అభ్యర్థుల ఎంపికలో బాబు సక్సెస్

ఏపీలో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంలో సక్సెస్ అయిందని పలువురు రాజకీయ మేధావులు చెబుతున్నారు. ఇందుకు పలు కారణాలు వారు విశ్లేషిస్తున్నారు.

Update: 2024-03-22 07:48 GMT
చంద్రబాబునాయుడు

తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక సమయంలో అడుగులు వేసేటప్పుడు స్థానిక సమస్యలు, అభ్యర్థి బలం, బలహీనతలు అన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అవన్నీ పరిశీలించిన తరువాతే చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించి శభాష్ అనిపించుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం పార్టీలో బలమైన వర్గం కమ్మ సామాజిక వర్గం. అయితే ఆ వర్గానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడంతో పాటు మిగిలిన వర్గాల వారికి కూడా టిక్కెట్లు కేటాయించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

అన్ని వర్గాలకు ప్రాధాన్యం

బీసీలకు కూడా చంద్రబాబు మంచి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పొచ్చు. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ మూడో జాబితాలో ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో తెదేపా పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా మరో 11 మందిని ప్రకటించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది. అసెంబ్లీ స్థానాల్లో పలాస-గౌతు శిరీష, పాతపట్నం- మామిడి గోవిందరావు, శ్రీకాకుళం-గొండు శంకర్‌, శృంగవరపుకోట- కోళ్ల లలితకుమారి, కాకినాడ సిటీ- వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), అమలాపురం (ఎస్సీ)- అయితాబత్తుల ఆనందరావు, పెనమలూరు-బోడె ప్రసాద్‌, మైలవరం- వసంత వెంకట కృష్ణప్రసాద్‌, నరసరావుపేట- చదలవాడ అరవిందబాబు, చీరాల- మద్దులూరి మాలకొండయ్య యాదవ్‌, సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని నియమించింది. లోక్‌సభ స్థానాల అభ్యర్థులకు సంబంధించి శ్రీకాకుళం- కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విశాఖపట్నం- మతుకుమిల్లి భరత్, అమలాపురం- గంటి హరీష్, ఏలూరు- పుట్టా మహేశ్‌ యాదవ్, విజయవాడ- కేశినేని శివనాథ్‌ (చిన్ని), గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట- లావు శ్రీకృష్ణ దేవరాయలు, బాపట్ల- టి.కృష్ణ ప్రసాద్, నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాదరావు, కర్నూలు- బస్తిపాటి నాగరాజు, (పంచలింగాల నాగరాజు), నంద్యాల- బైరెడ్డి శబరి, హిందూపురం- బీకే పార్థసారథిని ఎంపిక చేసి ప్రకటించారు.

పొత్తుల్లోనూ చిత్తుకాని ఎత్తులు

పొత్తుల సందర్భంగా కొన్ని ఎత్తులు చిత్తవుతుంటాయి. కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సక్సెస్ అయ్యాయి. ఏ నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున నిరసనలు, ర్యాలీలు నిర్వహించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో చాలా వరకు చూశాం. ఎక్కడ పట్టినా నిరసనలు కనిపించేవి. అవేమీ ఇక్కడ జరగలేదు. క్రిష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాత్రం కాస్త హడావుడి జరిగింది. టీముల ద్వారా చేయించిన సర్వేల్లో కానీ, ఫోన్ సర్వేల్లో కానీ తాను పార్టీ తరపున గెలుపు బాటలో ఉన్నానని అయినా నాకు సీటు లేదన్నారని తన బాధను మీడియా పరంగా బోడె ప్రసాద్ చెప్పారు తప్ప రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేయలేదు. అందుకేనేమో ఆయనకు సీటు ఇచ్చారు. ఇక్కడి నుంచి దేవినేని ఉమామహేశ్వరావును పోటీలోకి దింపాలని భావించినా సరైన అభ్యర్థి బోడె ప్రసాద్ మాత్రమేనని గుర్తించిన అధిష్టానం ఆయనకే టిక్కెట్ కేటాయించింది. ఇలా ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నా చంద్రబాబుకు ఇబ్బందులు ఎదురు కాలేదు.

