తిరుపతి జాతరలో బూతులే ఆశీస్సులు.. ఊరంతా మహిళలే.. ఎందుకలా?
తిరుపతిలో ఏడు రోజులు నిర్వహించే తాతయ్యగుంట గంగమ్మ జాతర 6వ తేదీ ప్రారంభం అవుతుంది. బీసీలు, దళితులు కీలకంగా వ్యవహరించే ఈ జాతరలో ఎన్నో ప్రత్యేకలు..;
Byline : The Federal
Update: 2025-05-04 05:29 GMT
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర నగరానికి పెద్దపండుగ. పురుషులు మహిళల వేషాలు. పిల్లలు, పెద్దలు బండవేషంలో బూతులు తిట్టడం అనేది ఇక్కడ సంప్రదాయం. ఇలా చేయకపోవడం పాపం అనేది విశ్వాసం. వాటిని ఆశీస్సులుగా భావిస్తారు.
తమిళ సంప్రదాయంలో ప్రతి సంవత్సరం చిత్రినెలలో (మే నెల) ఈ ఏడాది మొదటి మంగళవారం చాటింపు వేస్తారు. మరో 24 గంటల్లో (మే నెల 6 వ తేదీ ) వారం రోజులు తిరుపతిలోని ఐదు గంగమ్మ ఆలయాల్లో ప్రారంభమయ్యే జాతరలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
తిరుపతి తాతయ్యగుంట పురాతన గంగమ్మ ఆలయం (ఫైల్)
గ్రామాలు, పట్టణాల్లో గ్రామ దేవతకు ఒకరోజు మాత్రమే జాతర నిర్వహిస్తారు. తిరుపతిలో వారం పాటు నిర్వహించే తాతయ్యగుంట గంగమ్మ జాతర ఆలయం వద్ద విశ్వరూప స్థూపానికి వడిబాలు కట్టడంతో ప్రారంభం అవుతుంది. అవిలాల గ్రామపెద్ద ముళ్లపూడి సుబ్బరామిరెడ్డి ఇంటి నుంచి పుట్టింటి సారె తీసుకుని రావడం, చాటింపుతో ప్రారంభం అవుతుంది. 13వ తేదీ విశ్వరూప దర్శనం తరువాత చెంప నరకడంతో ముగుస్తుంది. అన్ని రోజులు ఒకో రోజు ఒకో వేషంలో భక్తులు వీధుల్లో తిరగడం, మోకాళ్లపై నడిచి వెళుతూ అమ్మవారికి ముక్కులు చెల్లిస్తారు.
"అమ్మవారి విశ్వరూప దర్శనానికి మట్టి విగ్రహాన్ని తయారు చేయడం. మా ఇంటి నుంచి ఆభరణాలు తీసుకుని వచ్చి అలంకరించే భాగ్యం దక్కడం మా అదృష్టం" అని తిరుపతి నగరం యాదవవీధిలోని విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన అన్నదమ్ములు ఈపూరి రమేష్ బాబు, దేవరాజాచారి చెప్పారు.
"అమ్మవారికి కుడి కన్ను. నేను అమరుస్తా. ఎడమ పక్క మా దాయాది అతికించే సందర్భంలో మైమరిపిస్తుంది" అని దేవరాజాచారి వ్యాఖ్యానించారు.
ఐదు సామాజికవర్గాలే కీలకం
సాధారణంగా పల్లెల్లో గ్రామ దేవతలకు శాంతి పూజలు చేయడానికి జాత నిర్వహించడం ఆనవాయితీ. వందల ఏళ్లుగా ఈ సంప్రదాయం తిరుపతిలో కూడా కొనసాగుతోంది.
తెలంగాణలో సమ్మక్క. సారక్క జాతరకు విశేష ప్రాధాన్యత ఉంది. ఏపీలో రాష్ట్ర పండుగగా నిర్వహించే తిరుపతి జాతరలో కైకాల వంశం, కమ్మరి, కుమ్మరి, తోటివాళ్లు, చాకలి, మంగలి కులస్తులదే ప్రధాన పాత్ర.
రాష్ట్ర పండుగగా..
తిరుపతి గంగమ్మ జాతరను 2013 నుంచి రాష్ట్ర పండుగగా గుర్తించింది. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి గ్రామదేవత జాతరలో ఈ ప్రాంత వ్యవహారాలు, జీవనవిధానం, అనాదిగా వస్తున్న సంప్రదాయాలు ప్రతిబింబించే పండుగకు పొరుగు రాస్ట్రాల నుంచి కూడా భారీగా యాత్రికులు వస్తుంటారు.
