Chittoor Mango | సీజన్ చివర్లో చిత్తూరు ‘తోతాపురి మామిడి పండగ’

క్వింటాల్ మద్దతు ధర రూ.1,490. కేంద్రం నుంచి 130 కోట్లు విడుదల;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-22 14:59 GMT

ఈ ఏడాడి మామిడీ సీజన్ చివరి దశకు చేరుకున్న స్థితిలో చిత్తూరు జిల్లా మామిడి రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం కరుణించింది. క్వింటాల్ తోతాపురి మామిడికి రూ.1,490 మద్దతు ధర ప్రకటిచిం. అది కూడా 50:50 నిష్ప‌త్తిలో కేంద్రం, ఏపీ రాష్ట్రం మ‌ద్ధ‌తు ధ‌ర‌ను రైతులకు చెల్లించ‌నున్నాయి. ఆ నగదు నేరుగా రైతుల ఖాతాకే జమ చేయడానికి చర్యలు తీసుకున్నారు. జిల్లాలో తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు రూ.130 కోట్ల విడుదలకు కేంద్రం అంగీకరించింది.

ఆదుకోని రూ.12
సీజన్ ప్రారంభమైన తరువాత ఆలస్యంగా జిల్లాలో తోతాపురి మామిడి కాయలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 12 గిట్టుబాటు ధర ప్రకటించింది. అందులో రూ.4 రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే, రూ. 8 మామిడిగుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేసే విధంగా నిర్ణయించారు. దీనికి జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమలు అంగీకరించకున్నా, బలవంతంగా ఒప్పించారు.
దగా పడిన రైతు
గుజ్జు పరిశ్రమల వద్ద ఏర్పాటు చేసిన ర్యాంపుల వద్ద కిలో తోతాపురి మామిడికి కనీసంగా రూ.1.50 నుంచి రెండు రూపాయలు కూడా దక్కలేదు. మామిడి దిగుబడి గణనీయంగా పెరిగింది. గుజ్జు పరిశ్రమలు పూర్తి స్థాయిలో ప్రారంభించని స్థి తిలో దిగుబడి కొనుగోలు చేయలేకపోయాయి. దీంతో రోజుల తరబడి ట్రాక్టర్లలో పడిగాపులు కాసిన రైతులు తీరా ఫ్యాక్టరీ వద్దకు వెళ్లే సరికి ఉష్ణోగ్రతల దెబ్బకు మాగిపోయాయి. వాటిని కొనుగోలు చేయడానికి గుజ్జ పరిశ్రమల యజమానులు నిరాకరించిన నేపథ్యంలో కన్నీటితో కాలువల్లో పారబోశారు.
చంద్రగిరి నియోజకవర్గంలో మార్కెట్ వద్ద పడిపోయిన ధర వల్ల కోత కూలీ, రవాణ ఖర్చులు కూడా దక్కక రోడ్ల పక్కన మామిడికాయలు పారబోశారు.
రంగంలోకి వ్యవసాయ శాఖ మంత్రి
ఈ సంవ‌త్స‌రం అత్య‌ధిక దిగుబ‌డి రావ‌డంతో మామిడి ధ‌ర త‌గ్గుముఖం ప‌ట్టింది. జిల్లాలోని పరిస్థితిపై రైతుల నిరసనలు మిన్నంటాయి. దీనిపై వెలువిన కథనాలతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు చిత్తూరు జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించి రైతులతో, ప‌ల్ప్ ఫ్యాక్ట‌రీ ప్ర‌తినిధుల‌తో నిర్వహించిన సమావేశాలతో అభిప్రాయాల‌ను సేక‌రించారు.
ఈ సమాచారం సీఎం ఎన్. చంద్రబాబుకు మంత్రి అచ్చన్నాయుడు నివేదించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర ఆదుకోవడం లేదనే విషయాన్ని గ్రహించారు.
గత నెలలో ఢీల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మం త్రి శివ‌రాజ్ సింగ్ చౌహ‌న్ ను క‌ల‌సి తోతాపూరి మామిడి రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లను వివరించారు. స‌బ్సీడి న‌గ‌దులో 50:50 నిష్ప‌త్తిలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు న‌గ‌దును చెల్లించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.
సానుకూల స్పందన
మంత్రి అచ్చెన్నాయుడు అభ్య‌ర్ధ‌న‌ను ప‌రిశీలించిన కేంద్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం తోతాపూరి మామిడి క్వింటాకు రూ.1,490 ను కేంద్రం ప్ర‌క‌టించింది.
దీనివల్ల 50:50 నిష్ప‌త్తిలో కేంద్రం, ఏపీ రాష్ట్రం మ‌ద్ధ‌తు ధ‌ర‌ను చెల్లించ‌నున్నాయి. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో న‌గ‌దు జమ కానుంది.
హ‌ర్షణీయం
తోతాపూరి మామిడికాయలు క్వింటాకు రూ.1,490 ను కేంద్రం ప్ర‌క‌టించ‌డంపై రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
"మామిడి రైతుల న‌ష్టం రాకూడ‌ద‌నే కిలో రూ. 12 గిట్టుబాటు ధర ప్రకటించాం" అని మంత్రి అచ్చన్నాయుడు గుర్తు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా కేజీ మామిడికి 4 రూ స‌బ్సిడీ ని అంద‌చేశామ‌ని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన ధరను మామిడి రైతులకు ఏపీ ప్రభుత్వం అందచేసిందని తెలిపారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎం చంద్రబాబునాయుడు , కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ లకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Similar News