బాబు ప్రభుత్వం ఈ పది మంది వైఎస్సార్‌సీపీ నేతల్ని వదిలిపెట్టేలా లేదు!
తెలుగుదేశం పార్టీ వైఎస్సార్‌సీపీలోని 10 మంది కీలకనేతల్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. వీళ్లలో ఒకర్ని ముందు అరెస్ట్ చేయించింది. ఎవరా పది మంది? ఏమా కథ?
Byline : G.P Venkateswarlu
Update: 2024-10-08 09:53 GMT
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తిగా సాగుతున్నాయి. ప్రతికార చర్యలే పరమార్థంగా సాగుతున్న ప్రస్తుత రాజకీయ రణరంగంలో ఎవరు అధికారంలో ఉంటే వారు– తమకు గిట్టని వారిని– టార్గెట్ చేయడం సర్వసాధారణమైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కన్నూ మిన్నూ కానకుండా మాట్లాడిన వారు ఇప్పటి టీడీపీ ప్రభుత్వంలో టార్గెట్ అయినట్టే కనిపిస్తోంది.
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని బలోపేతం చేసే దిశగా పలువురు నాయకులు టీడీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు వారి భరతం పట్టాలని టీడీపీ ప్లాన్ వేసినట్టుగా కనిపిస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారారో వారిని పార్టీ టార్గెట్ చేసింది. ఎవరు అధికారంలో ఉంటే వారు పోలీసు శాఖను వాడుకుంటుంటారు. అప్పుడైనా ఇప్పుడైనా ఇదే తీరు. మినహాయింపు ఏమీ లేదు. అయితే ఈసారి పోలీసులు మరీ బరితెగించకుండా ఆచీ తూచీ అడుగులు వేస్తున్నారు. మాజీ మంత్రులను, ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్సీల్లో ఇద్దరిని అరెస్ట్ చేసేందుకు శత విధాల ప్రయత్నించారు. పోలీసు వ్యూహం నుంచి ప్రస్తుతానికి తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల తదుపరి వ్యూహమేమిటో పరిశీలిద్దాం.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతోనే వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ ఈస్ట్ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, సజ్జల రామకష్ణారెడ్డి నిందితులుగా నమోదయ్యారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తి బోషిడీకే అంటూ ఘటుగా కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ ఏపీ కార్యాలయం వద్దకు వెళ్లి పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ ఆఫీస్‌పై రాళ్ల వర్షం కురిసింది. ఇప్పుడా కేసు తెరపైకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో కొందరిపై పోలీసులు కేసులు పెట్టలేదన్న టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు ఇప్పుడు వైఎస్సార్‌సీపీలోని ముఖ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ కు పంపారు.మిగిలిన వారికి కోర్టు నుంచి ఉపశమనం దొరికింది. ముందస్తు బెయిల్ మంజూరైంది. రిమాండ్‌లో ఉన్న నందిగం సురేష్‌పై మరో కేసులో పోలీసులు పీటీ వారంట్ జారీ చేశారు. దీంతో మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ అమలుకు అనుమతి మంజూరు చేసింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చినా... 2022లో వెలగపూడిలో రెండు వర్గాల మధ్య జరిగిన దాడిలో మరియమ్మ అనే వద్ధురాలు మతి చెందింది. ఇందుకు అప్పటి ఎంపీ సురేష్ కారణమని కేసు నమోదైంది. పీటీ వారంట్ మేరకు తుళ్లూరు పోలీసులు సురేష్‌ను అరెస్ట్ చూపించి కోర్టులో హారు పరచగా 14 రోజులు రిమాండ్ విధించింది.
ఈ కేసులో మిగిలిన వారికి ముందస్తు బెయిల్ రావడంతో ఇంకేదైనా కేసుల్లో దొరుకుతారేమోనని టీడీపీ ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ప్రధానంగా టార్గెట్‌లో ఉన్న రెండో వ్యక్తి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేనీ వంశీమోహన్. ఈయన చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కోపం టీడీపీ వారిలో ఉంది. ఈ వ్యాఖ్యలకు ఆనాడు చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం, మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగుపెడతానని భీష్మప్రతిజ్ఞ చేయడం తెలిసిందే. ప్రధానంగా చంద్రబాబు, లోకేష్‌లు సందర్బం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సందర్బంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి సంఘటనలో వంశీ ఉన్నారంటూ నమోదైన కేసులో వంశీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వంశీ హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకోవడంతో అది కుదరలేదు.
ఇక మూడో టార్గెట్ గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరావు (కొడాలి నాని). ఈయన వైఎస్సార్‌సీపీలో మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుపై ఓ రేంజ్ లో రెచ్చిపోయేవారు. కొన్ని సందర్భాలలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రెండు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. తరువాత వాలంటీర్స్‌ను బలవంతంగా నానీ రాజీనామా చేయించారని కొందరు వాలంటీర్లు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కేసు పెట్టారు. ఈ కేసుల్లో నానీ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. మద్యం గోడౌన్‌లో నాని అక్రమాలకు పాల్పడ్డారని ఇటీవల టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ఈ కేసులో ఇంకా బెయిల్ రాలేదు. ఇలా కేసులపై కేసులు నానిపై నమోదవుతూనే ఉన్నాయి.
మాజీ మంత్రి జోగి రమేష్‌ది ప్రత్యేకమైన కేసు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటిపైకి దాడికి వెళ్లారని కేసు నమోదైంది. అప్పట్లో కొందరు అనుచరులతో చంద్రబాబు ఇంటిముందు జోగి రమేష్ హంగామా సష్టించారు. ఈ కేసులో ఇప్పటికే పలు సార్లు జోగి రమేష్‌కు నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించారు.
ప్రధానంగా కష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నాయకులే టీడీపీ నేతల టార్గెట్ అయ్యారు. రాయల సీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి కూడా టీడీపీ టార్గెట్‌లో ఉన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం పుంగనూరు ఎమ్మెల్యే. మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీ. వీరిని పుంగనూరు వెళ్లొద్దని, వెళితే టీడీపీ వారు దాడి చేసే అవకాశం ఉందని చెప్పి కొద్దిరోజులు పుంగనూరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే మిథున్‌రెడ్డి ఒక రోజు పుంగనూరు వెళ్లి సంచలనం సష్టించారు. ఎన్ని కేసులు పెట్టినా బయపడేది లేదన్నారు. ప్రస్తుతం మిథున్ రెడ్డికి కేంద్ర ప్రభత్వం ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేసింది.
పెద్దిరెడ్డిపై మదనపల్లి ఫైల్స్ దగ్ధం సంఘటనలో కేసు నమోదు చేద్దామని ప్రభుత్వం భావించినా పెద్దిరెడ్డిపై ఆరోపణలు నిరూపించేందుకు ఒక్క ఆధారం కూడా పోలీసులు చూపించలేక పోయారు. దీంతో వీరిద్దరిపై ప్రభుత్వం గురిపెట్టినా ఆ గురి నుంచి వారు తప్పించుకుంటున్నారు.
దీన్నిబట్టి చూస్తుంటే టీడీపీ టార్గెట్ లో మాజీ ఎంపీ నందిగం సురేష్, ప్రస్తుత ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ మంత్రులు కొడాలి నానీ, జోగి రమేష్, మాజీ మంత్రి, స్వర్గీయ దేవినేని నెహ్రూ కుమరుడు అవినాష్, వైసీపీలో నెంబర్ టూగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిధున్ రెడ్డి, ఒకప్పటి టీడీపీ నాయకుడు ప్రస్తుత వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి ఉన్నట్టు అర్థమవుతోంది.