మోదీని పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబు

ప్రధాన మంత్రి మోదీ పేరును చిలకలూరిపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోత మోగించారు. ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను చెబుతూ పొగడ్తలతో ముంచెత్తారు.;

Update: 2024-03-17 15:52 GMT
Chandrababu Naidu, TDP

జి. విజయ కుమార్

చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తడంతోనే సరిపోయింది. భారత్‌ను విశ్వగురువుగా ప్రపంచంలో నిలబెడుతున్నాడు కరోనా సమయంలో ఏపీ ప్రజల ప్రాణాలు కాపాడాడు, అన్ని రంగాల్లో భారత్‌ను ముందుకు నడిపించడంలో కృషి ప్రశంసనీయం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
ప్రగతి వాది మోదీ..
ఐదు కోట్ల తెలుగు ప్రజల తరఫున ప్రగతివాది ప్రధాని మోదీకి స్వాగతం. రాష్ట్ర పునర్‌ నిర్మాణ సభ ఇది. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ. ఐదేళ్లలో విధ్వంస, అహంకార పాలనతో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయి. ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికే మూడు పార్టీలు జట్టు కట్టాయంటూ చంద్రబాబు చెబుతున్నప్పుడు ప్రధాని ఆసక్తిగా విన్నారు.
జెండాలు వేరు కావొచ్చు అజెండా ఒక్కటే..
మా జెండాలు వేరే కావచ్చు. మా అజెండా ఒక్కటే. సంక్షేమం. అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ పవన్‌కల్యాణ్‌ను అభినందించారు. మోదీగారు ఒక వ్యక్తి కాదు. భారతదేశాన్ని విశ్వగురుగా మారుస్తున్న ఒక శక్తి. మోదీ అంటే ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచ మెచ్చిన మేటి నాయకుడు. ప్రధాన మంత్రి అన్నయోజన, ఆవాస్‌ యోజన, ఉజ్వల యోజన, కిసాన్‌ సమ్మాన్‌ నిధి, జల్‌ జీవన్‌ మిషన్‌ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చారు ప్రధాని అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
పేదరికంలేని దేశం.. మోదీ కల
పేదరికం లేకుండా చేయడం మోదీ కల. మనందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాలి. వికసిత్‌ భారత్‌కు ఇదే సరైన సమయం. అందుకు మనమంతా అండగా ఉండాలి. ఇదే నా వాగ్దానం. భారత్‌ను నెంబర్‌వన్‌ దేశంగా మార్చే శక్తి ఆయనకు ఉంది. భారతీయులను శక్తిమంతమైన జాతిగా చేయడం ఆయన ఆశయం. దేశం దూసుకుపోతోంది. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత సవాళ్లు, సమస్యలను అధిగమించాం. ఎన్డీయేలో భాగస్వాములయ్యాం. అనేక కార్యక్రమాలు చేశాం.
11 జాతీయ విద్యా సంస్థలను నెలకొల్పాం. అమరావతి నిర్మాణానికి పునాదులు వేశాం. అది పూర్తయి ఉంటే, దేశంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా మారేది. మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వ్యక్తి జగన్‌. పోలవరాన్ని గోదావరిలో కలిపారు. సహజ వనరులు దోచేశారు. జె బ్రాండ్‌తో కల్తీ మద్యం తెచ్చి అనేకమంది ప్రజలను బలితీసుకున్నారంటూ జగన్‌పై విరుచుకు పడ్డారు.
అక్రమ కేసులు
గతంలో ఎప్పుడూ లేని విధంగా అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించిన వారిని అణచివేశారు. జగన్‌ అధికార దాహానికి బాబాయ్‌ బలయ్యారు. ఇద్దరు చెల్లెళ్లు రోడెక్కి జగన్‌కు ఓటు వేయొద్దని చెబుతున్నారంటే.. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని ఓటేయాల్సిన అవసరాన్ని నొక్కి పలికారు.
Tags:    

Similar News