ఏపీ బీజేపీలో గందరగోళం ఎందుకు?

ఏపీలో పొత్తుపై రాష్ట్ర బీజేపీలో గందరగోళం నెలకొంది. పొత్తు విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరీ వెల్లడించారు.;

Update: 2024-03-03 06:21 GMT
Source: Twitter

షణ్ముఖ పోచరాజు



ఆంధ్ర రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. తమ అధికారాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ వ్యూహాలు రచిస్తుంటే సీఎం జగన్‌ను ఎలాగైనా ఇంటికి పంపేయాలని ప్రతిపక్ష పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే టీడీపీ-జనసేన పొత్తు కూడా కుదుర్చుకున్నాయి. ఈ పొత్తులో తమతో పాటు బీజేపీ కూడా కలుస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇదే పొత్తు అంశంలో ప్రస్తుతం ఏపీ బీజేపీలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొందరు పొత్తుకు సుముఖత వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం పొత్తు లేదు ఏమీ లేదు.. లోక్‌సభ సహా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని పేర్కొంటున్నారు. ఇటీవల ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ‘ఎవరినో సీఎం చేయడానికి మేము ఎందుకు కష్టపడాలి. ఆంధ్రాలో బీజేపీ నేత సీఎం కావాలి’అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విధంగా విజయవాడలో ఏపీ బీజేపీ పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూడా పొత్తుపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇందులో పాల్గొన్న నేతల్లో కొందరు సమావేశంలో పొత్తుపై చర్చ జరిగిందంటే మరికొందరు మాత్రం పొత్తు ప్రస్తావనే రాలేదన్నారు. దీంతో రాష్ట్రంలో పొత్తు అంశంపై కమలం క్యాడర్‌లో కన్ఫ్యూజన్ వస్తోంది.

ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో బీజేపీ దూకుడు పెంచింది. ఎప్పటికప్పుడు నేతల అభిప్రాయాలను తెలుసుకుంటూ వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాల ముఖ్యనేతలు, ఇన్‌ఛార్జ్‌లతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో తొలిరోజు (శనివారం) జరిగిన సమావేశంలో 14 జిల్లాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కోర్ కమిటీ, త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా బీజేపీ జాతీయ నేతలు అభ్యర్థుల వడపోత చేస్తున్నారు.

అధిష్టానానిదే తుది నిర్ణయం

ఈ సమావేశంలో ఆంధ్రలో బీజేపీ పొత్తు అంశం హాట్ టాపిక్‌గా నిలిచింది. పొత్తుపై పార్టీ కీలక నేతల అభిప్రాయాలు, సలహాలు, సూచనలను సేకరిస్తున్నట్లు బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ వెల్లడించారు. దాంతో పాటుగా రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒంటరి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది? అన్న అంశాలపై కూడా చర్చిస్తున్నామని, ఏది ఏమైనా పొత్తు విషయంలో తుది నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని స్పష్టం చేశారు. హైకమాండ్ చెప్పినట్లు నడుచుకుంటూ తాము రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, ఇందులో పార్టీ కార్యకర్తలంతా ఐకమత్యంతో పాల్గొంటారని ధీమా వ్యక్తం చేశారు.

పొత్తుపైనే బీజేపీ మొగ్గు!

ఆంధ్రాలో టీడీపీ-జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ అధిష్టానం సుముఖత కనబరుస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకనే లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో బీజేపీ ఆంధ్రా నుంచి ఒక్కరి నుంచి కూడా ప్రకటించలేదని, పొత్తుపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆంధ్ర ఎంపీ అభ్యర్థులను ప్రకటించాలన్న ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉందని పలు నివేదికలు కూడా పేర్కొంటున్నాయి. కొందరు నిపుణులైతే ఆంధ్రాలో బీజేపీ పొత్తు దాదాపు ఖరారైందని, స్థానాల విషయంలో స్పష్టత లేనందుకే బీజేపీ తన తొలి జాబితాలో ఆంధ్రా నుంచి ఎవరినీ ప్రకటించలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై బీజేపీ హైకమాండ్ కమిటీతో పాటు కీలక నేతలు కూడా చర్చిస్తున్నారని, కాగా నేతల నుంచి పొత్తు విషయంలో మిశ్రమ స్పందన వస్తోంది. అయితే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్యను పెంచుకోవడానికి, ఆంధ్రాలో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Tags:    

Similar News