ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి

అయితే పవన్‌లా గొప్ప వ్యక్తి కావాలి.. లేకుంటే పవన్‌కు అనుచరుడిగా ఉండాలని నాగబాబు జనసేన శ్రేణులకు సూచించారు.;

Update: 2025-03-14 15:19 GMT

జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ సోదరుడు కొణిదెల నాగబాబు ఒక వార్నింగ్‌ జారీ చేశారు. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ జయకేతనం సభలో జనసేన శ్రేణులకు ఒక వైపు భుకాంక్షలు చెబుతూనే.. మరో వైపు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు ఒక ఘాటైన వార్నింగ్‌ ఇచ్చారు. అధికారం వచ్చింది కాదా అని జనసేన నాయకులెవ్వరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకోవాలి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు అంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

అలా ఇష్టమొచ్చినట్లు, నోటికి వచ్చినట్లు ఎవరికి వారు మాట్లాడితే ఏమి జరుగుతుందో చూశాం.. నోటి దురుసు ఉన్న నాయకుడికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద సెటైర్లు వేశారు. ఇంకా తన ప్రసంగం కొనసాగిస్తూ.. వైఎస్‌ జగన్‌ మీద సినిమా స్టైల్లో సెటైర్లు వేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక హాస్య నటుడు అంటూ సీరిస్‌ సెటైర్‌ పేల్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి హాస్య నటుడు కలలు కంటూనే ఉంటారని.. మరో 20 ఏళ్ల వరకు కలలు కంటూనే ఉండాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సలహా ఇస్తున్నట్లు నాగబాబు తనదైన స్టైల్‌లో సెటైర్లు పేల్చారు.

రాజకీయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని తనకు పవన్‌ కల్యాణ్‌ చెప్పారని, దానిని తూచా తప్పకుండా అందరూ పాటించాలని, తాను కూడా పాటిస్తున్నట్లు చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడని, తన 12 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని వెల్లడించారు. పవన్‌ కల్యాణ్‌ క్రమశిక్షణను అందరూ పాటించాలనే సలహా జనసేన శ్రేణులకు సూచించారు. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ గెలుస్తారనే విషయం తనకు ముందే తెలుసన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలో రాబోయే 20 ఏళ్లల్లో స్వర్ణయుగం చూడబోతోందన్నారు. తనకు పదవులు వచ్చినా.. పదవులు దక్కక పోయినా పవన్‌ కల్యాణ్‌కు సేవలు చేస్తామన్నారు. అడగకుండా వరాలు ఇచ్చే వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని, ప్రజల బాగోగుల కోసం కృషి చేసే నాయకుడు పవన్‌ కల్యాణ్‌ అని తన తమ్ముడిని నాగబాబు పొగడ్తలతో ముంచెత్తారు. జనసేనకు ప్రాణవాయువు కార్యకర్తలు నాయకులు, వీరమహిళలు అని నాగబాబు అన్నారు. అయితే పవన్‌లా గొప్ప వ్యక్తి కావాలి.. లేకుంటే పవన్‌కు అనుచరుడిగా ఉండాలని నాగబాబు జనసేన శ్రేణులకు సూచించారు.
Tags:    

Similar News