పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసుపై స్పందించిన చంద్రబాబు
మనం అప్రమత్తంగా లేకుంటే బాబాయి గొడ్డలి, కోడికత్తి, గులకరాయి తరహాలో ఈ కేసును కూడా మనపైనే వేస్తారని చంద్రబాబు అన్నారు.;
By : The Federal
Update: 2025-04-03 13:29 GMT
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం అంశంలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందని విమర్శించారు. ప్రవీణ్ పగడాల మరణానికి సంబందించి సీసీ కెమేరాల్లో ఒక్కో అంశం బయటకు వస్తోందని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీని ఛేదించడంలో సీసీకెమేరాలది కీలక పాత్రని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం చంద్రబాబు, పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మరణంపై స్పందించారు. ప్రవీణ్ పగడాల మరణం, వైఎస్ వివేకానందరెడ్డి మరణం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద జరిగిన కోడికత్తి కేసు, విజయవాడలో జగన్ మీద జరిగిన గులకరాయి దాడి సంఘటనలను ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అప్రమత్తంగా లేకుండా పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మరణాన్ని కూడా బాబాయ్ గొడ్డలి, కోడికత్తి, గులకరాయి తరహాలో అన్నీ మనపైనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు వేస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు చేసిన మంచిని చెప్పుకునేందుకు కూటమి ప్రభుత్వం, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు చెప్పుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతుంటే లేని పోని నిందలు కూటమి ప్రభుత్వంపై వేసేందుకు కుట్రలు చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మీద మండిపడ్డారు.
మంచి ఉద్దేశంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే కావాలనే వాటిని వక్రీకరించి చెడు సందేశాలను వ్యాప్తి చేసే విధంగా పోస్టులు పెడుతున్నారని, వీటిన్నింటిపైన అప్రమత్తంగా ఉండాలని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో ‘పల్లె నిద్ర’ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెలలో నాలుగు రోజుల పాటు పల్లె నిద్రలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించి నేటికి 11 రోజులు గడిచాయి. కానీ ఇంత వరకు ఒక క్లారిటీ రాలేదు. పోస్టుమర్టం రిపోర్టును విడుదల చేయలేదు. ప్రవీణ్ పగడాల మరణంపై ఇది వరకు రెండు సార్లు ప్రెస్ మీట్లు పెట్టి వివరాలను వెల్లడించిన పోలీసు అధికారులు పోస్టుమర్టం రిపోర్టు మీద ఇంత వరకు ప్రస్తావించలేదు. అనుమానాస్పద కేసు కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. దీంతో ఈ కేసు మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ కేసు గురించిన వివరాలను ఏమని వెల్లడిస్తారో, ప్రమాదమని చెబుతారా? లేక హత్య అని వెల్లడిస్తారా? అనే దానిపై ఆసక్తి నెలకొంది.