శ్రీవారి హుండీ నింపుతున్నది సామాన్యులే..

విఐపి లెటర్స్ రద్దయ్యాక రుజువయిన తిరుమల రాబడి రహస్యం;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-14 12:03 GMT

వేసవి ఆటవిడుపులో టీటీడీ ప్రయోగం ఫలించింది. సామాన్య యాత్రికులకు కష్టాలు తప్పాయి. వారి వల్ల నికర ఆదాయం కూడా వెల్లడైంది. మళ్లీ వీఐపీ సిఫారసు లేఖల వల్ల కష్టాలు తప్పేలే లేవు.

ఈ ఏడాది వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనంలో సామాన్య యాత్రికులకు ప్రాధాన్యత దక్కింది. కానుకల రూపంలో హుండీ ద్వారా సగటును రోజుకు 3.5 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది. అంటే, సామాన్య యాత్రికుల వల్లే నికర ఆదాయం వస్తుందనే విషయం కూడా స్పష్టమైంది. శ్రీవారి దర్శనానికి గతానికి భిన్నంగా రోజుల తరబడి కంపార్టుమెంట్లలో నిరీక్షించే కష్టాలు తప్పడం వెనుక రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి.
1. వీఐపీ, ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు రద్దు చేయడం.
2. వేసవి రద్దీకి ముందే టీటీడీ అధికారుల ముందస్తు ఏర్పాట్లు.
3. సర్వదర్శనం టోకెన్లు ముందురోజే రాత్రి 9 గంటల నుంచే జారీ చేయడం
వీఐపీ దర్శన కోటా లేకపోవడం వల్ల సామాన్య యాత్రికులకు వెసులుబాటు కలిగింది. అనే విషయాన్నిటీటీడీకి కూడా నిర్ధారించింది.

Full View

సామాన్యులతో ఆదాయం ఎంత?
తిరుమలలో సామాన్య యాత్రికుల వల్లే హుండీ కానుకల ద్వారా సింహభాగం ఆదాయం లభిస్తున్నదనే విషయం స్పష్టమైంది.
తిరుమల శ్రీవారిని ఈ నెల 13వ తేదీ 74,477 మంది యాత్రికులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా 2.84 కోట్ల రూపాయలు, 12వ తేదీ 68,760 మంది యాత్రికులు వచ్చినా ఆదాయం మాత్రం 3.90 కోట్ల రూపాయలు లభించింది. 11వ తేదీ రికార్డు స్థాయిలో 80,423 మంది యాత్రికుల వల్ల 3.40 కోట్ల ఆదాయం దక్కింది.
10వ తేదీ రికార్డు స్థాయిలో 85,078 మంది దర్శించుకున్నా, 2.67 కోట్లు ఆదాయం రావడం గమనించతగిన విషయం. 8వ తేదీ 64,850 మంది దర్శించుకుంటే, 2.78 కోట్లు, రెండో తేదీ 74 వేల మంది యాత్రికులతో 2.50 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది.
ఈ వివరాలు పరిశీలిస్తే ఓ స్పష్టమైన సమాధానం లభించింది.
తిరుమల శ్రీవారికి సామాన్య యాత్రికుల వల్లే నికరంగా లభిస్తున్న ఆదాయ వివరాలు కూడా వెల్లడయ్యాయి.
ఆ అపవాదు పోతుందా?
"తిరుమలలో సామాన్య యాత్రికులకు పెద్దపీట వేస్తాం" అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే, వీఐపీలు, వీవీఐపీలు, ప్రొటోకాల్ దర్శనాలకు మాత్రమే టీటీడీ పెద్దపీట వేస్తుందనేది అధికారులు, పాలక మండలిపై ఉన్న అభియోగం. అది వాస్తవం కూడా.
తిరుమలకు రోజూ లక్ష మంది యాత్రికులు, ప్రజలు రాకపోకలు సాగించినా, సాధారణంగా సగటున శ్రీవారిని రోజూ 65 వేల నుంచి 70 వేల మంది యాత్రికులు దర్శించుకుంటారు. వారాంతపు సెలవులు, ప్రత్యేక సందర్భాల్లో ఆ సంఖ్య 80 వేల నుంచి 85 వేల వరకు ఉంటుంది. దీని వల్ల 10 నుంచి 24 గంటల వరకు యాత్రికులు క్యూలు, షెడ్లలో నిరీక్షించడం పరిపాటి.
దీనికి కారణం ఉదయం నుంచి వీవీఐపీలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల వారి సిఫారసు లేఖలకు తోడు టీటీడీ పాలక మండలి సభ్యుల విచక్షణ కోటాలో ఏడు వేల నుంచి 8,000 వేల వరకు టికెట్ల జారీ వల్ల సాధారణ యాత్రికులకు సర్వదర్శనం కష్టమయ్యేది. మళ్లీ ఈ నెల 16 వ తేదీ నుంచి కష్టాలు మొదలయ్యే పరిస్థితి ఉంది.
గత ఏడాది
శ్రీవారిని వేసవి సెలవుల్లో దర్శించుకోవడానికి వచ్చే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. గత ఏడాది కూడా 48 గంటలకు పైగానే పట్టింది. యాత్రికుల తాకిడి వల్ల శిలాతోరణం నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు ఉన్న ఆరు కిలోమీటర్ల దూరం వరకు యాత్రికులు నిరీక్షించిన సందర్భాలు ఉన్నాయి. తరువాత క్యూ కాంప్లెక్స్ లోని షెడ్లలో ఇంకొన్ని గంటల పాటు నిరీక్షించక తప్పని అనివార్యమైన పరిస్థితి.
లేఖల రద్దుతో ఏం జరిగింది?

