దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టుకో! చంద్రబాబుకు వైవీ సవాల్

శ్రీవారివారి లడ్డూ వివాదంపై వై.వి. సుబ్బారెడ్డి ఘాటు స్పందన, “నేను ఎలాంటి తప్పూ చేయలేదు, రాజకీయాల కోసమే నాపై దాడి

Update: 2025-11-27 06:53 GMT
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలు, పరకామణి చోరీ కేసుపై టీటీడీ మాజీ ఛైర్మన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, వైసీపీ అధినేత జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్ విసిరారు. కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ వాదోపవాదాల నేపథ్యంలో వైవీ ఈ సవాల్ విసరడం గమనార్హం. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వై.వి. సుబ్బారెడ్డి గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ప్రపంచ హిందువులకు పుణ్యక్షేత్రమైన తిరుమల ఆలయాన్ని రాజకీయాలకు వేదిక చేస్తున్నారని, లడ్డూ ప్రసాదంపై నెలలుగా జరుగుతున్న “విష ప్రచారం అత్యంత విచారకరం” అని వైవీపేర్కొన్నారు. SIT దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే మీడియాకు “లీకులు పేరిట తప్పుడు కథలు పంచుతున్నారు” అని ఆరోపించారు.
“టీటీడీ ఛైర్మన్‌గా నిష్కళంకంగా పనిచేశాను – నాపై ఆరోపణలు నిరాధారం” అన్నారు. తాను రెండు సార్లు టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తుచేస్తూ భగవంతునిపై, ధార్మిక సేవపై తనకు అపారమైన విశ్వాసం ఉందని, దేవుడి సేవలో తాను, తన కుటుంబం ఎప్పుడూ ఉండి పనిచేసినట్టు చెప్పారు. అయప్ప మాల 30 సార్లు వేసుకున్నానని, ఆధ్యాత్మికత తన జీవితంలో భాగమని వివరించారు.
నేను జగన్‌కు బంధువుననే టార్గెట్ చేశారు...
మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు సమీప బంధువునిగా ఉన్నందుకే ఈ వివాదాన్ని తన చుట్టూ తిప్పే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, టీడీపీ, ఎల్లోమీడియా కలిసి రాజకీయ లాభం కోసం లడ్డూ వివాదాన్ని విస్తరించారని ఆయన ఆరోపించారు. “సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేసిన వ్యక్తిని ఎలా నిందిస్తారు?” అని ప్రశ్నించారు.

“తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడారని చంద్రబాబు ఆరోపించినప్పుడు, నేను స్వయంగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. దేవుడి ప్రతిష్ట కాపాడేందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను” అన్నారు. “నేను తప్పు చేసినవాడినైతే సుప్రీంకోర్టుకి వెళతానా?” అని ప్రశ్నించారు.
టీటీడీ ల్యాబ్‌కు సంబంధించిన విషయాలు వివరిస్తూ ఏ ట్యాంకర్ అయినా తప్పనిసరిగా ల్యాబ్‌లో పరీక్షించాల్సిందే. నాణ్యతా ప్రమాణాలు సరిపోకపోతే వెంటనే వెనక్కి తిప్పిపంపుతారు.
2014-19లో చంద్రబాబు హయాంలో, తమ హయాంలో కూడా చాలానే ట్యాంకర్లు తిరస్కరణకు గురైన విషయాన్ని గుర్తు చేశారు. “ల్యాబ్ ఉన్నప్పుడు కల్తీ నెయ్యి లోపలికి ఎలా వస్తుంది?” అని ప్రశ్నించారు.
కల్తీ ఆరోపణలకు చంద్రబాబు జవాబు చెప్పాలి...
కల్తీ ట్యాంకర్లు 2024 జూన్–జులైలో వచ్చాయని SIT చెబుతోందని, ఆ సమయంలో అధికారంలో చంద్రబాబు ప్రభుత్వమే ఉందని గుర్తుచేశారు.
“అదే నిజమైతే బాధ్యత ఎవరిది?” అని సూటిగా ప్రశ్నించారు. తమ హయాంలో ల్యాబ్ ను బలోపేతం చేశామని, NDDBతో ఒప్పందం కూడా కుదిరింది” అని చెప్పారు.
2019–24 మధ్య 20 కోట్ల లడ్డూల తయారీలో కల్తీ జరిగినట్టు వచ్చిన ప్రచారం అవాస్తవమని చెప్పారు. తాము కిలో ₹326కు నెయ్యి కొన్నాం అందుకే కల్తీ జరిగిందనడం అబద్ధమని, చంద్రబాబు హయాంలో కూడా ₹276–₹295 మధ్య రేట్లు ఉన్నాయని వివరించారు. 2019–24 వరకు మాత్రమే కాకుండా గత 15 ఏళ్ల రికార్డుల్నీ పరిశీలిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని స్పష్టంగా ప్రకటించారు. మీడియా సమక్షంలో లై డిటెక్టర్‌ టెస్టుకైనా లేదా సత్యశోధన పరీక్ష కైనా మీడియా సమక్షంలో చేసినా నాకు అభ్యంతరం లేదు. సత్యమే గెలుస్తుందని చంద్రబాబు ప్రభుత్వానికి వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. దీనికి ప్రభుత్వం లేదా సిట్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
Tags:    

Similar News