తిరుమల శ్రీవారి చెల్లెలుగా భావించే తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని అనంతాళ్వార్ నిర్మించారనేది చరిత్ర. రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీఓలో ఈ విషయం ప్రస్తావించింది.
ఈ జాతర చరిత్ర ఏమిటంటే..
తిరుపతి ప్రాంతాన్ని పాలెగాళ్లు పాలించే రోజులు. ఓ పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులపై అత్యాచారాలు చేయడం. నవవధువులు మొదట తనతో గడపాలనే నిబంధన విధించాడంట. అతనిని అంతం చేసి, మహిళలను కాపాడేందుకు గంగమ్మ తిరుపతికి సమీపంలోని అవిలాలా గ్రామంలో కైకాల కుటుంబంలో జన్మించింది. యుక్తవయసులోని గంగమ్మపై కన్నేసిన పాలెగాడు, అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో విశ్వరూపం ప్రదర్శించిందనేది చరిత్ర.
తనను అంతం చేయడానికి గంగమ్మ రూపంలో అవతరించిందని గ్రహించిన పాలెగాడు పారిపోయాడట. అతనిని వెదుకుతూ, మారువేషంలో గాలించడానికి మూడు రోజుల పాటు బైరాగిగా, రెండో రోజు బండ వేషం, మూడో రోజు తోటి వేషంలో గాలించినా పాలెగాడి ఆచూకీ దొరకలేదు. నాలుగోరోజు గంగమ్మ దొర వేషంలో వెళ్లగానే, తన రాజు వచ్చాడని భావించిన పాలెగాడు బయటకు రాగానే, అంతమొందించిందనేది కథనం. దుష్ట శిక్షణ చేసిన రోజును తిరుపతి పరిసర గ్రామాల్లో ఈ జాతర నిర్వహించారనేది ప్రతీతి. అప్పటి నుంచి తిరుపతి గంగజాతరలో విభిన్న వేషాల్లో పట్టణంలో తిరుగుతూ వెళ్లి, అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా ముక్కులు చెల్లిస్తున్నారు.
జాతర ఇలా...
మరో 24 గంటల్లో అంటే మే నెల ఆరో తేదీ సాయంత్రం గంగమ్మ పుట్టుక ప్రదేశంగా భావించే అవిలాల గ్రామం నుంచి కైకాల పెద్దలు పసుపు, కుంకుమ, చీరతో కూడిన సారె తీసుకుని వస్తారు. ఈ కుంకుమను పాత తిరుపతి పొలిమేరల్లోని కూడళ్లలో చల్లడం ద్వారా జాతరను ప్రకటిస్తారు. దీని అర్థం..
"జాతర పూర్తయ్యే వారకు స్థానికులు పొలిమేరలు దాటకూడదు" అనేది ఆచారం. ఇప్పటికీ స్థానికులే కాదు. ఈ ప్రాంతంలో స్థిరపడిన వారు కూడా ఆ పద్ధతిని అనుసరించడానికి ప్రాధాన్యం ఇస్తారు. అక్కడి నుంచి కైకాల కులస్తులు విశ్వబ్రాహ్మణ (ఆచారి) ఇంటి గుమ్మానికి బొట్టు పెట్టి వెళతారు.
"అమ్మవారి జాతరకు సిద్ధం కండి అని సంకేతం ఇస్తారు" అని ఈపూరి దేవరాజాచారి చెప్పారు.
200 ఏళ్ల కిందటే..
ఈ జాతరపై శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ప్రొఫెసర్ పేటశ్రీ (పేట శ్రీనివాసులురెడ్డి) రాసిన ఓ పుస్తకంలో ఏమంటారంటే..
"తిరుపతి గంగమ్మ జాతరలో జంతుబలులు ఇచ్చిన విషయాన్ని బ్రిటీష్ పాలకులు 200 సంవత్సరాల కిందటే అనుమతించారు" అని పేటశ్రీ ప్రస్తావించారు.
ఈ ప్రాంతం నార్త్ ఆర్కాట్ జిల్లాగా ఉన్న రోజుల్లోనే జిల్లా మాన్యువల్ లో బ్రిటీషర్లు ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ ఆలయం ఆధునికరణ పనుల్లో పల్లవుల కాలం నాటి స్తంభాలు బయటపడిన విషయాన్ని కూడా పేటశ్రీ ప్రస్తావించారు. ఈ ఆలయం క్రీస్తు శకం 500 ఏళ్ల నాటిది అని చెప్పడానికి ఆనవాళ్లు ఉన్నట్లు ఆయన విశ్లేషించారు.
