చెప్పిందంతా ధర్మమే అనబోకు ధర్మారెడ్డీ!

పరకామణి చోరీ కేసులో మరోసారి సీఐడీ ముందుకు టీటీడీ మాజీ ఈవో

Update: 2025-11-26 13:56 GMT

తిరుమల పరకామణి చోరీ కేసులో (Tirumala Parakamani Case) టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి (TTD Former EO Dharma Reddy) మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన్ను ఇప్పటికే సీఐడీ తిరుపతిలో విచారించింది. ఆయన అసలు విషయం బయటకు రాకపోవడంతో మరోసారి విచారణకు రావాలంటూ సీఐడీ పిలించింది. దీంతో ఆయన బుధవారం విజయవాడ తులసినగర్‌లోని సీఐడీ కార్యాలయం మెట్లు ఎక్కారు. ధర్మారెడ్డి ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా చాలా ప్రశాంతంగా విచారణకు వచ్చారు. అందరికీ ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ కార్యాలయంలోకి వెళ్లారు.


టీటీడీ మాజీ ఈవోను సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని అధికారుల బృందం ఆయన్ను (ధర్మారెడ్డి)ని విచారిస్తోంది. ఇదే కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సహా పలువురు అధికారులను సీఐడీ నిన్న ప్రశ్నించింది. వారందరూ ఇచ్చిన సమాచారం ఆధారంగా ధర్మారెడ్డిని మరోసారి సీఐడీ విచారణకు పిలిచింది.

గతంలో ధర్మారెడ్డిని రెండు సార్లు విచారించిన సీఐడీ అధికారులు.. ఆయన చెప్పిన విషయాలను రికార్డ్ చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డినీ సీఐడీ విచారించింది.

పరకామణి కేసులో ఫిర్యాదుదారుడైన పోలీసు అధికారి సతీష్ కుమార్ మరణం ఈ కేసును మరో మలుపు తిప్పింది. దీంతో పరకామణి వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి.. ఎవరెవరు ఇందులో పాత్రధారులుగా ఉన్నారు?.. ఎవరెవరు ఏ అంశాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారనే అంశాలపై విచారణ అధికారులు ఆరా తీస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీటీడీ పరకామణి కేసులో దర్యాప్తు అధికారులు డిసెంబర్ 2 లోగా నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి మాజీ ఈవోలు, ఛైర్మన్లను అధికారులు విచారించారు. ప్రస్తుతం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సీఐడీ విచారించడం ఇది మూడో సారి.

ధర్మారెడ్డి తర్వాత టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కూడా సీఐడీ మరోసారి విచారించవచ్చునని భావిస్తున్నారు.

Tags:    

Similar News