నాటి శత్రువులంతా.. ఒకటయ్యారు..!

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆంధ్రలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. చిత్తూరులో రాజకీయ శత్రువులంతా ఒక్కటై పోయారు. ఒకరికొకరు పూర్తి మద్దతు ప్రకటించుకుంటున్నారు.

Update: 2024-03-10 08:52 GMT
సీకే బాబు, ఏఎస్ మనోహర్, గురజాల జగన్ మోహన్

ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్ - తిరుపతి



చిత్తూరులో రాజకీయ శత్రువులందరూ ఒకటయ్యారు. ఆ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలది మొదటి నుంచి వేర్వేరు దారులే. తమ రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీ అభ్యర్థికి అండగా నిలిచారు. వారి నివాసాల్లో ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమావేశాలకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్‌కు భరోసా ఇచ్చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. చిత్తూరులో జరిగిన పరిణామం పరిశీలకులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

మారిన సమీకరణలు..

చిత్తూరు నగరంలో రాజకీయ పరిస్థితులు, సమీకరణలు శరవేగంగా మారిపోయాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగి, సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సీకే బాబు.. టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్‌కు మద్దతు ప్రకటించారు. రెండు రోజుల క్రితం సీకే బాబు తన నివాసంలో అనుచరులు, అభిమానులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్‌కు అండగా ఉంటానని అభయం ఇవ్వడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అదే కోవలో..

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ కూడా చేరిపోయారు. చిత్తూరులోని తన నివాసంలోనే అనుచరులు, అభిమానులతో శనివారం ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తన నివాసానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్‌తో చేతులు కలిపిన ఏఎస్ మనోహర్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 1994లో టీడీపీలో చేరిన ఏఎస్ మనోహర్ ప్రత్యర్థి సీకే బాబు చేతిలో ఓడిపోయారు. "టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. నాకు రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీకి అండగా నిలవాలనే ప్రస్తుత టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్‌కు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను" అని మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ చెప్పారు.




ఆరణికి అనివార్యం..

మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అనుచరుడిగా వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. చిత్తూరు నుంచి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా విజయానంద రెడ్డిని తెరపైకి తీసుకొని వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు టికెట్ ఇవ్వలేదు. రాజ్యసభ హామీ కూడా అమలు చేయని స్థితిలో ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో అనివార్యంగా టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్‌కు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. "గ్రేటర్ రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఉన్న ఏకైక బలిజ ఎమ్మెల్యేను నేనే.. నన్ను తప్పించారు" అని అనేక సందర్భాల్లో ఆరణి శ్రీనివాసులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రుసరసర లాడారు.

ఇప్పుడు చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన గురజాల జగన్మోహన్ నాయుడు, వైఎస్ఆర్‌సీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విజయానంద రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కులం మాట తెరపైకి తీసుకువచ్చిన ఆరణి శ్రీనివాసులు తన అనుచరులకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్న కూడా వినిపిస్తోంది. అంతేకాదు.. భిన్న ధృవాల మాదిరిగా ఉండే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు వేరువేరుగా టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్‌కు మద్దతు ఇస్తున్నారు.. వీరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది వేచి చూద్దాం.



 

తనువు చిత్తూరులో..! చూపు తిరుపతిపై..!!

భౌతికంగా చిత్తూరులో ఉన్నప్పటికీ... తిరుపతి వైపు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఓరచూపులు చూస్తున్నట్లు చెబుతున్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేన దక్కించుకుంది. ఇక్కడి నుంచి తనకు అవకాశం లభిస్తుందేమోనని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. అయితే, జనసేన చీఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్ మినహా స్థానికేతరులకు టిక్కెట్ ఇవ్వొద్దని తిరుపతిలోని టీడీపీ, జనసేన బలిజ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News