మొన్న అన్నమయ్య..నేడు తుంగభద్ర..

తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకు పోవడం వెనుకబడిన ప్రాంతాల సాగునీటి రంగం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య పరంపరలో భాగమేనని రాయలసీమ‌ సాగునీటి సాధన సమితి అధ్యక్ష్యలు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు.

Update: 2024-08-12 08:38 GMT

తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకు పోవడం వెనుకబడిన ప్రాంతాల సాగునీటి రంగం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య పరంపరలో భాగమేనని రాయలసీమ‌ సాగునీటి సాధన సమితి అధ్యక్ష్యలు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. సోమవారం నంద్యాల సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ, నిర్వహణలతో పాటు పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్ల రాయలసీమలో అభివృద్ధి చేసిన 20 లక్షల ఎకరాల ఆయకట్టులో కేవలం 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు కూడా నీరు లభించని దుస్థితిలో రాయలసీమ ప్రాంతం ఉంది. తుంగభద్ర, కృష్ణా నదులలో నీరు పుష్కలంగా ప్రవహిస్తున్నా రాయలసీమ ఆ నీటిని వినియోగించుకొనలేని పరిస్థితి ఉంది‌‌.

రాయలసీమలోని ప్రాజెక్టులు ప్రమాద ఘంటికలు ఒక్కొక్కటి స్పష్టంగా మోగిస్తున్నా వాటిని సరిదిద్దడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.‌ అలగనూరు రిజర్వాయర్ కట్టలకు కోతలు, గోరుకల్లు రిజర్వాయర్ రివిట్ మెంట్ జారి పోవడం, వెలుగోడు రిజర్వాయర్ రివిట్ మెంట్ ఇబ్బందులు, వెలుగోడు రిజర్వాయర్ నుండి బ్రహ్మసాగర్‌కీ నీరు చేర్చే ప్రధానమైన మద్రాసు కాలువ నిర్వహణ లోపాలు, 2009 వరదలతో సుంకేశుల నుండి కె సి ప్రధాన కాలువ బలహీన పడటం, సుంకేసుల బ్యారేజి గేట్లు, పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ గేట్లు, అన్నమయ్య ప్రాజెక్టు, శ్రీశైలం రిజర్వాయర్ ప్లంజ్ పూల్, హంద్రీనీవా ప్రధాన కాలువలు, గాలేరు నగరి ప్రాజెక్టు తో సహా రాయలసీమ వ్యాప్తంగా వివిధ రిజర్వాయర్లు, బ్రాంచ్, పంట కాలువల రూపురేఖలు కూడా లేకుండాపోవడం, పి ఏ బి ఆర్ నిర్వహణ, అనేక చెరువుల గట్లు బలహీన పడటం, కృంగిపోవడం, గురురాఘవేంద్ర ప్రాజెక్టులోని ఎత్తిపోతల పథకాలు, చెరువులకు నీరు అందించే వాగులు, వంకల, కాలువల వ్యవస్థ క్షీణించడం తదితర అనేక సాగునీటి ప్రాజెక్టుల ప్రమాద ఘంటికలకు స్పందించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. ఈ నిర్లక్ష్యానికి కారణం పాలకులలో, అధికారులలో చిత్తశుద్ధి లేకపోవడం, మనసు పెట్టి పనిచేయకపోవడమే. దాని పర్యవసానమే ఏడు సంవత్సరాలుగా నిర్జీవంగా ఉన్న అలగనూరు రిజర్వాయర్, యాబై మందికి పైగా ప్రాణాలను బలిగొన్న అన్నమయ్య ప్రాజెక్టు, వేలాది మంది రైతుల భవిష్యత్తును తలక్రిందులు చేస్తున్న తుంగభద్ర డ్యాం గేట్ తెగిపోవడం అని బొజ్జా ఆవేదన వ్యక్తపరిచారు.

ప్రభుత్వం ప్రకటించినట్లుగా నదుల అనుసంధానం తో రాయలసీమను సస్యశ్యామలం చేసే అవకాశం నిర్వివాదాంశం అని బొజ్జా పేర్కొన్నారు‌‌ అయితే రాయలసీమ ప్రాజెక్టుల నిర్వహణను విస్మరించి, కేవలం నదుల అనుసందానం జపం చేస్తూ ఉంటే పైన వివరించిన ఉపద్రవాలను మరెన్నో రాయలసీమ సమాజం ఎదుర్కొనాల్సి వస్తుందన్న విషయం ప్రభుత్వం గుర్తించాలని బొజ్జా హితవు పలికారు.‌

రాయలసీమ అభివృద్దితో సంపద సృష్టించాలని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్ డి ఏ ప్రభుత్వం ఆశించడాన్ని స్వాగతిస్తున్నాము అని బొజ్జా ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వ ఆశయ సాధనకు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో దినదిన గండంగా ఉన్న రాయలసీమ ప్రాజెక్టుల నిర్వహణకు యుద్ద ప్రాతిపదికన నిధులు కేటాయించి, నిర్మాణాలను సరిదిద్దకపోతే మరో అన్నమయ్య ప్రాజెక్టుగా మిగిలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి సృష్టించే నష్టాలకు తోడు మానవ తప్పిదాల వల్ల జరిగే నష్టం రైతాంగ భవిష్యత్తును మరింత ప్రమాదంలో‌ పడేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

"క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులను తెలుసుకోవడానికి సాంకేతిక నిపుణులతో ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రాజెక్టుల క్షేత్రస్థాయి నివేదికను రూపొందించి తదనుగుణంగా చర్యలు చేపట్టాల’’ని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో 42 శాతం వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగి ఉన్న రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధికి రాష్ట్ర సాగునీటి బడ్జెట్ లో 42 శాతం నిధులు కేటాయించి రాయలసీమకు న్యాయం చేయాలని బొజ్జా విజ్ఞప్తి చేశారు.‌

Tags:    

Similar News