గంగమ్మకు భూమన్న 200 పొట్టేళ్లతో ‘శాంతి’

తిరుమలలో నరసింహస్వామి జయంతి, గంగమ్మ జాతర కార్యక్రమాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిర్వహించారు. అమ్మవారికి శాంతి పూజలు కూడా సంప్రదాయ బద్ధంగా జరిపించారు.

Update: 2024-05-24 02:46 GMT

గ్రామ దేవతలకు జాతర నిర్వహించడం సర్వసాధారణం. జాతర ముగింపు సందర్భంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ సమీప ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి భారీగా జంతువులను సమర్పించి, శాంతిపూజలు నిర్వహించారు. భారీగా విందు ఇచ్చిన ఆయన అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. అంతకుముందు, తిరుమల శ్రీవారి ఉపాలయంలోని నృసింహస్వామి జయంతికి హాజరైన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి విశాఖ శారదామఠం పీఠాధిపతి సేవలో తరించారు.

 

ప్రత్యేక ప్రాధాన్యత

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లెకు సమీపంలోని సీటీఎం (చిన్న తిప్ప సముద్రం) లో మొదటి జాతర జరుగుతుంది. ఆ తర్వాత చిత్తూరు, పుంగనూరు, పలమనేరు జాతర్లు, చివరగా... తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈనెల 14వ తేదీ ప్రారంభమైన గంగ జాతర 22వ తేదీ అమ్మవారి విశ్వరూప దర్శనంతో ముగిసింది. ఈ జాతరను తిరుపతి వాసులే కాకుండా సమీప ప్రాంతాల వారు కూడా పెద్ద పండుగగా భావిస్తారు. జిల్లా వాసులే కాకుండా, అనేక ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

 

భారీగా శాంతి పూజలు

జాతర ముగింపు సందర్భంగా అమ్మవారికి శాంతి పూజల్లో భాగంగా జంతు బలులు కూడా ఇస్తుంటారు. ఇది బహిరంగ సత్యం. కొన్ని ఆచారాలు, వ్యవహారాలను అధికార యంత్రాంగం కూడా చూసీచూడనట్లు వెళుతుంటుంది. అందుకు ప్రధాన కారణం.. స్థానిక ప్రజల సెంటిమెంటుకు గౌరవం, ప్రాధాన్యత ఇవ్వడమే.

రాష్ట్ర పండుగ

తాతయ్యగుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. టీటీడీ చైర్మన్‌గా కూడా ఉన్న ఆయన గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయించడంలో కీలకంగా వ్యవహరించారు. జాతర కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఆయన తన కుమారుడు భూమన అభినయరెడ్డిని పోటీ చేయించారు. పోలింగ్ ముగిసింది. ఫలితాలు వెలువడాల్సి ఉంది. తన కుమారుడు అభినయరెడ్డి విజయం కోసం అహర్నిశలు శ్రమించిన కరుణాకర్ రెడ్డి, ఆధ్యాత్మిక సేవలో కూడా తరిస్తున్నారు. అందులో భాగంగా, తాతయ్య గుంట గంగమ్మ ఆలయం వద్ద జాతర ముగింపు సందర్భంగా, 200కు పైగానే జంతువులను అమ్మవారికి శాంతి పూజల్లో సమర్పించారని చెబుతున్నారు.

 

సాధారణంగా జాతర్ల సమయంలో అమ్మవారికి సమర్పించే జంతువు తలలపై నూనె దీపాలు వెలిగించడం ఆచారంగా భావిస్తారు. గ్రామ దేవతలను శాంతింప చేయడానికి ఇక్కడ కూడా అదే జరిగిందని స్థానికుల కథనం. అమ్మవారికి సమర్పించిన జంతువుల మాంసం పేదలకు పంచడంతోపాటు, ప్రత్యేకంగా అన్నప్రసాదాలుగా పంపిణీ చేశారు. అందులో భాగంగా గురువారెడ్డి సమాధుల చెంత ఉన్న మైదానంలో తిరుపతి నగర డిప్యూటీ మేయర్, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి ప్రత్యేకంగా విందు ద్వారా అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. గ్రూప్ థియేటర్స్ వద్ద ఆయన తండ్రి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జాతర సందర్భంగా, భారీగానే విందు కార్యక్రమాల ద్వారా అన్న ప్రసాదాలు పంపిణీ చేసినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News