కర్నూలులో ‘బస్తీ’మే సవాల్! నాగన్న వర్సెస్ రామన్న

మండల పరిషత్ అధ్యక్ష పదవి పోతే పోయింది గాని ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ వచ్చింది. టీడీపీ కర్నూలు ఎంపీ సీటు దక్కించుకున్న అభ్యర్థి కథాకమామిషు ఎలా ఉందంటే..

Update: 2024-03-24 06:27 GMT
కొండారెడ్డి బురుజు

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: సామాజిక న్యాయం పేరిట వైఎస్ఆర్‌సీపీ వేసిన స్కెచ్‌కి.. టీడీపీ విలవిలలాడే పరిస్థితి ఏర్పడింది కర్నూలు జిల్లాలో. సీఎంలను, కేంద్ర మంత్రులను అందించిన కర్నూలు పార్లమెంటు నుంచి బీసీ సామాజిక వర్గ నేతలు ఈసారి పోటీపడుతున్నారు. ఎంపీపీ పదవి తృటిలో తప్పిన కురుబ సామాజిక వర్గానికి చెందిన బస్తిపాడు నాగరాజు (పంచలింగాల నాగరాజు)కు టీడీపీ కర్నూలు ఎంపీ సీటు దక్కింది. ఆయనతో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కర్నూలు నగర మేయర్ కుర్చీ దిగేసిన బీవై రామయ్య పోటీ చేస్తున్నారు.

కర్నూలు పార్లమెంటు స్థితి...

కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లలో బీసీలు 30 శాతానికి పైగా ఉన్నారు. అందులో ప్రధానంగా కురుబ, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారే. మొదటి నుంచి కర్నూలు జిల్లాలో ఎన్నికల ఫలితాలను శాసించే స్థాయిలో ఉన్నారు. కర్నూలు ఎంపీ స్థానం పరిధిలో.. ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, కర్నూలు, కోడుమూరు (ఎస్సీ) పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఎంపీ సెగ్మెంట్ నుంచి కురుబ సామాజిక వర్గానికి మొదటిసారి టికెట్ దక్కింది. గతంలో ఇద్దరు వాల్మీకి సామాజిక వర్గం నుంచి ఎంపీలు అయ్యారు.

ఎంపీటీసీకి అవకాశం..

కర్నూలు రూరల్ మండలానికి చెందిన కురుబ సామాజిక వర్గానికి చెందిన బస్సుపాడు నాగరాజు పంచలింగాల గ్రామానికి చెందిన వ్యక్తి. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలు రూరల్ మండలం టీడీపీ నుంచి ఎంపీపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. పంచలింగాల-1 ఎంపీటీసీగా గెలుపొందారు. తనతో పాటు 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఆయనను గెలిపించుకున్నారు. ఒత్తిళ్ల నేపథ్యంలో స్వతంత్ర ఎంపీటీసీ సభ్యుడు వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు ఇవ్వడంతో, నాగరాజుకు ఎంపీపీ పదవి దక్కలేదు.

"ఎంఎస్సీ బీఈడీ చేసిన నేను ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల కళాశాలలో మూడేళ్లు కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పని చేశా" అని పంచలింగాల నాగరాజు తెలిపారు. "పిల్లలకు పాఠాలు చెప్పడంలో ఉన్న తృప్తి వేరు. కానీ, సామాజిక సేవ చేయాలని తలంపు వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసిన నేను రాజకీయాల్లో ఎంపీటీసీగా అడుగుపెట్టేలా చేసింది" అన్నారు. సమాజ సేవ చేయాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలని రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్లి స్వయం సమృద్ధి సాధించాలని పంచలింగాల రామరాజు వివరించారు. సాధారణ కార్యకర్తగా టీడీపీలో చేరిన తనను బీసీ సాధికారిక రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎంపిక చేసిందన్నారు. తన పనితీరు తనను ఎదిగేలా చేసిందన్నారు.


సామాన్యుడికి అవకాశం...

