School Education Department | స్కూళ్లపై పర్యవేక్షణకు క్లస్టర్ విధానం
పంచాయతీకి ఓ మోడల్ స్కూల్. గ్రామానికి ఓ ఆదర్శ పాఠశాల. ఈ విధానంతో ఎంఈఓల అధికారాలు తగ్గవని విద్యా శాఖ డైరెక్టర్ వెల్లడించారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-01-28 02:17 GMT
పాఠశాల విద్య సంస్కరణలకు ప్రభుత్వం బీజం వేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో పాఠశాలలపై పర్యవేక్షణ పెంచడానికి క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు స్పష్టం చేశారు.
పాఠశాల విద్య బలోపేతం, నూతన విద్యా విధానంపై సోమవారం రాత్రి తిరుపతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.ఈ సదస్సుకు తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, సుమిత్ కుమార్, కడప ఆర్జేడీ శామ్యూల్, తిరుపతి, చిత్తూరు డీఈఓలు కెవి. ఎన్ కుమార్, వరలక్ష్మి, ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎంలు హాజరయ్యారు.
"పాఠశాల విద్యలో తెచ్చే మార్పులు, జీఓ 117 రద్దు, నూతన క్లస్టర్ విధానంతో ప్రయోజనాలను" విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు వివరించారు. విద్యారంగం బలోపేతానికి మానవవనరుల విభాగంలో మేధావులతో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎంపీ యూపీ పాఠశాలలో 6, 7, 8 తరగతులు ఉన్నచోట విద్యార్థుల సంఖ్య ఆధారంగా హైస్కూళ్లు ఏర్పాటు చేయాలన్నారు.
క్లస్టర్ విధానం..
"స్కూళ్లపై ఎంఈఓ పర్యవేక్షణ చేస్తున్నారు. దీని వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చాం" అని విజయరామరాజు చెప్పారు. క్లస్టర్ పరిధిలోని స్కూళ్లపై ఆ క్లస్టర్ హెచ్ఎం రోజూ పర్యవేక్షణ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందన్నారు. దీనివల్ల "ఎంఈఓలకు ఇబ్బంది తలెత్తదు. అధికారాల్లో మార్పులు ఉండబోవు" అని ఆయన స్పష్టం చేశారు. ఎంఈఓలకు కౌన్సిలింగ్ కాకుండా, తహసీల్దార్లు, ఎంపీడీఓల మాదిరిగానే బదిలీల ప్రక్రియ ఉంటుదన్నారు.
పంచాయతీకి ఓ మోడల్ స్కూల్
ప్రతి గ్రామ పంచాయతీలో ఓ మోడల్ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు చేస్తామని పాఠశాల విద్య కమిషనర్ చెప్పారు. విద్యార్థులు తక్కువగా ఉన్న3,4,5 తరగతులను 2,3 కి.మీ దూరంలో ఉండే మోడల్ ప్రైమరీ స్కూళ్లకు పంపించాలన్నారు. వారి తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని సూచించిన ఆయన పిల్లలకు రవాణా చార్జీలు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలను ఇకపై కొనసాగించే ఉద్దేశం లేదన్నారు. మోడల్ ప్రైమరీ స్కూల్ విధానంలో ప్రతి తరగతికి ఒక టీచర్ ఉంటారని, పిల్లలకు కూడా మంచి విద్య అందుతుందన్నారు. ఏకోపాధ్యాయ స్కూళ్లను బేసిక్ ప్రైమరీ స్కూళ్లుగా మార్పు చేయాలని ఆదేశించారు.
గ్రామానికి ఓ ఆదర్శ పాఠశాల
పాఠశాల కేంద్రంగా అమలు అవుతున్న విద్యావిధానాలు క్షేత్ర స్థాయిలో ఆచరణాత్మకంగా సత్ఫలితాలు సాధించాలని తెలిపారు. పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంఈఓలు, హెచ్ఎంలను ఆదేశించారు. పాఠశాలల విద్యార్థుల నమోదులో తప్పులు ఉన్నాయి. వాటిని సరిదిద్ది, ఆన్ లైన్ లో నమోదు చేయాలని సూచించారు.
వేటు తప్పదు..
తిరుపతి, చిత్తూరు డీఈఓలు, హెచ్ఎంలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు మాట్లాడారు. తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య , గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డిఓలు రామ్మోహన్, భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో 80 మంది విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చూడడంతో పాటు ఒకో తరగతికి ఒక టీచర్ ఉండాలన్నారు. తిరుపతి జిల్లాలోని కొన్ని మండలాల్లో బోగస్ విద్యార్థుల ఎన్రోల్మెంటు సంఖ్య 2 వేలకు పైగానే ఉందని, ఈ విషయంలో బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.