గన్నవరంలో చిరుత కలకలం..ఉచ్చులో పడి మృతి చెందిన పులి
అడవి పందుల కోసం పన్నిన ఉచ్చులో చిరుత పులి చిక్కుకుంది. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
అడవి పందుల నుంచి తన పంట పొలాన్ని రక్షించుకునేందుకు ఓ రైతు ఉచ్చులను ఏర్పాటు చేశారు. అయితే ఆ ఉచ్చులో అడవి పందులకు బదులుగా ఓ చిరుత పులి ఇరుక్కొని ప్రాణాలు విడిచింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అడవి పందులకు బదులు చిరుతపులి ఆ ఉచ్చులో ఇరుక్కొని మృతి చెందడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అసలేమి జరిగిందంటే.. గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన పంట పొలాన్ని అడవి పందులు నాశనం చేస్తున్నాయి. వీటి చెర నుంచి తన పొలాన్ని ఎలా రక్షించుకోవాలని ఆలోచనలు చేశారు. దీని కోసం అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి ఉచ్చును ఏర్పాటు చేసుకున్నాడు. తన పంట పొలాన్ని నాశనం చేసేందుకు వచ్చిన అడవి పందులు ఆ ఉచ్చులో పడుతాయని భావించాడు. ఆ మేరకు అనువైన చోట వీటిని ఏర్పాటు చేశాడు. అయితే అలా అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో అడవి పందులకు బదులు చిరుత పులి చిక్కుకుంది. ఉచ్చు బలంగా బిగించుకొని పోవడంతో చివరికి ఆ పులి మృతి చెందింది. ఉదయాన్నే ఆ రైతు పొలానికి వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుత పులి కనిపించింది. దీంతో ఆ రైతు అవాక్కయ్యాడు. ఇది చుట్టు పక్కల ప్రాంతాలకు పాకింది. ఈ దృశ్యాన్ని చూసిన ఇతర చూసిన ఆ ప్రాంతపు రైతులు, స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. భయాందోళనలకు గురయ్యారు.