పింఛన్ దారులకు తిప్పలు తప్పవా?

భారత ఎన్నికల సంఘం కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ లు పంపిణీ చేసేందుకు వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-03-31 04:14 GMT
తూర్పుగోదావరి జిల్లా నన్నయ్య యూనివర్సిటీలో పోలింగ్ కేంద్రాలు పరిశీస్తున్న ఎన్నికల కమిషనర్

సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో సామాజిక పింఛన్ ల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే ఏప్రిల్ ఒకటి నుంచి పింఛన్ ల పంపిణీ జరగదని చెప్పొచ్చు. వాలంటీర్ల సేవలను ఆపివేయాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఎటువంటి పనులైనా చేయించేందుకు వీలులేదని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలు కోసం వాలంటీర్లకు ప్రభుత్వం సెల్ఫోన్లు, ట్యాబులు, డివైజ్ ల వంటివి వాలంటీర్లకు అందించింది. అవన్నీ ప్రభుత్వం వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ పరికరాలను వెంటనే జిల్లా అధికారులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. శనివారం ఆదేశాలు రావడం వల్ల ప్రభుత్వ అధికారులు ఆదివారం అందుబాటులో ఉండే అవకాశం లేదు.

సచివాలయ ఉద్యోగుల ద్వారానే పింఛన్లు పంపిణీ చేస్తారా?

వాలంటీర్ల వద్ద వున్న పరికరాలను అధికారులకు అప్పగించాలని ఆదేశించారే తప్ప ఎలా అప్పగించాలనే ఆదేశాలు ఇవ్వలేదు. వారంతా సచివాలయాల్లో పరికరాలు అప్పగించే అవకాశం ఉంది. అధికారుల నుంచి డబ్బు డ్రా చేసి పింఛన్ దారులు ఇప్పటి వరకు వాలంటీర్లు ఇస్తూ వచ్చారు. ఏప్రిల్ నెలలో ఇచ్చే పింఛన్ లు ఏ ప్రాతిపదికన ఇస్తారనేది ఇంకా ప్రభుత్వం వెల్లడించలేదు. వాలంటీర్లు కాకుండా ఇతర ప్రభుత్వ అధికారులను వినియోగించి పింఛన్ లు పంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినందున సచివాలయ ఉద్యోగులను వినియోగించే అవకాశం ఉంది. అయితే వారు సచివాలయంలో పనులు చూసుకుంటూ పింఛన్ లు పంపిణీ చేయడం అంటే ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాల ఫిర్యాదుల కారణంగానే పింఛన్ లు సకాలంలో ఇవ్వలేకపోయామని చెప్పుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. ఇదే జరిగితే చాలా వరకు ముసలివాళ్లు, దివ్యాంగులు, విడోలు ఇలా పింఛన్ లు తీసుకునే వారి నుంచి ప్రతిపక్ష నాయకులకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

టెట్ రిజల్ట్ ప్రకటించొద్దు

డీఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు ఇచ్చినందున డీఎస్సీ ప్రసాసెస్ స్టార్ట్ అయింది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు చేపట్టిన ఏ కార్యక్రమమైనా సాధారణ పరిపాలన ద్వారా ముందుకు సాగుతుంది. అయితే టెట్ రిజల్ట్ కూడా ప్రకటించొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అంటే సాధారణంగా జరిగే కార్యక్రమాలకు కూడా ఒక విధంగా ఎన్నికల కారణంగా బ్రేక్ పడినట్లైంది. టెట్ రాసిన వారు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఒక్కసారిగా వారికి నోటి మాట రాకుండా ఆగినట్లైంది.

ఏపీటీఆర్టీ పరీక్ష రద్దు

ఎన్నకల నిబంధనావళి ప్రకారం ఏపీటిఆర్టీ పరీక్ష నిర్వహించవద్దని ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేవలం ఎన్నికల స్టంట్ గా డీఎస్సీని నిర్వహించి సొమ్ముచేసుకోవాలని ప్రభుత్వం చూసిందనేది నిరుద్యోగుల వాదన. డీఎస్సీని ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆపివేసింది. ఇప్పుడు బాధపడుతున్నది నిరుద్యోగులు. ఎందుకంటే డీఎస్సీ సందర్భంగా వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్ల వద్ద కోచింగ్ లు తీసుకున్నది అధికారులు కాదు కదా? నిరుద్యోగులు పూటకు ఉన్నా లేకున్నా కోచింగ్ సెంటర్లకు వేలకు వేలు ఇచ్చారు. కనీసం మరో నెల పాటు కోచింగ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే అలాగే ఉంటే చదువుకున్నది కాస్తా మరిచిపోతారు. అందుకని కోచింగ్ ను కంటిన్యూ చేయాల్సి వుంటుంది.

స్వార్థాలకు బలి అవుతున్న నిరుద్యోగులు

ఎవరి స్వార్థం వారిది. బలి అయ్యేది నిరుద్యోగులు. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు ఈ నిర్ణయం తీసుకోవడం నిరుద్యోగులను మోసగించడం. మరో పెద్ద మోసం కూడా చెప్పాల్సి వుంటుంది. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతున్నది. ఆన్ గోయింగ్ ప్రాసెస్ ను ఎందుకు ముందుకు తీసుకుపోవడం లేదనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎన్నికల్లో నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టి ముందుకు పోయే నాయకులు ఎవ్వరూ బాగు పడలేదని నిరుద్యోగులు శాపనార్థాలు పెడుతున్నారు.

Tags:    

Similar News