Full View

ఈ ఏడాది వేసవి సెలవులకు ముందే టీటీడీ యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసింది. దీనికి గతంలో ఎన్నడూ లేని రీతిలో వీవీఐపీ, వీఐపీ, ప్రొటోకాల్ లో ఉన్న వారికి మాత్రమే దర్శనం కల్పించారు. మే నెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు ప్రజాప్రతినిధుల కోటాలో టికెట్లు జారీని నిలిపి వేయడం వల్ల సామాన్య యాత్రికులకు కలిసొచ్చింది. వేసవి రద్దీలోనూ ఆరు గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్నారు. శ్రీవారి దర్శనానికి 15 రోజుల పాటు నిరీక్షణకు ఆస్కారం లేకుండా నేరుగా క్యూలో వెళ్లేందుకు ఆస్కారం ఏర్పడింది. ఈ నెల 16వ తేదీ నుంచి సీఫారసు లేఖలు అనుమతించాలనే నిర్ణయం వల్ల మళ్లీ సామాన్య యాత్రికులకు తిప్పలు అనివార్యం కానున్నాయి.
మిగిలింది స్వల్పమే..
"తిరుపతిలోని అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ తో పాటు ఆర్టీసీ బస్టాండు సమీపంలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్స్ లలో 15 వేల ఎస్ఎస్డీ (సర్వదర్శనం టైం స్లాట్ ) టోకెన్లలో వందల సంఖ్యలో మాత్రమే మిగిలాయి. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆన్ లైన్ టికెట్లు ముందుగానే బుక్ చేసుకున్న వారు దర్శనానికి వచ్చారు. ఆఫ్ లైన్ లో కూడా పదుల సంఖ్యలోనే టికెట్లు మిగిలాయి" టీటీడీ చీఫ్ పీఆర్ఓ తలారి రవి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. వందల టికెట్లు మిగిలాయనేది వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు.
తిరుమలలో వీఐపీ సిఫారసు లేఖలు లేకపోవడం సామాన్య యాత్రికులకు అవకాశం కలిసి వచ్చింది. క్యూలో నేరుగా వెళ్లే అవకాశం లభించడం వల్ల టోకెన్లకు ప్రాధాన్యత ఇవ్వలేదనే విషయం మరోసారి రుజువైంది.
మళ్లీ కష్టాలే...
తిరుమలలో వీఐపీ లేఖలను తాత్కాలికంగా రద్దు చేసిన టీటీడీ చేసిన ప్రయోగం ఫలించింది. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధికారులు, పాలక మండలిపై ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. దీంతో 16వ తేదీ నుంచి వీఐపీ సిఫారసు లేఖలు అనుమతించాలని టీటీడీ నిర్ణయించడం వల్ల సామాన్య యాత్రికులకు మళ్లీ పాతకష్టాలు వెంటాడనున్నాయి. ఎందుకంటే...
టీటీడీ పాలక మండలిలో 24 మంది ఉన్నారు. వారిలో ఏపీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారికి డబుల్ ధమాకా కోటా ఉంది. బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే కోటా ఉంటుంది. తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడులో ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కో సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
శ్రీవారి దర్శనం వీఐపీ కోటాలో ఛైర్మన్ కు సుమారు 150 టికెట్లు, సభ్యులకు 25, రూ. 300 దర్శనం కోటా ఉంది. ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, ఎంపీల సిఫారసు లేఖల ద్వారా వీవీఐపీ, జనరల్ వీఐపీ టికెట్లు రోజుకు సుమారు 7,500 నుంచి ఎనిమిది వేల వరకు ఉండడం, ఆర్జీతసేవ టికెట్ల కోటా వల్ల సామాన్యలకు మళ్లీ సమయం కుదించే అవకాశం కలుగుతోంది. ఇదిలాఉంటే
సిఫారసు లేఖల భారం
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధుల లేఖల ద్వారా వీఐపీ, రూ.300 టికెట్ల కోటా వల్ల సామాన్య యాత్రికులకు కష్టాలు తప్పడం లేదు.
రాష్ట్రం నుంచి 175 మంది ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు 58 మంది, ఎంపీలు 25 మంది, రాజ్యసభ 11 మంది ఉన్నారు. తెలంగాణ నుంచి ఎంఎల్ఏలు 119 మంది, ఎంఎల్సీలు 40, ఎంపీలు 17, రాజ్యసభకు ఏడుగురు.
రెండు రాష్ట్రాల్లో 452 మంది ప్రజాప్రతినిధుల్లో కనీసంగా అంటే, 400 పైగానే సిఫారసు లేఖలు జారీ చేస్తుంటారు. అదనంగా ప్రభుత్వ శాఖల్లో దేవాదాయ శాఖ, రెవెన్యూ, ఇతర మంత్రిత్వ శాఖల లెక్క వేరు. ఈ పరిస్థితుల్లో వారి తాకిడి పెరగడం, సామాన్యులకు పాత కష్టాలే ఎదురుకానున్నాయి.
వేసవి సెలవులు ఇంకా ముగియ లేదు. ఈ పరిస్థితుల్లో వీఐపీ సిఫారసు లేఖల వల్ల యాత్రికులు ఏ మేరకు ఉంటుంది? ఎన్ని గంటల పాటు నిరీక్షించే అవకాశం ఉంది. ఈ నెలలో 15 రోజుల పాటు సామాన్యుల నుంచి లభించిన నికర ఆదాయం వీఐపీల వల్ల పెరుగుతుందా? అనేది రోజుల వ్యవధిలోనే తెలనుంది.

Similar News