విద్యుత్ ఉత్పత్తిపై స్పెషల్ ఫోకస్.. ఇంజినీర్లకు భట్టి సూచనలు
విద్యుత్ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి అన్ని కేంద్రాల నుంచి ప్రతి వారం నివేదిక అందివ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
విద్యుత్ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి అన్ని కేంద్రాల నుంచి ప్రతి వారం నివేదిక అందివ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. భారీ కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాలని వివరించారు. విద్యుత్ సరఫరాల ఎటువంటి అంతరాయం రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు 24/7 విద్యుత్ అందించేలా ఉత్పత్తిని పెంచాలని ఆయన అధికారులకు తెలిపారు. థర్మల్, హైడల్ విద్యుత్తు ఉత్పాదనకు సంబంధించిన శాఖల సీఈలతో మహాత్మ జ్యతిరావు ఫూలే ప్రజా భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు భట్టి విక్రమార్క.
బొగ్గు నిల్వ ఉంచుకోండి
ఈ సందర్భంగానే రాష్ట్రంలోని ప్రతి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి బొగ్గు నిల్వలపై కూడా ఆయన మాట్లాడారు. ప్రతి ఉత్పత్తి ప్లాంట్‌లో కనీసం 17 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచుకోవాలని సూచించారు. ‘‘ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలి. పని విషయంలో ప్రతి ఒక్కరూ నిబద్దతో ఉండాలి. నిర్లక్ష్యం, అలసత్వం, ఆలస్యం కనిపించకూడదు. విద్యుత్ శాఖ అంటేనే 24/7 పనిచేసే శాఖ. దీనిని అధికారులు, సిబ్బంది అందరూ గుర్తుంచుకోవాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పని చేయాలి. 24 గంటలు విద్యుత్ ఉత్పత్తి ఆగకుండా చూసుకోవాలి’’ అని ఇంజినీర్లకు తెలిపారు.
నేను అందుబాటులో ఉంటా..
‘‘విద్యుత్ శాఖలో పనిచేసే వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నా దృష్టికి తీసుకురండి. నేను మీకు 24 గంటలు అందుబాటులో ఉంటా. మీ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తా. విద్యుత్ ఉత్సాదనలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. సమాజానికి వెలుగులు అందించే శాఖ మనది. కాబట్టి సేవా దృక్పథంతో అంతా పనిచేయాలి. నిర్దేశిత లక్ష్యాలను అందుకోవడం ప్రాణాళికను సిద్ధం చేసుకుని దాని ప్రకారం పనిని ముందుకు నడిపించాలి. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ప్రతి వారం ఇంజినీర్లు, అధికారులు నాకు నివేదికలు అందించాలి’’ అని ఆదేశించారు.
నిర్ణయాలు సకాలంలో తీసుకోవాలి
అంతేకాకుండా నిర్ణయాలు సకాలంలోనే తీసుకోవాలని, అప్పుడు వాటి వల్ల మంచి ఫలితాలు అందుతాయని భట్టి విక్రమార్క.. అధికారులకు వివరించారు. అలా చేయని పక్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకు గత ప్రభుత్వమే నిదర్శనమని చెప్పారు. ‘‘నిర్ణయాలను సకాలంలో తీసుకోవడం చేతకాకనే గతంలో శ్రీశైలం, జూరాల వంటి హైడల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి, వాటి వల్ల తీవ్ర నష్టం కలిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి సమస్య ఉండదు. అలాంటికి పునరావృత్తం కూడా కాకూడదు. కాబట్టి అధికారులంతా అంకితభావంతో పనిచేయాలి. అందుకోసమే ప్రతి వారం ఉత్పాదనకు సంబంధించి నివేదికలు అందించాలి’’ అని వెల్లడించారు.
అయితే ఇంజినీర్లు ఇచ్చే నివేదికల ద్వారా అనేక ఉపయోగాలు ఉంటాయని శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నివేదికలతో తమ సమస్యలతో పాటు ఉత్పత్తి ప్లాంటి పురోగతిని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లొచ్చని, ఈ నివేదికల ఆధారంగా నిర్దేశి లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయడానికి మంత్రికి సహకరిస్తాయని శాఖాధికారులు వివరిస్తున్నారు. అంతేకాకుండా విద్యుత్ ఉత్పత్తిని సరైన ట్రాక్‌లో ఉంచడానికి కూడా ఈ నివేదికలు ఉపయోగపడతాయని చెప్తున్నారు.