CANCER | ఆంధ్రలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయ్!
ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ పెరుగుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్వేలో క్యాన్సర్ అనుమానిత కేసులు పెరిగినట్టు తెలుస్తోంది
ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ పెరుగుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో క్యాన్సర్ అనుమానిత కేసులు పెరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వయసున్న వారు సుమారు 4 కోట్ల మంది వరకు ఉన్నట్టు అంచనా కాగా ఇప్పటి వరకు సుమారు 30.5 లక్షల మందికి క్యాన్సర్ నిర్దారిత పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇప్పటి వరకు 1.14 శాతం మందికి క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఇదే ఒరవడి కొనసాగితే కోటి మందిలో దాదాపు 3 లక్షలకు పైగా క్యాన్సర్ తో బాధ పడే అవకాశం ఉంది.
క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సర్వే జరుగుతోంది. ఇందులో ఇప్పటివరకు 1.14% అనుమానిత కేసులు బయటపడ్డాయి. గత నెల 14 నుంచి ఈ నెల 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 30.27 లక్షల మందిని పరీక్షించారు. వారిలో 34,653 (1.14%) మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారు 4 కోట్ల మంది ఉన్నారు. వీరిలో మహిళలు 2 కోట్ల మంది. 18 ఏళ్లు దాటిన యువతులకు రొమ్ము క్యాన్సర్ స్వీయపరీక్షపై అవగాహన కల్పిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. మలివిడత పరీక్షల్లో పీహెచ్‌సీ వైద్యులు క్యాన్సర్ కేసులను గుర్తిస్తారు.
రాష్ట్రంలో ఏటా 73వేల కొత్త క్యాన్సర్ కేసులు, 40వేల వరకు మరణాలు ఉంటున్నాయి. దేశంలో ఇలా ఇంటింటి సర్వేతో క్యాన్సర్ లక్షణాలు గుర్తిస్తున్న మొదటి రాష్ట్రం ఏపీ.
పర్యావరణంలో వస్తున్న మార్పులు, జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటివి ప్రధానంగా క్యాన్సర్ కి కారణాలుగా భావిస్తున్నారు. జీవనశైలి వ్యాధుల సర్వే-3 కింద ప్రతి ఇంటికీ ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లి వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన ప్రశ్నావళి ద్వారా బీపీ, మధుమేహం, కిడ్నీ, టీబీ, కుష్ఠు, ఇతర వ్యాధుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వేలో క్యాన్సర్ లక్షణాలు కలిగినవారిని ఇంటి వద్దే పరీక్షిస్తున్నారు.
అత్యధికంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వార, ఓరల్, బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువగా ఉంటున్నాయి.
ఈ కేసులు ఆందోళన కలిగిస్తున్నందున 18 ఏళ్లు దాటిన మహిళల్లో ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఎలా గుర్తించాలన్న దానిపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 15వేల బృందాల ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. వైద్యులకు విశాఖలోని హోమీబాబా క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ నిపుణులు శిక్షణ ఇచ్చారు.
రాష్ట్రంలో ఈ సర్వే సుమారు 10 నెలలు కొనసాగుతుంది. క్యాన్సర్ అనుమానిత లక్షణాలు గుర్తించిన వారికి పీహెచ్‌సీలలో నిర్ధారణ జరుగుతుంది. అవసరమైనవారిని మళ్లీ బోధనాసుపత్రుల్లో పరీక్షిస్తారు.