అంతా దోచేశారు.. సహజవనరుల దోపిడీపై చంద్రబాబు శ్వేతపత్రం

ఐదేళ్ల పాలనలో వైసీపీ అంతా దోచేసిందని, రాష్ట్రాన్ని గుల్ల చేసేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సహజవనరుల దోపిడీపై ఆయన ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారు.

Update: 2024-07-15 11:02 GMT

‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న నానుడిని ప్రస్తుత ప్రభుత్వం తూచా తప్పకుండా పాటిస్తోంది. అందులో భాగంగానే అధికారం ఉన్నప్పుడే ప్రత్యర్థి లేకుండా చేసుకుంటుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకవైపు ఎప్పటికప్పుడు కొత్త పథకాలను, కార్యక్రమాలను ప్రారంభిస్తూనే మరోవైపు వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే వరుస శ్వేతపత్రాలను విడుదల చేస్తోంది. ఇప్పటికే అమరావతి, పోలవరం, విద్యుత్ రంగం, ఆర్థిక రంగంపై శ్వేతపత్రాలను విడుదల చేశారు చంద్రబాబు. ఈరోజు వైసీపీ పాలనలో జరిగిన సహజవనరుల దోపిడీపై ఆయన మరో శ్వేతపత్రం విడుదల చేశారు. ఇదంతా కూడా వైసీపీ అసలు రంగును ప్రజలకు చూపడానికి చేస్తున్న ప్రయత్నమేనన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం దుస్థితి ఎలా తయారైందో చెప్పే ప్రయత్నమని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సచివాలయంలో అధికారులతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఇందులో రాష్ట్రంలోని సహజవనరులను గత ప్రభుత్వం పూర్తిగా దోచేసిందంటూ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎక్కడపడితే అక్కడ తవ్విపోసేశారన్నారు. రాష్ట్రంలోని అడవులను ధ్వంసం చేసేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సహజ వనరుల దోపిడీపై ఆయన ఈరోజు సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ శ్వేతపత్రం ద్వారా రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలుపుతున్నామని అన్నారు. వారు చేసిన ఐదేళ్ల పాలనలో ఖనిజాలు, భూములు, అటవీ సంపద అంతా దోచేశారని, ప్రస్తుతం అవన్నీ అడుగంటిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో ఆకాశమే హద్దు అన్న రీతిలో భూ కబ్జాలు చేశారంటూ విమర్శలు గుప్పించారు. పేదలను ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ చేసిందంతా దందానేనని, పేదలను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. పార్టీ కార్యాలయాల పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. అసైన్డ్ భూములను కూడా వారు దోచేశారని, ల్యాండ్ టైట్లింగ్ పేరుతో వారు పాల్పడిన భూ దోపిడీ అంతా ఇంతా కాదని చంద్రబాబు వివరించారు.

‘‘విశాఖలోని రామానాయుడు స్టూడియో భూములు కొట్టేయాలని ఎంతో ప్రయత్నించారు. కానీ వల్లకాలేదు. వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ ల్యాండ్స్‌ను కొట్టేశారు. దస్పల్లా భూములను లాగేసుకుని ఇళ్లు కట్టుకున్నారు. మాజీ ఎంపీ ఎంవీవీ పాల్పిడిన భూ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఒంగోలులో నకిలీ పత్రాలతో రూ.101 కోట్ల ఆస్తిని కాజేయడానికి ప్రణాళికలు సిద్దం చేశారు. ఒంగోలులో జరిగిన భూ కబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాం. తిరుపతి, రేణిగుంటలో భారీగా భూములు కొట్టేశారు. వాటికి లెక్కేలేదు. చిత్తూరులో 782 ఎకరాలు స్వాహా చేయాలని ప్రయత్నించారు. హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలి అన్నది వైసీపీ నేతలే నిర్ణయిస్తారు. అది మంజూరు కావడానికి ముందే అక్కడి భూములు కొనుగోలు చేస్తారు. ఎవరైనా అప్పటికే ఉంటే వారికి పరిహారం అందిస్తామని చెప్పి దాన్ని కూడా వాళ్లే కొట్టేసేవారు’’ అంటూ కీలక విమర్శలు చేశారు చంద్రబాబు.

‘‘పుంగనూరులో 982 ఎకరాలను పట్టా చేయించుకున్నారు. పేదవారి అసైన్డ్ భూములను దోచేశారు. ప్రశ్నించే వారిపై దాడులు చేశారు. వైసీపీ తమ పార్టీ నేతలకు 13,800 ఎకరాలను ధారాదత్తం చేసింది. అతి తక్కువ ధరకు 40 వేల ఎకరాలు కొన్నారు. అధికారులను బెదిరించి మరీ భూములకు పట్టాలు తెచ్చుకునేవారు’’ అంటూ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News