ఏపి మద్యంలో విషపూరితాలున్నాయా?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం అమ్ముతున్నారా? ఎందుకు ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని మేధావులు ఆరోపిస్తున్నారు.

Update: 2024-04-03 10:40 GMT

(జి విజయ కుమార్ )

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యంలో విషపూరిత కారకాలు ఉన్నాయని.. అవి తాగడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ప్రమాదం వస్తోందని మేధావి వర్గం అభిప్రాయపడింది. సిటిజన్‌ ఫర్‌ డెమోక్రెసీ ఆధ్వర్యంలో ‘స్వేచ్ఛాయుత ఎన్నికలు–మద్యం ప్రభావం–నియంత్రణ–మన ముందున్న సవాళ్లు’ అనే అంశంపై విజయవాడలో రౌండ్‌టేబుల్‌సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నియంత్రణను దశల వారీగా తీసుకొచ్చి స్టార్‌ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆ మాట మరిచారనే అభిప్రాయాన్ని సమావేశంలో చర్చకు తీసుకున్నారు. మద్యానికి బానిసలైన కుటుంబాలు జీవితాన్ని వృధా చేసుకుంటున్నాయనే అభిప్రాయంతో ప్రభుత్వం రాక ముందు నుంచి మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేసి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మద్య నిషేధం ఉద్యమానికి కొంత వరకు నాంది పలికారు. అయితే ఏమి జరిగిందో ఏమో కానీ ఆయన కూడా ఆ ఉద్యమ కాడిని కింద పడేశారు. ఈ సమావేశంలో వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియాకు విడుదల చేసిన ఒక రిపోర్టును గుర్తు చేసుకున్నారు.
ఈ రిపోర్టుపై సీపీఐ కృష్ణా జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అమ్ముతున్న మద్యం బ్రాండ్స్‌ అన్నీ జగన్‌ ప్రభుత్వ బ్రాండ్సేనని అన్నారు. కొన్ని వివరాలను ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వెల్లడించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ బంధువర్గానికి సంబంధించిన బ్రేవరేజెస్‌ కంపెనీల్లో అతి ఖర్చుతో మద్యాన్ని తయారు చేస్తున్నారు. మొత్తం 2,725 రకాల బ్రాండ్స్‌ ఉన్నాయి. ఏ ఒక్క బ్రాండ్లో కూడా నాణ్యతా ప్రమాణాల్లేవు. జగన్‌ సిండికేట్స్‌ నుంచి మాత్రమే ఈ మద్యం ప్రభుత్వం దుకాణాల్లోకి వస్తోంది.
ప్రమాదకరమైన కెమికల్స్‌
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమ్ముతున్న ఓల్డ్‌ టైమర్, చాంపియన్, రాయలసీమ గ్రీన్‌ బయాస్‌ వంటి ఆరు రకాల మద్యాన్ని చెన్నైలోని ఒక ప్రధానమైన ల్యాబొరేటరీకి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో ప్రమాదకర విష పదార్థాలు మద్యంలో ఉన్నట్లు రిపోర్టుల్లో పేర్కొన్నారు. ఈ రిపోర్టులను మాజీ ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా తెప్పించినట్లు వీడియోను కూడా యూ ట్యూబ్‌లో రిలీజ్‌ చేశారని వనజ చెప్పారు. ఈ విషపదార్థాలు చాలా తక్కువ ధరలకు వస్తుందని ఫార్మా కంపెనీల్లో ఎక్స్‌స్ట్రా మెడిసిన్‌ వాడే కెమికల్‌గా నిర్థారించారు. స్పిరిట్‌ కూడా ఎక్కువుగా కలపడం వల్ల శరీరానికి భారీగా డేమేజ్‌ తెలియకుండా జరుగుతుందని రిపోర్టులో వెల్లడైనట్లు వనజ తెలిపారు. ఇంత ప్రమాదకరమైన విష కారకాలతో నిండిన మద్యాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సామాన్యుడు కూడా కొనుగోలు చేయలేని ధరలు పెట్టి విక్రయించడం దారుణమైన అంశంగా సమావేశం పరిగణించింది.
ఎన్నికల సమయంలో మద్యం వ్యాపారలు సొమ్ము చేసుకోవడం, పోటీలో ఉన్న అభ్యర్థులు కోట్లు ఖర్చు పెట్టి అనారోగ్యాన్ని కొని ఓటర్లకు పంపిణీ చేయడం దారుణాతి దారుణమని ఈ విషయం పాలకులైన పెద్దలకు ఎందుకు బోదపడటం లేదని సమావేశం ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్‌లో విషపూర్తి మద్యం అమ్మకాలకు ముఖ్యమంత్రే కారకుడని ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టాలనే ఉద్దేశంతో మద్యం నియంత్రణ కమిటీ నాయకులున్నారు. ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీడిఎఫ్‌ జాయింట్‌ సెక్రెటరీ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చర్‌పర్సన్‌ గద్దె అనురాధా, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి చర్చించారు.


Tags:    

Similar News