కాపు ఓట్లు పూర్తిగా డైవర్ట్ అవుతాయా?

తెలుగుదేశం పార్టీకి కాపుల ఓట్లు పూర్తి స్థాయిలో వస్తాయా? లేదా? అనేదానిపై చర్చ మొదలైంది. పొత్తుల్లో భాగంగా సీట్లు రాని తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టీపట్టనట్లు ఉన్నారని సమాచారం. పైగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టంలేని కొందరు టీడీపీ కాపు నాయకులు పూర్తి స్థాయిలో సహకరించే అవకాశాలు కనిపించడం లేదు. కాపులు పూర్తి స్థాయిలో పనిచేస్తేనే గోదావరి జిల్లాల్లో వారు అనుకున్న మేర విజయం సాధించడం సాధ్యమవుతుంది. అలా కాకుంటే కష్టంగానే ఉంటుందనే వాదన కూడా ఉంది. పిఠాపురంలో టీడీపీ నాయకుల నుంచి కాస్త నిరసన వ్యక్తమైనా వెంటనే సర్థుకుంది.

రోజువారీ ప్రచారానికి సన్నద్ధం

ఇప్పటికే రా.. కదిలిరా.. పేరుతో చంద్రబాబు, యువగళం పేరుతో లోకేష్, నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి ఎన్నికల ప్రచార రంగంలో ఉన్నారు. సభలు కూడా సక్సెస్ అవుతున్నాయి. ఓటర్ల మనసులు గెలుచుకోవడంలో భువనేశ్వరి ముందున్నారని చెప్పొచ్చు. జనం ఎంతమంది వచ్చారనే కాదు కానీ అక్కడికి వచ్చిన వారితో మాట్లాడుతున్న తీరు చాలా మందికి నచ్చింది. అప్పుడప్పుడూ భార్యా భర్తల సంభాషణ (అంటే చంద్రబాబు, భువనేశ్వరి గురించి) గురించి చెబుతుంటే జనం ఆసక్తిగా వింటున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు నువ్వు మాట్లాడ గలవు, జనం మధ్యకు వెళ్లమని ప్రత్సహించింది కూడా చంద్రబాబేనని పలు సార్లు ఆమె చెప్పారు. యువగళం సభల్లో లోకేష్ చెబుతున్న మాటలు కూడా సభకు వచ్చిన వారిని బాగానే ఆకట్టుకుంటున్నాయి. తప్పులు చేస్తున్నవారిని వదిలేదని లేదని రెడ్ బుక్ చూపిస్తూ చెప్పిన మాటలు చాలా మందిని ఆకర్షించాయి.

ఉమ్మడి సభలు ఎన్ని పెడతారో..

తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు కలిసి ఏర్పాటు చేసే సభలు ఎన్నిచోట్ల పెడతారోననే చర్చ పార్టీ వర్గాలతో పాటు ప్రజల్లోనూ సాగుతున్నది. మోదీ చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన సభకు వచ్చి మాట్లాడి వెళ్ళారు. మోదీ మళ్లీ ఏపీలో జరిగే ప్రచార సభలకు హాజరవుతారా? లేదా? అనే సందేహం కూడా పార్టీ వర్గాల్లో ఉంది. ఏపీకి వచ్చినా అధికార పక్షాన్ని పళ్లెత్తు మాటకూడా అనకుండా వెళ్లారనే అసంతృప్తి టీడీపీ వారిలో వుంది. దీనిని బీజేపీ వారు ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన సీట్లలో నేతలను కూడగట్టుకవడంలో సక్సెస్ అవుతారా? లేక చంద్రబాబు నాయుడు తన వర్గాన్ని పిలిపించి చెప్పాల్సిందేనా అనే అనుమానాలు కూడా ఆయా పార్టీలలో వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News