ఏపీలో ఇల్లు రూ.3.5 లక్షల లోపే!

ఈనెల 30 వరకే ఈ ఛాన్స్, రండి త్వరపడండి అంటున్న సర్కారు

Update: 2025-11-24 07:09 GMT
మీది ఆంధ్రప్రదేశా? అయితే మీకే ఈ వార్త. తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టిస్తాం రమ్మంటోంది రాష్ట్రప్రభుత్వం. మీకు మీ ఊళ్లో ఇంటి స్థలం ఉన్నా లేకున్నా ఇల్లు మాత్రం గ్యారంటీ అంటోంది ప్రభుత్వం. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ)- ఎన్టీఆర్‌ పథకం కింద ఇళ్లు కట్టించే పనిని వేగవంతంగా చేపట్టింది రాష్ట్రప్రభుత్వం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది రాష్ట్రప్రభుత్వం. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ)- ఎన్టీఆర్‌ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇందుకు అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేశారు. నవంబర్ 30తో గడువు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగుస్తుంది.
ఇప్పటికే సుమారు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గడువు ముగిసే నాటికి ఈ సంఖ్య 5 లక్షలకు చేరవచ్చునని అంచనా. గతంలో పట్టణాభివృద్ధి సంస్థల(యూడీఏ) పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పట్టణ) పథకాన్ని అమలైంది. అయితే కొన్ని సమస్యలు రావడంతో ఆ స్కీం ను నిలిపివేశారు. ఇప్పుడు యూడీఏల్లో కూడా గ్రామీణ పథకాన్ని అమలు చేస్తున్నారు. వీటి పరిధిలోనూ అర్హుల ఎంపికను చేపట్టనున్నారు.
ఎలా ఎంపిక చేస్తారంటే...
పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం రెండు విధాలుగా చేపడుతోంది. సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు 3.47 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తుంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వలు కలిసి ఈ మొత్తాన్ని అందిస్తాయి.
స్థలం లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లను కేటాయించి అక్కడ నిర్మాణం చేపట్టేందుకు ఇల్లును మంజూరు చేస్తుంది.
సొంత స్థలం ఉన్న వారి, స్థలం లేని వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
లబ్ధిదారుల ఎంపికకు కేంద్ర ప్రభుత్వం 'ఆవాస్‌+' అనే యాప్‌ను తీసుకొచ్చింది. రాష్ట్రంలో అర్హులను గుర్తించే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌లు, గృహనిర్మాణశాఖ ఏఈలకు ప్రభుత్వం అప్పగించింది.
వీరు ఇంటింటికీ వెళ్లి అర్హుల్ని గుర్తిస్తారు.
దరఖాస్తుదారు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు, లొకేషన్‌ ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. కొత్తగా ఎక్కడ ఇంటి నిర్మాణం చేపడతారో ఆ స్థలాన్నీ ఫొటో తీస్తారు. దరఖాస్తుదారు ఫొటోను యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ముఖ గుర్తింపును యాప్‌ క్యాప్చర్‌ చేసిన వెంటనే ఆధార్‌ కార్డు ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతుంది. జాబ్ కార్డు వివరాలు తీసుకుంటారు.
దరఖాస్తుదారుల్లో మొదట అత్యంత పేదలకే ఇల్లు మంజూరయ్యేలా యాప్‌ను కేంద్రం డిజైన్‌ చేసింది. యాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా అర్హుల జాబితా సిద్ధం కానుంది. ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాప్‌ ద్వారా నమోదు చేసిన వారి వివరాలను కేంద్రానికి నివేదించనుంది. అక్కడ మరోసారి తనిఖీ చేయనున్నారు. తుది జాబితాకు అనుగుణంగా ఇల్లు మంజూరు ఉంటుంది.
ఈ యాప్ ఎలా పని చేస్తుందంటే…
AwaasPlus 2024 మొబైల్ అప్లికేషన్ అనేది ప్రత్యేకంగా ఇన్‌స్పెక్టర్లు లబ్ధిదారుల సమాచారాన్ని సర్వే చేయడానికి రూపొందించిన యాప్. ఈ సర్వేలో ఉన్న ప్రశ్నలు చాలా సింపుల్‌గా ఉంటాయి. ఇవి PMAY-G ప్రయోజనాలు ఇవ్వాల్సిన వ్యక్తికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగపడతాయి.
ఇక, రూరల్ హౌసింగ్ మొబైల్ యాప్ అనేది PMAY-G (ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ) కింద ఇల్లు కట్టుకోవాలనే లబ్ధిదారుల కోసం తయారు చేసిన అప్లికేషన్.
ఇది ఎలా పనిచేస్తుందంటే:
ముందు లాగిన్ కావాలి, మొబైల్ నంబర్‌కి వచ్చే OTPని ఎంటర్ చేస్తే లాగిన్ పూర్తవుతుంది.
అదే అధికారులైతే AwaasSoft‌లో వాడే లాగిన్‌నే వాడతారు.
ఇంటి నిర్మాణం ఎక్కడ ఉందో ఇలా చూపిస్తారు. ఇల్లు ఏ దశలో ఉందో లబ్ధిదారుడు యాప్‌లో ఆ ఆప్షన్‌ను సెలెక్ట్ చేస్తాడు.
ఆ దశకి సంబంధించిన ఇంటి ఫోటోను యాప్‌తోనే తీసి అప్‌లోడ్ చేస్తాడు. ఫోటోలో టైమ్-స్టాంప్, జియో-లోకేషన్ ఆటోమేటిక్‌గా క్యాప్చర్ అవుతాయి.
ఎందుకు ఫోటో అప్‌లోడ్ చేయాలి?
ప్రభుత్వం ఇచ్చే తదుపరి విడత డబ్బు పొందాలంటే, ఇల్లు నిజంగా ఏ దశలో ఉందో రుజువు కావాలి. అందుకు ఆ ఆ ఫోటోనే ఆ సాక్ష్యం.
తరువాత ఏమవుతుంది?
లబ్ధిదారుడు అప్‌లోడ్ చేసిన ఫోటోను బ్లాక్ కార్యాలయం AwaasSoft‌పై పరిశీలిస్తుంది. అక్కడి అధికారులు ఫోటో, లోకేషన్ చెక్ చేసి సరైందని నిర్ధారిస్తారు. అప్పుడు మాత్రమే తదుపరి విడత ఆర్థిక సహాయం లబ్ధిదారుడికి విడుదల అవుతుంది.

ఇన్‌స్పెక్టర్లకు ఇలా సహాయపడుతుంది
PMAY-G లేదా ఇతర గ్రామీణ గృహ పథకాల క్రింద కట్టిన ఇళ్లను ఇన్‌స్పెక్టర్లు ఈ యాప్‌తోనే గ్రౌండ్‌లో చెక్ చేసి, ఫోటోలు అప్‌లోడ్ చేసి రికార్డు చేయవచ్చు.
Tags:    

Similar News