చిరు వ్యాపారులకు చిరునామా లేకుండా చేసిన బుడమేరు

చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వారిని బుడమేరు వరదలు కర్కశంగా ముంచేశాయి. తిరిగి ప్రారంభించేందుకు నానా తంటాలు పడుతున్నారు.

Update: 2024-09-19 11:16 GMT

బుడమేరు వరదలు విజయవాడను అతలాకుతం చేశాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇంకా నాలుగైదు నెలలు పోతే కానీ మునుపటి వాతావరణం కనిపించే పరిస్థితి లేదు. అన్ని రంగాలు కుదేలయ్యాయి. హోటళ్లు, మెస్‌లు, కర్రీ పాయింట్లైతే దారుణంగా దెబ్బతిన్నాయి. వాటి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి బతుకులు చిందరవందరయ్యాయి. రోడ్ల పక్కన బండ్లు పెట్టుకొని ఇడ్లీలు, దోశలు, పునుగులు వేస్తూ బతుకీడుస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బుడమేరు వరదల్లో వీరు సర్వం కోల్పోయారు.

విజయవాడ నగర శివారు ప్రాంతాలైన అజిత్‌సింగ్‌నగర్, భవానీపురం, చిట్టినగర్, కండ్రిక, అయోధ్యనగర్, దేవీనగర్, మధురానగర్, రాజరాజేశ్వరరావుపేట, డాబాకొట్లు సెంటర్, లూనా సెంటర్, పాయకాపురం, పైపులరోడ్డు సెంటర్, ఎన్జీవోకాలనీ, బోస్‌రోడ్డు, నున్నవెళ్లే రోడ్డు వంటి ప్రాంతాలు ఎప్పుడు రద్దీగా ఉండేవి. సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ నుంచి ఇటు పాయకాపురం, కండ్రిక వరకు అన్నీ ప్రాంతాల్లో నిత్యం జనసంచారంతో కిటకిటలాడేవి. నగరం దాటిన తర్వాత ఉండే గ్రామీణ ప్రాంతాలన్నీ ఈ ఏరియాల మీదుగానే నగరంలోకి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏదో ఒక పని మీద వచ్చిన వారు, నగరంలోకి రోజు పనుల కోసం వచ్చే వారి రాక పోకలతో ట్రాఫిక్‌ కూడా రద్దీగానే ఉంటుంది. వ్యాపారాలు కూడా బాగానే సాగేవి. ఒక్క సారిగా వరదలు రావడంతో ఆ వాతావరణం అంతా తుడిచిపెట్టుకు పోయింది. దాదాపు ఆగస్టు చివరి వారం నుంచి ఇప్పటి వరకు ఇంకా వరదల వాతావరణమే చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తోంది.
చిన్న చిన్న హోటళ్లు, టీ కొట్టులు, మెస్‌లు, కర్రీ పాయింట్లు, ఇండ్లీ, దోశ, పునుగుల బండ్లు కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువుగా ఉంటాయి. దాదాపు 3వేల వరకు ఉంటాయని అంచనా. కస్టమర్లతో నిత్యం కళలాడేవి. వ్యాపారం కూడా బాగానే జరిగేది. అటు గ్రామీణానికి ఇటు నగర ప్రాంతానికి కన్టెంగ్‌ పాయింట్లు కావడంతో బిజినెస్‌ బాగానే జరిగేది. కానీ వరదల నేపథ్యంలో ఇవన్నీ మునిగి పోయాయి. రెండు వారాలకు పైగా అవుతున్నా నేటికీ వరద ప్రభావమే వెంటాడుతోందని, ఇండళ్లోనే పొయ్యలు సరిగ్గా వెలగని పరిస్థితులు ఉండే ఇక మెస్‌లు, కర్రీపాయింట్లు వంటి వాటి పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని సింగ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన కృష్ణారావు చెప్పారు. వంట సామాను, పొయ్యలు, గ్యాస్, సరుకులు ఇలా ప్రతి వస్తువు వరద నీటి పాలయ్యాయని కృష్ణారావు చెప్పొకొచ్చారు. బడ్డీ కొట్టు నిర్వహించే వారి పరిస్థితి కూడా దారుణంగా మారింది. అందులోని సరుకు అంతా వరద పాలైంది. బడ్డీ కొట్లు కూడా నీట మునిగాయి. కొత్తవి తయారు చేసుకుంటే కానీ నడుపుకోలేమని పాయకాపురానికి చెందిన సురేష్‌ చెప్పారు.
మరో వైపు అద్దెల భయం వెంటాడుతోంది. 90 శాతం వాప్యారులు గదులు, పోర్షన్‌లను అద్దెలకు తీసుకొని నిర్వహిస్తున్నారు. రూ. 10వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రోడ్డు సైడు పాయింట్లలో అయితే ఇంకా ఎక్కువుగా ఉంటుంది. వరదలకు అన్నీ పోగొట్టుకోవడం, వ్యాపారాలు లేక పోవడం, తిరిగి ప్రారంభించేందుకు ఖర్చు ఎక్కువ అవుతుండటంతో పాటు అద్దె భారం తోడు కావడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నామని కండ్రికకు చెందిన వెంకటేష్‌ చెప్పారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నామని, ఏమైనా సహాయం అందిన తర్వాత తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
Tags:    

Similar News