విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేశారో చెప్పిన చంద్రబాబు..!

వైసీపీ ప్రభుత్వం చేతకాని తనం వల్ల విద్యుత్ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి మొత్తం రూ.1,29,503 కోట్ల నష్టం జరిగిందని ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

Update: 2024-07-09 12:25 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు(జూలై 9) రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిని తాము పాత ప్రభుత్వాన్ని దెప్పి పొడవాలన్న ఉద్దేశంతో విడుదల చేయడం లేదని, ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తమ ఈ ప్రయత్నం ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు వివరించారు. అన్ని శాఖల్లో భయానక పరిస్థితులు నెలకొని ఉన్నాయని, అన్ని రంగాలను గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజల ముందుకు వాస్తవాలను తీసుకురావడానికే తమ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేస్తుందని, గత ప్రభుత్వం ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వారి ముందు ఉంచడం కోసం, ఆ తప్పులు మళ్ళీ జరగకుండా ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే తమ పాలన ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

అప్పుడే మెరుగైన ప్రయోజనాలు

‘‘సమర్థమైన పాలన అందిస్తేనే పేదలకు మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి. బాధ్యతారాహిత్యంగా పాలన చేస్తే ప్రజలకు, పేదలకు నష్టాలే మిగులుతాయి. గత ప్రభుత్వం చేసిందిదే. అందుకే గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని ప్రజలకు చెబుతున్నాం. విద్యుత్‌తో ప్రతిఒక్కరి జీవితం ముడిపడి ఉంది. విద్యుత్ లేకుంటే ప్రతి ఒక్కరి జీవితం స్తంబించిపోతుంది. అలాంటి విద్యుత్ రంగంలోక కూడా అనేక అవకతవకలు జరిగాయి. గత ఐదేళ్లలో అసలు విద్యుత్ రంగం సర్వనాశనం అయింది. అసమర్థులు పాలిస్తే ఏమవుతుందో ప్రజలకు అర్థం చేసుకోవాలి’’ అని చంద్రబాబు కోరారు.

‘నా అధికారం పోయినా దేశం బాగుపడింది’

‘‘గతంలో విద్యుత్ సంస్కరణల వల్ల నా అధికారం పోయినప్పటికీ దేశం మాత్రం బాగుపడింది. నేను తెచ్చిన సంస్కరణలు వైఎస్ఆర్ హయాంలో కనిపించాయి. టీడీపీ హయాంలో నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేశాం. విద్యుత్ చార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నాం. 2014-2019 మధ్య కూడా విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాం. 2018 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాం. 2018-19 మధ్య విద్యుత్ ఉత్పత్తి ఏడాదికి 14,929 మెగావాట్లకు చేరేలా కృషి చేశాం. కానీ గత ప్రభుత్వం తన అసమర్థ పాలన వల్ల ప్రజలకు విద్యుత్ చార్జీల భారం మోపింది. ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలపై రూ.32,166 కోట్లు విద్యుత్ చార్జీల రూపంలో భారం మోపారు. విద్యుత్ రంగంలో మొత్తం రూ.49,596 కోట్ల అప్పులు ఉన్నాయి’’ అని వివరించారు చంద్రాబాబు.

సౌరశక్తి కోసం ప్రత్యేక చర్యలు

థర్మల్ విద్యుత్‌ను గ్రీన్ హైడ్రోజన్‌గా మార్చడానికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయని, గ్రీన్ హైడ్రోజన్ వస్తే రాష్ట్రానికి అదనంగా పన్నులు వస్తాయని చెప్పారు. ‘‘రూఫ్ టాప్ సౌరశక్తి ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకుంటాం. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయిస్తుంది. విద్యుత్ పంపిణీలో నష్టాలను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటాం.విద్యుత్ రంగ బలోపేతానికి సాంకేతిక సహాయం తీసుకుంటాం. ప్రజలకు మరోసారి నాణ్యమైన విద్యుత్ అందించడమే కాకుండా వారిపై ఉన్న భారాన్ని తగ్గించడానికి కృషి చేస్తాం’’ అని వెల్లడించారు.

జగన్ చేతగాని తనమే కారణం

‘‘జగన్ చేతగాని తనం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఒక్కదానిలోనే 4,773 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి అదనపు భారం పడింది. సెకి నుంచి కొనుగోలు చేయాల్సిన 7 వేల మెగావాట్ల వల్ల ఒక్క ట్రాన్సిమిషన్ కోసం రూ.3,850 కోట్ల నుంచి రూ.4,350 కోట్ల అదనంగా చెల్లలించాల్సి వచ్చింది. గత ప్రభుత్వం చేతకాని పాలన వల్లే విద్యుత్ రంగానికి అనేక కోణాల్లో నష్టాలు వచ్చాయి. వాటిని సవరించి మరోసారి విద్యుత్ రంగాన్ని లాభాల దిశగా నడిపించడానికి అన్ని విధాల శ్రమిస్తాం’’ అని వివరించారు చంద్రబాబు.

రూ.1.29 లక్షల కోట్ల నష్టం

‘‘అదే విధంగా వ్యవసాయ పంప్‌సెట్లకు స్మార్ట్ మీటర్లపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ట్రూఅప్, ఇంధన సర్‌ఛార్జి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటూ రకరకాలుగా గత ప్రభుత్వం ప్రజలకు దోచుకుంది. గృహ వినియోగదారులపై 45శాతం ఛార్జీలు అదనంగా మోపారు. ఈ ఛార్జీల పెంపు వల్ల కోటిన్నర కుటుంబాలు ఇబ్బందిపడ్డాయి. కేవలం 50 యూనిట్లే వాడిన పేదలపై వందశాతం ఛార్జీలు పెంచారు. సాధ్యమైనంత త్వరగా విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతాం. అందుకోసం కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకుంటాం’’ అని వెల్లడించారు. గత ప్రభుత్వం చేతకాని తనం వల్ల విద్యుత్ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి మొత్తం రూ.1,29,503 కోట్ల నష్టం జరిగిందని, పవన విద్యుత్‌కు సంబంధించి టీడీపీ ప్రభుత్వం చేసుకున్న 21 ఒప్పందాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

Tags:    

Similar News