ప్రభుత్వాన్ని, పార్టీని క్లబ్ చేస్తున్న చంద్రబాబు?
అధికారంలోకి వచ్చేంత వరకు పార్టీ పని చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి సంబంధం లేకుండా ప్రజల శ్రేయస్సును కోరుతూ పాలన సాగించాలి. కానీ చంద్రబాబు రెండింటిని క్లబ్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
Byline : The Federal
Update: 2024-07-18 07:21 GMT
నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు తన ఫంక్షనింగ్ స్టైల్‌ని మార్చేశారు. ఒక పక్క ప్రభుత్వ పరంగా పరిపాలన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో పక్క ప్రజలు, తన పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారిని పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా వారంలో ఒక రోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలను కలిసి వారి సమస్యలను తెలుసుకొంటున్నారు. తానే కాకుండా మంత్రులు కూడా వెళ్లాలని ఆర్డర్స్ జారీ చేశారు. అటు పార్టీలో ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులను కూడా ప్రజలు, పార్టీ శ్రేణులతో మమేకం కావాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక రోజు అందుబాటులో ఉంటే మిగిలిన రోజుల్లో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఉండాలని దిశా నిర్థేశం చేశారు. ఒక్కో రోజు ఒక్కో మంత్రి, ఒక్కో నాయకుడు అందుబాటులో ఉండే విధంగా టైమ్ టేబుల్ కూడా నిర్ణయించారు. దీనిని ఈ నెల 17 నుంచి అమల చేయాలని దేశించారు. జూలై 17న ప్రభుత్వం నుంచి మంత్రి సవిత, పార్టీ నుంచి బొల్లినేని రామారావు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి వినతులు స్వీకరించారు. జూలై 18న మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రం చేపట్టారు. జూలై 19న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, జూలై 22న మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కావలి ప్రతిభా భారతి, జూలై 23న మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జూలై 24న మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, జూలై 25న మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్, జూలై 26న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, జూలై 29న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు పనబాక లక్ష్మి. జూలై 30న మంత్రి ఎం రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహన్‌రావు, జూలై 31న మంత్రి బీసీ జనార్థనరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు తోటా సీతారామలక్ష్మిలు టీడీపీ కార్యాలయానికి వెళ్లి వినతులు స్వీకరించాలని డ్యూటీలు వేశారు.
పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలకు మేము ఉన్నామనే భరోసా ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలో కష్టపడి పని చేసి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని, వారి సేవలను విస్మరిస్తున్నారని, దీంతో వారు అసంతృప్తులకు గురవుతున్నారనే విమర్శలు గతంలో వినిపించాయి. దీనికి తోడు గత ఐదేళ్ళ జగన్ ప్రభుత్వంలో క్షేత్ర స్థాయిలోని టీడీపీ శ్రేణులను అనేక ఇబ్బందులకు గురి చేశారని, అయినా వారు టీడీపీని వీడకుండా పని చేశారనే టాక్ ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఆదుకోక పోయినా, వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించక పోయినా శ్రేణుల్లో చెడ్డ పేరు రావడంతో పాటు పార్టీ పట్ల వారికి విశ్వాసం పోతుందని, అలా కాకుండా వారిలో నమ్మకం పెంచి కాపాడుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూరు. అంతేకాకుండా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులను కానీ, నాయకులను కానీ కలవక పోవడం వల్ల జగన్‌కు, ఆయన పార్టీకి వచ్చిన నష్టం టీడీపీకి రాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు తన పార్టీ శ్రేణులను కలవాలనే ఆలోచనకు వచ్చినట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది.
చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్న సయమంలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య స్పష్టమై వ్యత్యాసం చూపిస్తూ పాలన సాగించారు. ఒక వైపు పార్టీ కార్యకలాపాలను తన కంట్రోల్‌లో పెట్టుకుంటూనే, తనదైన శైలిలో ప్రభుత్వ పాలన సాగించారు. అయితే ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా అటు పార్టీ నేతలు, ఇటు ప్రభుత్వ పెద్దలను కలుపుతూ కార్యక్రమాలు చేపట్టడం పార్టీని, ప్రభుత్వాన్ని క్లబ్ చేస్తున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.