నన్ను నమ్మండి, అమరావతికి భూములివ్వండి!
రాజధాని అమరావతికి 2వ దశ భూ సమీకరణ తప్పదని తేల్చిచెప్పిన చంద్రబాబు
By : The Federal
Update: 2025-11-28 03:57 GMT
రాజధాని అమరావతి అభివృద్ధి కావాలంటే రెండో దశ భూ సమీకరణ తప్పదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. కొంతకాలంగా తెరమరుగైన ఈ అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. తొలిసారి భూమి ఇచ్చిన రైతుల సమస్యలే పరిష్కారం కాలేదని అనేకమంది రోడ్డు ఎక్కిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసినట్టు కనిపించింది. ఇటీవల రాజధాని రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొన్ని సమస్యలను పరిష్కరించింది.
దీంతో ఊపిరి పీల్చిన రైతులు ప్రభుత్వం పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు రాజధాని రైతులతో సమావేశమయ్యారు. తన మనసులో మాటను చెప్పారు.
"రాజధాని అమరావతి కోసం రెండోదశ భూసమీకరణ తప్పదు" అని స్పష్టంచేశారు. "రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలకు భూములు లేవు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్‌సిటీ, విమానాశ్రయం, రైల్వేస్టేషన్ నిర్మించేందుకూ భూములు అవసరం. అవన్నీ వస్తేనే అమరావతి ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుంది. రెండోదశ భూసమీకరణకు రైతులు సహకరించకపోతే అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది" అని చంద్రబాబు చెప్పారు. రైతులు ప్రతి చిన్నదానికీ సోషల్ మీడియాకు ఎక్కడం, అంతర్గత విభేదాలతో సమస్యలను జటిలం చేయడం సరికాదన్నారు.
"అమరావతి రైతులు ఐక్యంగా ఉన్నప్పుడే విచ్ఛిన్నకర శక్తులు రాజధానికి నష్టం కలిగించాలని చూశాయి. 2019-24 మధ్య అమరావతిని నామరూపాల్లేకుండా చేయాలని ప్రయత్నించాయి. మీరంతా ఐక్యంగా పోరాడి కాపాడుకున్నారు. ఇప్పుడు మీరు వర్గాలుగా విడిపోయి... చిన్నచిన్న అంశాల్ని భూతద్దంలో చూపిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయి. అమరావతికి నష్టం జరిగితే మీరూ నష్టపోతారు" అని హెచ్చిరించారు చంద్రబాబు.
‘అమరావతే రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా ఉండాలి. ఇక్కడ అభివృద్ధి ఫలాల్ని రాజధాని రైతులే ముందు అందుకోవాలి. ఇక్కడ భూముల ధరలు పెరుగుతాయి. తొందరపడి మీ ఫ్లాట్లు అమ్ముకోవద్దు. నా అనుభవం, విజన్‌తో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో విజయం సాధించాను. ఒకప్పుడు ఎకరం రూ.లక్ష ఉన్న భూమి ఇప్పుడు రూ.170 కోట్లు పలుకుతోంది. మీకూ అలాంటి అభివృద్ధి కావాలో వద్దో ఆలోచించండి. మీరు నాపై నమ్మకంతో అడగ్గానే 33 వేల ఎకరాలు ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి ఏ విజన్‌తో మీ పొలాలు తీసుకున్నానో.. ఆ ప్రకారమే అభివృద్ధి చేస్తాను. రెండోదశ భూసమీకరణకు వెళ్లబోతున్నాం. మీకు సమ్మతమే కదా?’ అని రైతుల్ని చంద్రబాబు అడిగారు. రాజధాని ప్రణాళికకు కట్టుబడి అభివృద్ధి చేస్తూనే, రెండోదశ భూసమీకరణకు వెళ్తే తమకు అభ్యంతరం లేదని రైతులు చెప్పారు.
29 గ్రామాల పరిధిలో 2వేల మంది రైతులు భూసమీకరణలో ఇవ్వలేదని.. వాటిని భూసేకరణ ద్వారా మొదట తీసుకున్నాక, రెండోదశ భూసమీకరణకు వెళ్లాలని కొందరు రైతులు సూచించారు. ఇంకా ఇవ్వాల్సిన రైతులతో త్రిసభ్య కమిటీ మాట్లాడుతుందని, సమీకరణలో ఇచ్చేందుకు ముందుకు రాకపోతే, 15 రోజుల్లో నోటిఫికేషన్ జారీచేస్తామని సీఎం స్పష్టం చేశారు.