించింది.
మరణాలు, సాక్షుల భద్రత, పత్రాల దరఖాస్తు, మీడియా ఒత్తిళ్లు అన్నీ కలిసి ఇప్పుడీ కేసు రాష్ట్రంలో పెద్ద సంచలనాత్మక కేసుగా తయారైంది.
2025 నవంబర్ నాటికి, CID-SIT దర్యాప్తు వేగవంతమైంది. TTD మాజీ ఛైర్మన్‌లు, అధికారులు, పోలీసు అధికారులు, డ్రైవర్లు, ఇప్పటికే అనేక మందిని విచారించారు. హైకోర్టు మార్గదర్శకాల మేరకు విచారణ జరుగుతోంది. భక్తుల విశ్వాస పునరుద్ధరణ, పరకామణి భద్రత, విరాళాల లెక్కింపు, హుండి నిర్వహణా విధానాలు, పారదర్శకత విధానాలలో కొత్తగా మార్పులు (reforms) చేయవలసిన అవసరాన్ని ఈ కేసు సూచిస్తోంది.
వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే...
పరకామణి కేసులో రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణ ముగిసింది. విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో అధికారులు ఆయన్ను గంటన్నర పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. పరకామణి చోరీ అంశంపై సీఐడీ తనను ప్రశ్నించిందని చెప్పారు.
అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పానన్నారు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని పేర్కొన్నారు. ‘‘నా హయాంలో చోరీ జరిగిందా? అని అడిగారు. నా పదవీ కాలం ముగిసిన తర్వాత చోరీ అంశం బయట పడింది. ఈ విచారణను రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.