బూతులే దీవెనలు
జాతర ప్రారంభమైన రెండో రోజు నుంచి మొక్కులు ఉన్నవారు వేషాలు వేయడం ద్వారా జాతర ప్రత్యేకత. పురుషులు చీరలు, నగలు అలంకరించుకుని, ముస్తాబు అవుతారు. ఎటు చూసిన మహిళల వేషంలోనే పురుషులు కనిపిస్తారు. ఇందులో పిల్లలు, పెద్దలు అనేది తారతమ్యాలు ఉండవు. తల్లిదండ్రులే తమ కొడుకులను అందంగా మహిళగా ముస్తాబు చేసి, గంగమ్మ ఆలయానికి చేరుకుని, అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించడం కనిపిస్తుంది.
బండ వేషంలో ఒళ్లంతా రంగులు పులుముకుని, మొల, మెడకు వేపమండలతో అలంకరించుకుని వెళ్లే పిల్లలు, పెద్దలు బండ బూతులు తిట్టడం కనిపిస్తుంది.
"మహిళలకు కంటగింపుగా మారిన పాలెగాడిని అంతం చేయడానికి గంగమ్మ బూతులు తిడుతుంది. కాబట్టే అమ్మవారి ప్రతిరూపంగా భావించే వేషధారులు అలా వ్యవహరిస్తారు" అనేది గురవయ్య యాదవ్ చెప్పే మాట. "ఈ బూతులు తిట్టినా, నవ్వుతూ వెళతాం. అలా తిట్టకుంటే పాపంగా భావిస్తాం. ఇది ఆచారంగానే భావిస్తాం" అనేది గురవయ్య అభిప్రాయం.
విశ్వరూప దర్శనంతో..
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో చివరి అంకం విశ్వరూప దర్శనంతో ముగుస్తుంది. జాతర ప్రారంభం నుంచి స్థానికులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, తమిళనాడు, కర్ణాటకతో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్న వారందరితో తిరుపతి కిటకిటలాడుతుంది. ఈ ఆచార వ్యవహారాలన్నీ తిరుపతి గాంధీరోడ్డు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
15 కిలోల నగలతో అమ్మవారి అలంకరణ
ఇందులో యాదవవీధికి చెందిన విశ్వబ్రాహ్మణ కుటుంబం కీలకంగా వ్యవహరిస్తుంది. విశ్వరూప దర్శనానికి అమ్మవారి ప్రతిమను మట్టితో తయారు చేయడంలో వ్యవహరించే పద్ధతులపై ఈపూరి రమేష్ బాబు 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి వివరించారు.
"మా నాయన ఈపూరి వెంకటేశాచారి 1960 నుంచి ఈ క్రతువులో భాగస్యామ్యం అయ్యారు. మిరాశీ పద్ధతిలో మాకు ఈ అవకాశం దక్కింది. జాతరలో చివరి రోజు ఈ నెల 14వ తేదీ మా ఇళ్లలో ఎవరికీ కాళ్లు నేలపై నిలవవు. అమ్మవారి సేవలో ఉంటాం. తాతయ్యగుంట గంగమ్మ విశ్వరూప దర్శనానికి విగ్రహాన్ని మట్టితో తయారు చేస్తారు. ఆ పనులన్నీ మా విశ్వబ్రాహ్మణులే చేస్తారు. నేను స్వయంగా అమ్మవారి ప్రతిరూపాన్నిఆలయం ఎదురుగా ఉన్న స్థూపం వద్ద తయారు చేస్తా" అని రమేష్ బాబు చెప్పారు.
"అమ్మవారికి అలంకరించే నగలు మా ఇంట్లోనే ఉంటాయి. నా మా నాయన ఈపూరి సుబ్బయ్యాచారి హయంలోనే తయారు చేశారు. అమ్మవారికి అలంకరించే కిరీటం, నాగపడిగ, కళ్లు, దిష్టిచుక్క, విభూదిపట్టీ, ముక్కెర, చెవులకు జుముకీలకు ఇంట్లో పూజ చేస్తాం. 14వ తేదీ రాత్రి యాదవవీధి నుంచి మా కొడుకులే ప్రత్యేకంగా ఉన్న పెట్టలో ఊరేగింపుగా తీసుకుని ఆలయానికి చేరుకుంటాం" అని రమేష్ బాబు చెప్పారు.