కర్నూలు ఎంపీ స్థానం నుంచి హేమా హేమీలు ఎంపీలుగా సేవలందించారు. ఆ కోవలో.. ఉస్మాన్ అలీ ఖాన్, వరుసగా నాలుగు సార్లు ఎంపికైన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఏరాసు అయ్యపురెడ్డి, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి లాంటి వారు కర్నూలు పార్లమెంటు సీట్ నుంచి ఎంపికయ్యారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన కర్నూలు ఎంపీ సీటును సామాజిక సమీకరణలో భాగంగా కురుబ సామాజిక వర్గానికి చెందిన బస్తిపాడు నాగరాజు ( పంచలింగాల నాగరాజు)ను టీడీపీ తన అభ్యర్థిగా ప్రకటించింది.

జెడ్పీటీసీకి ఎమ్మెల్యే టికెట్...

ఎంపీపీ అయితే చాలు అనుకున్న వ్యక్తికి టీడీపీ కర్నూలు పార్లమెంటు సీటు ఇస్తే, వైఎస్ఆర్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థికి ఎమ్మెల్యే సీటు ఇచ్చింది. ఇదిలా ఉంటే కర్నూలు ఎంపీ స్థానంలో పోటీ చేయించే అభ్యర్థిని నిర్ణయించడంలో మాత్రం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాల సమీకరణలో సమతుల్యం పాటించారు. బీసీ, ఓసీ, మైనారిటీ, దళిత వర్గాల ఓటర్లు చీలకుండా ఉండే విధంగా అభ్యర్థుల ఎంపికలో చాలా సూక్ష్మంగా ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఒక ముస్లిం మైనారిటీ, ఇద్దరు బీసీలు, ముగ్గురు రెడ్లు, ఒక ఎస్సి అభ్యర్థిని ప్రకటించింది.

తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే సామాజిక వర్గాల సమీకరణలో.. తడబాటు కనిపిస్తున్నట్లు పరిస్థితి చెబుతోంది. కర్నూలు ఎమ్మెల్యే స్థానం ఆర్యవైశ్యులకు, బీసీలకు ఒక సీటు రెడ్డి సామాజిక వర్గానికి రెండు సీట్లు ఇచ్చింది. ఆదోని, ఆలూరు శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. ఈ రెండు సీట్ల అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు.


కులాల మధ్య సమరం...

ప్రధాన పార్టీలు అనడం కంటే.. కర్నూలు పార్లమెంటు స్థానంలో బీసీ కులాల మధ్య సమరం సాగేలా ఉంది. కురుబ సామాజిక వర్గానికి టీడీపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బీవీ రామయ్యతో తలపడనున్నారు. జనాభా, ఓటర్ల రీత్యా పరిశీలించినా.. పత్తికొండ నియోజకవర్గంలో జనాభా రీత్యా 75 వేలు, ఆలూరులో 70వేలు, మంత్రాలయంలో 55 వేలు, ఎమ్మిగనూరులో 45 వేల జనాభా ఉంది. జనాభా సంఖ్య కంటే ఓటర్లు కూడా అధికమే. ఈ ఏడు నియోజకవర్గాల్లో వాల్మీకులు, కురబ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఆలూరు ఆదోని పత్తికొండ నియోజకవర్గం వాల్మీకులు తర్వాత కురబ సామాజిక వర్గం ఓటర్లే కీలకం.

దీనివల్ల రెండు సామాజిక వర్గాల నుంచి ప్రధాన పార్టీలు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. తటస్థ ఓటర్లు రెడ్డి కమ్మ ఇతర బీసీ వర్గాల ఓటర్లు ఫలితాన్ని శాసించే అవకాశం ఉంటుంది. కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఆదోని నియోజకవర్గం బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ అభ్యర్థి ఖరారు కాలేదు. ఆలూరు పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ అభ్యర్థులు తేలిన తర్వాత, ఎన్నికల్లో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది వేచి చూడాలి.



Tags:    

Similar News