ఏ నలుగుర్ని భూమన కరుణాకర్ రెడ్డి పిచ్చి కుక్కలన్నారు?

భూమని కరుణాకర్ రెడ్డిని విచారణకు పిలిపించాలని వత్తిడి చేసిన ఆ నలుగురు ఎవరు?

Update: 2025-11-25 11:47 GMT
Bhumana Karunakar reddy
తిరుమల పరకామణి చోరీ కేసులో నోటీసులు అందుకున్న వైఎస్సార్‌సీపీ కీలక నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సిట్‌ విచారణకు హాజరయ్యారు. అదికారుల ముందుకు వెళ్లే ముందు ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'నాకు ఈ కేసుకు భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నన్ను ఈ కేసులో ఇరికించాలని దుష్టచతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నారా లోకేష్‌, టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు, వర్ల రామయ్య, పట్టాభి నన్ను కచ్చితంగా విచారణ చేయ్యాలని అధికారులపై ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడి భరించలేకనే అధికారులు నన్ను పిలిచారు. అయినను పోయి రావలే హస్తినకు. కూటమి ప్రభుత్వాన్ని మోసే పిచ్చి శునకాలు అక్షరాల విరోచనాలతో తమ పత్రికను నింపేశాయి’ అని భూమన అన్నారు.

 తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy)కి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తిరుమల శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్‌ డాలర్లను చోరీ చేస్తూ పట్టుబడిన పకరామణి ఉద్యోగి రవిపై 2023 ఏప్రిల్‌ 7న కేసు నమోదైంది. అప్పట్లో టీటీడీ ఏవీఎస్‌వోగా పనిచేసిన సతీశ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు తిరుమల ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇవాళ సాయంత్రం 4గంటలకు తిరుపతి పద్మావతి అతిథిగృహంలోని కార్యాలయంలో.. భూమన విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. దానికి అనుగుణంగా విచారణకు హాజరయ్యారు.

సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్వయంగా ఈ కేసు విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణిలో కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందం డిసెంబరు 2వ తేదీలోగా నివేదిక ఇచ్చేందుకు విచారణ చేపట్టింది. అదే సమయంలో విచారణ నిమిత్తం వస్తున్న ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ మృతి చెందారు. దీంతో దర్యాప్తులో కొంత జాప్యం చోటుచేసుకుంది. ఆ తర్వాత అప్పటి ఏవీఎస్‌వో పద్మనాభంను ప్రశ్నించారు. ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డిని విచారిస్తున్నారు.
Tags:    

Similar News