రోమాలు నిక్కబొడుచుకుంటాయి..
13వతేదీ బుధవారం రాత్రి అమ్మవారి ప్రతిరూపం మట్టితో తయారు చేయడంలో దళిత, బీసీలే కీలకంగా వ్యవహరిస్తారు. తోటివారు (దళితులు) గడ్డిని అప్పటికప్పుడు తాడుకు పెనవేసే మోపును విశ్వరూప స్థూపానికి చుట్టడం, ఆలయం వద్దకు చేర్చిన మట్టిని దళితులు ఉండలుగా చేసి, అందిస్తుంటే.. అమ్మవారి ప్రతిమ తయారు అవుతుంది. విగ్రహానికి కుడి కన్ను రమేష్ బాబు అమరుస్తారు. ఎడమ పక్క విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన మరో ప్రతినిధి ఏర్పాటు చేస్తారు.
"ఆ సమయంలో ఒళ్లు స్వాధీనం తప్పుతుంది. రోమాలు నిక్కబెడుచుకుంటాయి. ఇంతకంతే ఎక్కువ చెప్పలేను. అని రమేష్ బాబు వ్యాఖ్యానించారు.
మహిళ అలంకరణలో పేరంటాళ్లుగా వచ్చిన కైకాల వంశస్తుడు సాంబయ్య
14 వ తేదీ వేకువజామున మహిళ వేషంలో కైకాల వంశానికి చెందిన సాంబడు పేరంటాళ్లుగా అలంకరించుకుని గంగమ్మ ఆలయం వద్దకు చేరుకునే సరికి పూనకంతో ఊగిపోతుంటాడు. ఆయనను సాదరంగా అనడంతో కంటే విశ్వరూప స్థూపం పైకి తీసుకుని వెళ్లి, గంగమ్మ చేతిని లాగిస్తారు. అదే సమయంలో అమ్మవారి విగ్రహానికి చెంప నరికే క్రతువు పూర్తికాగానే ఆ మట్టి కోసం వేలాది మంది భక్తులు ఎగబడతారు. దీనిని ప్రసాదంగా భావిస్తారు. దీంతో జాతర ముగుస్తుంది.
ఐదు కులాలదే కీలక పాత్ర
తిరుపతి తాతయ్యగుంట గంగజాతర, అమ్మవారి విగ్రహం తయారీలో ఐదు సామాజిక వర్గాలదే ప్రధాన పాత్ర ఉంటుంది. అమ్మవారి జాతర నిర్వహణలో కీలకంగా వ్యవహరించే ఈపూరి దేవరాజాచారి ఏమంటారంటే..
తిరుపతిలో ఐదుగురు గంగమ్మలు అక్కాచెల్లెళ్లు. వారిలో ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోని గాంధీవిగ్రహం వద్ద ఉన్న తాళ్లపాక గంగమ్మ పెద్ది. ఆమె చెల్లెలే తాతయ్యగుంట గంగమ్మ. ఈమెతో పాటు వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని అంకాళమ్మ, కోర్టు సమీపంలో వేశాలమ్మ, ఆర్టీసీ ఆర్ఓబీ సమీపంలో ముత్యాలమ్మ ఆలయాలు ప్రధానమైనవి.
"ఈ జాతరలో కైకాల కులస్తులు వేషాలతో అమ్మవారికి పేరంటాళ్లుగా వ్యవహరిస్తే, తొటివాళ్లు (దళితులు) గడ్డి కసువుతో తాడు తాయరు చేస్తారు. అమ్మవారి ప్రతిమ తయారీకి కుమ్మరులు మట్టి తీసుకుని వస్తారు. ఆలయం వద్ద రజకులు ( చాకలి) అన్నం, ఇతర ఆహారపదార్థాలతో కుంభం పోస్తారు. అమ్మవారి విగ్రహానికి జడ అల్లడం, తలకు వెంట్రకలను నాయీ బ్రాహ్మణులు (మంగలి) అలంకరణ చేస్తారు" అని దేవరాజాచారి వివరించారు.
పాలక మండలి లేకుండానే ఈ ఏడాది జాతరకు ఏర్పాట్లు చేశారు. దీనికోసం కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ 15 మందితో జాతర కమిటీ నియమించారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థనరాజు, మున్సిపల్ కమిషనర్ మౌర్య యాత్రికులకు భద్రత, సదుపాయాలు కల్పించడానికి యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. ఈ జాతర విశిష్టతలపై వేషాలు, ఆసక్తికర విషయాలు రోజూ తెలుసుకుందాం...