‘తిరుమల నుంచే ప్రక్షాళన’.. ప్రజాపాలన మొదలైందన్న చంద్రబాబు
ప్రమాణస్వీకారం పూర్తయిన వెంటనే చంద్రబాబు.. తిరుపతి శ్రీవారి దర్శనం కోసం వెళ్లారు. తిరుపతి నుంచి రాష్ట్ర ప్రక్షాళన ప్రారంభమవుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు గురువారం జరిగిన ప్రమాణస్వీకార వేడుకల్లో రాష్ట్ర మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మంత్రులతో సమావేశం కావాల్సిన చంద్రబాబు.. తన కుటుంబ సమేతంగా తిరుపతి శ్రీవారి దర్శనానికి బయలు దేరారు. ఈరోజు ఉదయం శ్రీవారికి దర్శించుకున్నారాయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రజలు తమ కూటమికి అందించిన చారిత్రాత్మక విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. అంతటి విజయం సాధించిన తర్వాత తమ కుల దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం మరింత ఆనందంగా ఉందని, ఈ ఆలయంలో, శ్రీవారితో తనకు ఎన్నో విడదీయలేని అనుబంధాలు ఉన్నాయని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇక్కడికి వస్తున్న సమయంలోనే అలిపిరి దాడి జరిగిందని, బాంబులు పడినా వాటి నుంచి తనను సాక్షాత్తు వేంకటేశ్వరస్వామే రక్షించారని చెప్పుకొచ్చారు.
అందుకే రక్షించారు
రాష్ట్రానికి, తెలుగు జాతికి మరింత సేవ చేయాల్సి ఉందనే ఆరోజు అలిపిరి దాడి నుంచి తనను వేంకటేశ్వరస్వామి కాపాడారని తాను ఇప్పటికీ విశ్వసిస్తున్నానని, దానిని ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజలు కూడా పునరుద్ఘాటించారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే తన లక్ష్యం అని, ఆ దిశగానే తన కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టడమే తన ధ్యేయంగా వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం, వెనకడుగు వేయడం అన్న మాటలకు కూడా తావివ్వనని తేల్చి చెప్పారు.
తిరుమల నుంచే ప్రక్షాళన
రాష్ట్రంలో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో అదే విధంగా ఆ సంపదను ప్రతి పేదవాడికి చేరేలా చేయడం కూడా ముఖ్యమేనని వివరించారు. పేదరికం లేని రాష్ట్రాన్ని సృష్టించాలన్న ఆశయంతోనే ముందుకు సాగుతానని చెప్పారు. అనంతరం తిరుమల దేవస్థానం ఎంతో పవిత్రమైనదని ఇటువంటి స్థలాన్ని అపవిత్రం చేయడం సమంజసం కాదని వివరించారు. ఐదేళ్లలో తిరుమలను అధ్వాన్నంగా మార్చారని, వేంకటేశ్వరస్వామిని ఊరూరా తిప్పుతూ పెళ్లి, పేరంటాలకు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల కొండపైకి మాంసాహారాన్ని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి నుంచి ప్రజాపాలన మొదలైందని, తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని వెల్లడించారు.