ఝాన్సీ ఫైటింగ్... బొత్స ఫీల్డింగ్...
సార్వత్రిక ఎన్నికల రణరంగంలో యుద్ధం చేసేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ సిద్ధమయ్యారు. వైసీపీ కూడా ఆమెకు టికెట్ ఇచ్చింది.
By : The Federal
Update: 2024-03-02 14:46 GMT
తంగేటి నానాజీ
సార్వత్రిక ఎన్నికల రణరంగంలో యుద్ధం చేసేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ సిద్ధమయ్యారు. అధికార వైసీపీ బొత్స ఝాన్సీని ప్రతిష్టాత్మక విశాఖ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
అందరూ నాన్ లోకలే...
విశాఖ పార్లమెంటు స్థానానికి ఇప్పటివరకు పోటీ చేసి గెలుపొందిన వారిలో అందరూ నాన్ లోకల్ కావడమే విశేషం. ఇక్కడ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన వారిలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, సుబ్బురామిరెడ్డిలు నెల్లూరు జిల్లా వాసులు కాగా... ముంబాయికి చెందిన ఉమా గజపతిరాజు ఓసారి ఇక్కడి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఎం వివిఎస్ మూర్తి వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కాగా.... హరిబాబు పురందేశ్వరి లు ప్రకాశం జిల్లాకు చెందినవారు. ఇక సిట్టింగ్ ఎంపి ఎం వి వి సత్యనారాయణది పశ్చిమగోదావరి జిల్లా. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మ ఇక్కడ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ కూడా ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు.
పోటా పోటీ ప్రచారం...
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి గాను అధికార వైసిపి అభ్యర్థిగా బొత్స ఝాన్సీ ని ఖరారు చేసింది అధిష్టానం. దీంతో ఆమె ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతిపక్ష టిడిపి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన భరత్ ను ఆ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ తానే అభ్యర్థిగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారులతోపాటు బోటి పై సముద్రంలోకి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక బిజెపి నుంచి ఎంపీ జీవీఎల్ నరసింహం....రాష్ట్ర అధ్యక్షురాలు, పురందరేశ్వరి లు ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఒకవేళ టిడిపి బిజెపి జనసేన పొత్తు ఖరారు అయితే ఈ ముగ్గురిలో ఒకరు మాత్రమే అభ్యర్థిగా ఖరారు కానున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ తన సొంత పార్టీతో ఎన్నికల బరిలోకి దిగనున్నారు. పూర్తిస్థాయిలో అభ్యర్థులు ఖరారు కాకపోయినప్పటికీ ఎవరికి వారు తమను గెలిపించాలని ప్రచారం సాగిస్తున్నారు.
ఏడుకు 7 కీలకమే...
విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గ ఒక్కో స్వభావం... ఒక్కో సామాజిక వర్గ ఆధిపత్యం కలిగి ఉంటాయి... విశాఖ నగర పరిధిలో ఉండే విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నియోజకవర్గాలతో పాటు గాజువాక, భీమిలి, ఎస్ కోట నియోజకవర్గాలు విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. విశాఖ దక్షిణంలో మత్స్యకారులు... పశ్చిమ లో గవర, కాపు సామాజిక వర్గాలు... ఉత్తరంలో రాజులు, తూర్పులో యాదవులు ఈ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను నిర్ణయించే స్థాయిలో ఉంటారు. ఇక భీమిలిలో క్షత్రియ,కాపు సామాజిక వర్గాలు, గాజువాక లో కాపు,యాదవ, రెడ్డిక సామాజిక వర్గాలు, ఎస్ కోటలో కాపు క్షత్రియ సామాజిక వర్గాలు డిసైడ్ ఫ్యాక్టర్ గా ఉంటాయి.
ఝాన్సీ కోసం బొత్స ఫీల్డింగ్...
అధికార వైసిపి నుంచి విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి సీటు ఖరారు అయిన బొత్స ఝాన్సీ గెలుపు కోసం మంత్రి బొత్స సత్యనారాయణ ఫీల్డింగ్ సెట్ చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటు పరిధిలోగల అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలతో భేటీ అయ్యారు. విశాఖ నగరం నడిబొడ్డున సిరిపురం సెంటర్లో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మంతనాలు కానిస్తున్నారు. ఓవైపు ఝాన్సీ ప్రచారంలో ఉండగా... మరోవైపు తెరవ వెనక రాజకీయాలు మొత్తం సత్యనారాయణ నడిపిస్తున్నారు. ఉత్తరాంధ్ర పై మంచి పట్టున్న బొత్స సత్యనారాయణ ప్రతి నియోజకవర్గం నుంచి తన సతీమణికి మెజారిటీ ఓటింగ్ పడే విధంగా స్కెచ్ వేస్తున్నారు.