బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తి.. పండగైనా తగ్గేదేలేదంటున్న బాబు

బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను కూటమి ప్రభుత్వం శరవేగంగా కొనసాగిస్తోంది. ఈ పనులను శనివారం అర్థరాత్రికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది.

Update: 2024-09-07 09:14 GMT

బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను కూటమి ప్రభుత్వం శరవేగంగా కొనసాగిస్తోంది. ఈ పనులను శనివారం అర్థరాత్రికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. కానీ అవి కాస్త ఆలస్యం అయ్యాయి. దీంతో పండగ పూట కూడా పనులను కోనసాగించి వాటిని పూర్తి చేశారు. బుడమేరుకు మూడు గండ్లు పడగా శుక్రవారం రాత్రికి రెండు గండ్లను పూర్తిగా పూడ్చివేయడం జరిగింది. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగింది. అంతకుముందే మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. అధికారులను కూడా పూడ్చివేత పనులకు సంబంధించి అప్‌డేట్స్ అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా పూడ్చివేత పనులను పటిష్టంగా చేయాలని, పనులు పూర్తి చేశాం అనిపించుకోవాలని పనిచేయొద్దని మంత్రులు అధికారులకు ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా భవిష్యత్తులో వచ్చే విపత్తులను కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్వహణపై సమగ్ర రిపోర్ట్‌ను కూడా కోరినట్లు సమాచారం.

బుడమేరు పనుల్లో జవాన్లు

బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను అధికారులు అంతా యుద్దప్రాతిపదికన చేశారు. ఉధృతంగా వరద ప్రవహిస్తుండగానే రెండు గండ్లను పూడ్చివేశారు. భారీ వర్షాలతో 60,000 క్యూసెక్కుల వరద నీరు బుడమేరుకు వచ్చి చేరింది. దీంతో బుడమేరుకు పలు చోట్ల గండ్ల పడ్డాయి. వాటిని వెంటనే పూడ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. ఈ గండ్లను పూడ్చడానికి ఒకవైపు ఏజెన్సీలు, మరోవైపు ఆర్మీ జవాన్లు కలిసి ఈ గండ్లను పూడ్చేశారు. చెన్నైకు చెందిన ఆరవ బెటాలియన్, సికింద్రాబాద్‌కు చెందిన రెజిమెంటర్ బెటాలియన్ జవాన్లు 120 మందికిపైగా బుడమేరు గండ్ల పూడ్చివేత పనుల్లో పాల్గొంటున్నారు. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు పూర్తిచేసిన వారందరికీ సెఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. పండగ పూట కూడా పనిచేసిన వారి అంకితభావాన్ని కొనియాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అందిస్తున్న సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే అవిశ్రాంతంగా పనిచేస్తున్న వారిని ఆయన అభినందించారు.

పండగపూట ఆగని సేవలు

‘‘వరద బాధితుల కష్టాలను, వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పండగ పూట కూడా అందరూ అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం. నిత్యావసరాల పంపిణీ, పారిశుధ్య పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వరద బాధితులకు త్వరితగతిన రిలీఫ్ ఇచ్చేలా పండగ రోజున కూడా పనిచేయాలని కోరాను. కోరిన వెంటనే ప్రతి ఒక్కరూ నిశ్వంకోంచంగా అంగీకరించారు. రేపు సాయంత్రానికి అన్ని వీధుల్లో వరద నీరు తగ్గిపోతుంది. బాధితులకు నిత్యావసరాల పంపిణీ కూడా శరవేగంగా జరుగుతోంది. భవిష్యత్తులో కూడా నీళ్లు రాకుండా పిటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు అందిస్తున్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి. ప్రతి ఒక్కరికీ సరుకుల కిట్‌ను అందించాలి. ఇళ్లలో జరిగిన నష్టంపై ఎన్యుమరేషన్ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి’’ అని ఆదేశించారు.

తెలంగాణ వర్గాల వల్ల మళ్ళీ వరద

‘‘వరద ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేయాలి. తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. వాటి కారణంగా రానున్నరోజుల్లో కొద్దిపాటి వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపడుతున్నాం. వాటికి అనుగుణంగా సిద్ధంగా ఉండాలి. ప్రజలను అప్రమత్తం చేయాలి. అవసరమైన సహాయం అందించడానికి సన్నద్ధంగా ఉండాలి’’ అని అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్‌లో సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబును విజయవాడ కలెక్టరేట్‌లో కలిశారు.

చంద్రబాబుకు చెక్ ఇచ్చిన పవన్

విజయవాడ కలెక్టరేట్ సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాను ప్రకటించిన రూ.కోటి రూపాయాల విరాళ చెక్కకును అందించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, రాష్ట్రంలో వైరల్ ఫీవర్లు ప్రబలుతున్న క్రమంలో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటూ సీఎం చంద్రబాబు.. పవన్‌కు సూచించినట్లు సమాచారం. ఈ సందర్భంగా విజయవాడలోని ప్రజల కష్టాల గురించి వారివురూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో వరద వల్ల కలిగే నష్టాలను ఉద్దేశించి తీసుకోవాల్సిన చర్యలు, వరదల పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది అన్న అంశాలపై కడా వారు చర్చించుకున్నారని సమాచారం.

Tags:    

Similar News