పాత కారు.. మురిసిపోయిన సీఎం సారు..
పాత మిత్రునితో చంద్రబాబు జ్ఞాపకాలెన్నో...
By : The Federal
Update: 2025-11-01 03:06 GMT
ఎంత ఎదిగినా కొన్ని మధుర స్మృతులు అలాగే మిగిలిపోతుంటాయి.. వాటిని అపురూపంగా చూసుకుంటాం కూడా.. మనం వాడిన తొలి సైకిలు, తొలి స్కూటరు, తొలి కారు, ఉన్న ఇల్లు, కొన్న పుస్తకం.. ఇలా ఎన్నో.. దీనికి చంద్రబాబు నాయుడు కూడా మినహాయింపు కాదు.
1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి రోజుల్లో ఇప్పటి మాదిరి రకరకాల కార్లు, హైఎండ్ కార్లు లేవు. మంత్రులకి, ముఖ్యమంత్రులకి ఇచ్చే కాన్వాయిలో అంబాసిడర్ కార్లు మాత్రమే ఉండేవి. అలా చంద్రబాబు కాన్వాయిలో 393 నెంబరు మీదున్న అంబాసిడర్ల కాన్వాయ్ ఉండేది. వాటిల్లోనే ఉమ్మడి రాష్ట్రమంతా పర్యటించే వారు.
..... with my old friend! pic.twitter.com/VJbB9keeE3
— N Chandrababu Naidu (@ncbn) October 31, 2025
ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేనాటికే కొత్త కార్లు రావడం మొదలైంది. దీంతో అంబాసిడర్ కార్లను పక్కనపెట్టి కొత్తవాటిని కాన్వాయ్ లో చేర్చారు. ఇప్పుడైతే మరింత మోడరన్ కార్లే వచ్చాయి.
అటువంటి కార్లలో ఒకటి ఇప్పటి వరకు చంద్రబాబు వద్ద ఉంది. దాని నెంబర్ 393 అంబాసిడర్. ఇటీవల వరకు హైదరాబాద్ లో ఉన్న ఆ కారును ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తరలించి మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో పెట్టారు. ఇప్పుడది పెద్ద అట్రాక్షన్ గా మారింది.
ఇటీవల పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన చంద్రబాబు ఆ కారును చూసి మురిసిపోయారు. ఈకారుకు ముప్పై ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకొచ్చారు. ఈ కారు తన ప్రాణ మిత్రుడన్నారు. గత స్మృతులు నెమరువేసుకొన్నారు. ‘నా పాత మిత్రుడు 393 అంబాసిడర్‌తో’ అంటూ ఎక్స్ వేదికగా ఆ ఫోటోలు పంచుకొన్నారు.
చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రే అయినా పాత గుర్తులు, స్మృతులు మరచిపోవడం సాధ్యమా..