కేంద్రం బడ్జెట్‌పై చంద్రబాబు, లోకేష్ ఏమన్నారంటే!

కేంద్ర బడ్జెట్ 2024లో ఏపీ జరిపిన కేటాయింపులపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ మాత్రం..

Update: 2024-07-23 11:40 GMT

కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. ఆంధ్రప్రదేశ్ ప్రస్తావ తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు అదనపు నిధులు కేటాయిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి సహకరిస్తామన్నారు. వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ కింద నిధులిస్తామంటూ ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలతో ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని, ఆంధ్రుల ఆకాంక్షలను కేంద్రం బడ్జెట్ ద్వారా నెరవేర్చే ప్రయత్నం చేసిందని టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కృష్ణదేవరాయలు పేర్కొన్నారు. కాగా ఇంతకీ ఈ బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏమన్నారో తెలుసా.. బడ్జెట్‌లో ఏపీకి కేంద్రం అందించిన తోడ్పాటు రాష్ట్ర భవిష్యత్తు పునఃనిర్మాణానికి దోహదపడుతుందని, ప్రగతిశీల, విశ్వాసాన్ని పెంచే విధంగా ఉందని సీఎం పేర్కొన్నారు.

‘‘మన రాష్ట్ర అవసరాలను గుర్తించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు చేయడం జరిగింది. రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలతో పాటు వెనకబడిన జిల్లాలకు విభజన ప్యాకేజీ కింద నిధులు కేటాయించడంపై దృష్టి పెట్టినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి సీతారామన్‌కు రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు. కేంద్రం అందించిన ఈ తోడ్పాటు రాష్ట్ర పునఃనిర్మాణానికి ఎంతగానో దోహదపడుతుంది’’ అని ఎక్స్(ట్విట్టర్) వేదికగా చంద్రబాబు పోస్ట్ పెట్టారు.

చాలా సంతోషం

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ‘‘ఈరోజు బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలకు చాలా సంతోషిస్తున్నాను. ఆమెకు కృతజ్ఞతలు. ఈ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక అభివృద్ధితో పాటు, సామాజిక లక్ష్యాలను సాధించడంలో దోహదపడతాయి. మా పోరాటాన్ని గుర్తించి, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటిపారుదల, మానవ వనరుల అభివృద్ధి వంటి ముఖ్యమైన రంగాలను స్పృశిస్తూ.. ప్రత్యేకతతో కూడిన ప్యాకేజీని అందించడం ఏపీ ప్రజలకు గర్వకారణం. అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌కు అందించిన సహకారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలని భావిస్తున్నా. నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రోజు మరువలేని శుభదినం. ఇది రాష్ట్రాభివృద్ధి కోసం, ఏపీ ప్రజలు తమ కలలు నెరవేర్చకోవడానికి తొలి అడుగు వంటిది’’ అని లోకేష్ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చేసిన కేటాయింపులపై ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తోంది. సీఎంగా చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారంటూ వ్యాఖ్యానిస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు లభించింది గుడ్డి సున్నా మాత్రమేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది.

Tags:    

Similar News