ఇద్దరి కంటే తక్కువ పిల్లలుంటే అనర్హలు..మరి లోకేష్‌ పరిస్థితి ఏంటి?

జనాభా పెరుగుదల గురించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-01-17 06:11 GMT

నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాక సీఎం చంద్రబాబు జనాభా పెరుగుదలపై ఎక్కువుగా మాట్లాడుతున్నారు. గతంలో జనాభా నియంత్రణ గురించి ప్రచారం చేసిన చంద్రబాబు నేడు జనాభా పెరుగుదల గురించి తరచుగా ప్రస్తావనలు చేస్తున్నారు. ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అని ఉమ్మడి రాష్ట్రంలో మాట్లాడిన చంద్రబాబు నేడు ఒకరు చాలరు.. ఇద్దరు చాలరు.. ఇంకా పిల్లలను కనండని సూచనలు చేస్తున్నారు. జనాభా పెరగాల్సిన అవసరం ఉందని.. దీనిని ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలని.. ఎక్కువ మంది పిల్లలను కనాలని చెబుతున్నారు. జనాభా పెరుగుదల గురించి గురువారం మరో సారి ప్రస్తావించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డెవలప్‌మెంట్, గ్రోత్‌ రేటు అంచనాలపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా వృద్ధి రేటును కూడా ఆయన పీపీటీ ద్వారా అంచనాలను వెల్లడించారు. 2051 నాటికి ఏపీ జనాభా 5.42కోట్లు మాత్రమే ఉంటుందన్న అంచనాల గురించి ఆయన ప్రస్తావించారు. ఇది ఒక రకంగా ప్రమాదకరమే అన్నారు. 2011లో 4.95 కోట్లుగా ఉన్న ఏపీ జనాభా 2016లో 5.16 కోట్లు, 2021లో 5.29 కోట్లు, 2026లో 5.38 కోట్లు, 2031లో 5.42 కోట్లు, 2036లో 5.44 కోట్లు, 2041లో 5.42 కోట్లు, 2046లో 5.42 కోట్లు, 2051లో 5.41 కోట్లుగా ఉండొచ్చనే అంచనాలను ఆయన పీపీటీ ద్వారా వెల్లడించారు. 2051 నుంచి దేశ జనాభా తగ్గు ముఖం పట్టే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో 2031 నుంచే జనాభా తగ్గుదల ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
దీంతో పాటుగా జనాభా పెరుగుదల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా అనేది కూడా ఒక ఆస్తిని, దానిని కూడా పెంచుకోవలసిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. జనాభా, ప్రజలు లేక పోతే సంపద సృష్టించి ఏమి లాభమని అన్నారు. సంపదను సృష్టించే క్రమంలో జనాభాను నిర్లక్ష్యం చేయకూడదని, అలా చేస్తే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయని.. పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద విమానాశ్రయాలు నిర్మించుకున్నా.. వాటిల్లో జనాభా లేక పోతే శ్మశానాలతో సమానమని అన్నారు.
ఇదే సమయంలో జనాభా పెరుగుదలకు రాజకీయాలకు కూడా ముడిపెట్టారు. సర్పంచ్, మేయర్, మునిసిపల్‌ కౌన్సిలర్‌ వంటి స్థానిక సంస్థల ఎన్నికలకు, ఆ పదవుల కేటాయింపులకు కూడా వారికి ఉన్న పిల్లల ఆధారంగా కేటాయించాలనే ఆలోచనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇద్దరి కంటే తక్కువ మంది పిల్లలు ఉంటే అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించే నిర్ణయం కూడా త్వరలో తీసుకుంటామని, దీనిపైన కసరత్తు కూడా జరుగుతోందని చెప్పుకొచ్చారు. గతంలో ఒకరు, ఇద్దరు కంటే ఎక్కువ ఉన్న వారికి ఎన్నికల అవకాశం లేదన్నారు. తాజాగా దానికి పూర్తి విరుద్దంగా మాట్లాడుతున్నారు. మరి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవుల గురించి ఆయన ప్రస్తావించ లేదు. పిల్లల ఆధారంగా ఆ పదవులకు అర్హతలు, అనర్హతలపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పలేదు. ఒక వేళ చంద్రబాబు అలా ప్రస్తావిస్తే.. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల ఉన్న వారికి ఈ పదవుల ఇస్తామని ప్రకటిస్తే తొలుత అనర్హత వేటు పడేది ఆయన కుమారుడు.. మంత్రి నారా లోకేష్‌ పైనే. నారా లోకేష్‌కు ఒకే ఒక కుమారు. సీఎం చంద్రబాబు చెబుతున్న ప్రకారం లోకేష్‌ ఆ పదవులకు అనర్హుడు అవుతారు. అందువల్లే స్థానిక సంస్థలకు పిలల్ల నిబంధనలను పరిమితం చేస్తూ మాట్లాడారని.. ఆ పై పదవుల గురించి ప్రస్తావించ లేదని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News