నేనుండగా జగన్ అధికారంలోకి రావడం కల్ల అంటున్న పవన్
రాజోలు గడ్డపై నుంచి చెప్తున్నా, అది జరగదని పవన్ కల్యాణ్ భీష్మప్రతిజ్ఞ
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి కోపం వచ్చింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పైన, ఆపార్టీ అగ్రనాయకత్వంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిగా, మర్యాదగా విమర్శించకపోతే తనలోని 'గట్టిదనాన్ని' చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు. తానేదో ఇది ఆషామాషీగా చెప్పడం లేదన్నారు. ఇంతకీ ఆయనకి ఎందుకంత ఆగ్రహం వచ్చిందో చూద్దాం.
బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని శివ కోడులో పల్లె పండుగ 2.0 పేరిట బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు.
"అధికారం పోయినా ఈ రోజుకీ వైసీపీ నేతల బూతులు, బుద్ధులు మారడం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా విమర్శించండి. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ గమనిస్తున్నా. తీరు మారకపోతే పవన్ కల్యాణ్‌లోని గట్టిదనం చూస్తారు. 2029లో అధికారంలోకి వచ్చేస్తామంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని.. రాజోలు గడ్డ మీద నుంచి చెబుతున్నా.. అది జరగదు" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తమ పార్టీలో ఎవరు తప్పు చేసినా తాను క్షమించనన్నారు. గ్రామ సమస్యలపై నిలదీయాలంటూ యువతకు పవన్ కల్యాణ్ సూచించారు.
2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలకు ఏపీ ఓటరు పట్టం కట్టాడు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. గ్రామీణ ప్రాంతాల రూపు రేఖలు మార్చేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. దాంతో గతేడాది ఇదే సమయంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద దాదాపు రూ. 4,500 కోట్ల వ్యయంతో 30 వేల పనులను ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఈ ఏడాది కూడా పల్లె పండగ 2. 0 కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఏడాది రూ.6,500 కోట్ల వ్వయంతో 52,000 పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది అని చెప్పారు.
కూటమి ప్రభుత్వానికి 15 ఏళ్ల సమయం ఇవ్వాలని ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. కొబ్బరిచెట్టును పెద్దకొడుకుగా ఎలా భావిస్తారో.. అలాగే కూటమి ప్రభుత్వాన్ని భావించాలని ప్రజలను ఆయన కోరారు.
ఈ సభలో ఆయన కాస్తంత భావోద్వేగంతోనూ మాట్లాడారు.
నిజానికి ఓజీ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ చిత్రసీమ నుంచి పూర్తిగా దూరమై మళ్లీ రాజకీయాలకు ఫోకస్ పై పెట్టారు. ఇటీవలి రోజుల్లో తనకు ఉన్న పెండింగ్ సినిమా కమిట్‌మెంట్లు పూర్తి చేసిన ఆయన, రాజోలులో జరిగిన ‘పల్లె పండుగ 2.0’ సభలో మాట్లాడారు. తాను తిరిగి సినిమాలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో, ముఖ్యంగా ‘They Call Him OG’ ఎందుకు పూర్తిచేశాడో స్పష్టంగా చెప్పాడు.
“OG లాంటి సినిమా 2004లోనే తీసే వాళ్లం. కానీ అప్పట్లో నా ప్రాధాన్యం సమాజం… సినిమా కాదు. ‘OG’పై దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం మీరు. నా అభిమానులు బాధపడ్డారు. ‘పాలిటిక్స్‌తో పాటు సినిమాలు కూడా చేయాలి’ అన్నారు. ‘తల ఎత్తుకుని తిరగలేకపోతున్నాం’ అన్నారు. అందుకే మీ కోసం చేశాను. సినిమా నా జీవనోపాధి. రాజకీయాలు నా బాధ్యత.”
ఇప్పుడు రాజకీయాలు ఆయన ప్రధాన ప్రాధాన్యత. అందువల్ల ఇకపై ఆయన పూర్తిస్థాయిలో రాజకీయ వ్యవహారాలను చూస్తారు. అందులో భాగంగానే వైసీపీపై విమర్శలతో తన ప్రసంగాలను మొదలు పెట్టారన్న టాక్ వినవస్తోంది.
2024 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీని అథఃపాతాళానికి తొక్కుతానని శపధం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తనలోని గట్టిదనాన్ని ఎలా బయటపెట్టదలిచారో భవిష్యత్ లో చూస్తామని ఆయన అభిమాని, రాజోలు వాసి రామనాయుడు వ్యాఖ్యానించారు.